‘కాళేశ్వరంలో అవినీతి చేసింది హరీష్ రావే’
ఇష్టారాజ్యంగా అవినీతి చేసినందుకే పదవి పీకి పక్కనబెట్టారన్న కవిత.;
కాళేశ్వరం కమిషన్ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు పంపాలని డిసైడ్ అయింది. దీనిపై తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏడాది పాటు పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి నివేదిక ఇచ్చినా, ఆ నివేదికపై అసెంబ్లీ సాక్షిగా నాయకులు పది గంటల పాటు చర్చించినా.. అసలు కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఎక్కడ చూసినా అవినీతి జరిగిందా? లేదా? అన్నదే చర్చగా ఉంది. కానీ ఇప్పుడు ఈ చర్చలకు కవిత తెరదించారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా అసలు అవినీతి ఎవరు చేశారో కూడా చెప్తూ మరో సంచలనం సృష్టించింది.
కవిత కామెంట్స్ దెబ్బతో కల్వకుంట్ల ఫ్యామిలీ కలహలంలో కీలక మలుపు వచ్చింది. ఇన్నాళ్లూ కవిత టార్గెట్ కేటీఆర్ అని తెలంగాణ అంతా అనుకుంటుండగా.. తాజాగా కవిత చేసిన కొన్ని కామెంట్స్ అందరినీ షాక్‌కు గురిచేశాయి. కవిత టార్గెట్ కేటీఆర్ కాదా..! అంటూ అంతా నోళ్లెళ్ల బెడుతున్నారు. కవిత అసలు టార్గెట్ హరీష్ రావా అని విస్తుబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కవిత చేసిన కామెంట్స్.. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాళేశ్వరం నిర్మాణం సమయంలో హరీష్ రావు అవినీతి చేశారని ఆమె వెల్లడించారు.
స్వార్థం కోసమే అవినీతి..
కేసీఆర్.. అవినీతి చేశారని వస్తున్న ఆరోపణలు వింటుంటే గుండె తరుక్కుపోయి నోరువిప్పుతున్నానన్నారు కవిత. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా? అని ఆమె ప్రశ్నించారు. ‘‘వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారు. అందుకే రెండవ టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కెసిఆర్ కి అవినీతి మరకలు. నాపై కుట్రలు చేసిన సహించాను… కానీ కెసిఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేపోతున్నా. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడు. అవినీతి అనకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. నేను.. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టమున్నట్లు రాయిస్తున్నారు. కవిత భావోద్వేగం… కేసీఆర్‌పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత’’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.