‘రేవంత్ నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా’
ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు సీఎం నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అదే విధంగా కొన్ని రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్న బీఆర్ఎస్ పొత్తు అంశంపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితో పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదని, ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరన దినోత్సవ వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటామన్నారు.
‘‘రాబోయేది మా ప్రభుత్వమే. పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు జాగ్రత్తా ఉండాలి. రాష్ట్రంలో 12 వేల కోట్ల ప్రాజెక్టులను కేవలం నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ మిస్ వరల్డ్ ఇంగ్లండ్ కంటెస్టెంట్ మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షలు నిర్వహిస్తున్నావా’’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.