మధీరలో ఒక్క ఇల్లు కట్టారా.. భట్టిని ప్రశ్నించిన హరీష్
ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదని హరీష్ రావు అన్నారు.;
తెలంగాణ కాంగ్రెస్ బడ్జెట్ లెక్కలపై మాజీ మంత్రి హరీష్ రావు పలు ప్రశ్నలు లేవనెత్తారు. గతేడాది బడ్జెట్ 2,91,159 కోట్లని గప్పాలు కొట్టిన సర్కార్.. తీరా రివైజ్‌డ్ బడ్జెట్‌లో మాత్రం 27 వేలు తక్కువ చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ అయితే అప్పట్లో 60వేల నుంచి 70వేల కోట్ల రూపాయలు తక్కువగా వస్తాయని చెప్పారు. దాంతో కాంగ్రెస్ అంచనాలన్నీ అవాస్తవాలని స్పష్టం అయింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. బడ్జెట్ అంతా అవాస్థలతో నిండి ఉంది. కాంగ్రెస్ సక్సెస్ అయింది ఒకే ఒక విషయంలో అని అది ప్రజలను ఏమార్చడంలోనే అంటూ చురకలంటించారు. ఎన్నికలకు ముందు గాల్లో మేడలు కట్టి, వాటిని నిజాలని నమ్మించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కళ్లు తేలేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎన్నికలకు ముందు కాంగ్రెస్.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అని చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పి ఇప్పుడు ప్రజల ముక్కులు పిండి ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు వసూలు చేస్తోందని మండిపడ్డారు.
‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేం ఇచ్చిన 5లక్షలకు మించి పెంచింది లేదు. ఇదే శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5లక్షల వరకే వడ్డీ అందుతుందని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. 5లక్షల వరకే వడ్డీ లేని రుణాలు అని మీరే అన్నరు. మళ్లీ మీరే తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం అని ప్రచారం చేసుకుంటున్నరు. నేను భట్టి గారిని సూటిగా అడుగుతున్నా. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వీఎల్ఆర్ వర్తిస్తుంది అనే ఉత్తర్వులు ఉంటే చూపండి. లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసిందనందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘రైతుబంధు కింద ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైంది. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కౌలు రైతులను రైతులే చూసుకోవాలంటున్నారు. ఈసారి బడ్జెట్లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టుకూలీ రూ.50 నుంచి రూ.75కు పెంచి ఇచ్చినట్లు చెప్పారు. రూ.75 కుట్టు కూలీ ఇచ్చిన మహిళా సంఘం పేరు చెప్పాలని లేకపోతే క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కాదా.. 4 ఇండ్లు కూడా కట్టలేదు. ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు రూ.లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు ఇస్తామన్నారు. ఈ సారి ప్రసంగంలో రూ. లక్ష మాయమైంది. దళిత, గిరిజనులను ప్రభుత్వం మోసం చేశారు. ఫసల్ బీమాకు రూపాయి ఇవ్వలేదని, ఫసల్ బీమా చేయట్లేదు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగానికి మా ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చామన్నారు. భూసేకరణకు రూ.1,525 కోట్లు పెట్టామని గత బడ్జెట్లో చెప్పారు. ఏడాదైనా ఒక్క ఎకరా సేకరింలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని గత బడ్జెట్లో చెప్పారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి.. ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారో చెప్పాలి’’ అని నిలదీశారు.
‘‘ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, పంటలకు బోనస్ ఇస్తామని మోసం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, విద్యార్థులకు భరోసా కార్డు పేరుతో మోసం చేశారు. ఆదాయం పెంచి హామీలు నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యం వల్ల రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడింది. రాష్ట్ర ఆదాయం క్షీణిస్తున్న సమయంలో ఏం చేయాలో భట్టి విక్రమార్క చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలు సరిచేసుకోవాలి లేదా రేవంత్రెడ్డి ఫార్ములా ప్రకారం భూములు అమ్మాలి. ఎనుముల వారి పాలనలో ఎన్ని భూములు ఖతం పట్టిస్తారో తెలియదు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముని వేలం చేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. టీజీఐఐసీ భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు. హెచ్ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ.20 వేల కోట్లు అప్పు తెస్తామని చెప్పారు. ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇంకా 14 వేల ఎకరాలు లాక్కుంటాం అంటున్నారని విమర్శించారు. ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారన్నారు. ఈరోజు బరాబర్ భూములు అమ్ముతాం అంటున్నారు’’ అని మండిపడ్డారు.
జాబ్ లెస్ క్యాలెండర్.. అంతా అంకెల గారడీ
‘‘జాబ్ క్యాలెండర్ కాస్తా, జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యింది. జాబులేవి అని అడిగితే నిరుద్యోగుల వీపులు పగలగొట్టారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. యువతకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. తుది దశలో ఉన్న ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరం పూర్తిచేస్తమని గత బడ్జెట్ లో అన్నరు. ఒకవేళ పూర్తయితే 6 ప్రాజెక్టుల పేర్లు చెప్పండి. లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ అనేది రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రం. కానీ రాష్ట్ర ప్రభుత్వానిది అంకెల గారడీ తప్ప, అమలు ఉండదా. ఇంత దారుణమా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటరు అనే కనీస ఆలోచన కూడా లేదా? అంకెలు చూస్తే ఆర్భాటం... పనులు చూస్తే డొల్లతనంలా ఉంది’’ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.