తెలంగాణ ప్రాజెక్ట్‌లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ
తెలంగాణ ప్రాజెక్ట్‌ల అనుమతుల్లో జాప్యం జరుగుతోందని, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.;
తెలంగాణ ప్రాజెక్ట్‌లకు అనుమతులు అందడంలో జాప్యం జరుగుతోందని, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ విషయాలను వివరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసిల గోదావరి నీటిని పెన్నాబేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయని చెప్పారు. విభజన చట్టం ప్రకారం గోదావరి-కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘనే అవుతుందని వివరించారు.
‘‘చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రెండు లేఖలు రాయడం పట్ల ఆందోళన. కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసిలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండడం శోచనీయం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు TAC అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ NOC జారీపై కేంద్రం జోక్యం అవసరం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేనిదని ఆరోపించారు. మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌ల ద్వారా సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి’’ అని అన్నారు.
‘‘వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు 1 టీఎంసి నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదు. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతుల సాధనలో విఫలమవడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలి’’ అని కోరారు.