తెలంగాణలో 588 మండ‌లాల్లో హీట్ వేవ్ వార్నింగ్

తెలంగాణలో మండుతున్న ఎండల బారినుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం హీట్ వేవ్ యాక్ష‌న్ ప్లాన్‌ ను రూపొందించింది;

Update: 2025-05-02 15:06 GMT
తెలంగాణలో మండుతున్న ఎండలు

తెలంగాణ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2025ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సచివాలయంలో విడుదల చేశారు. వ‌డ‌గాలుల‌ ప్రభావంతో వ‌డ‌దెబ్బ సోకి మరణిస్తే ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.4 ల‌క్ష‌ల‌కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చెప్పారు. 12 ప్రభుత్వ శాఖ‌లు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకొని, వడగాలుల బారి నుంచి ప్రజలను కాపాడాలని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఏడాది ఎండ‌లు ,వ‌డ‌గాలులు అధికంగా వీచే అవ‌కాశం ఉంద‌ని జూన్ వ‌ర‌కు కూడా అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని ఐఎండి అధికారులు చేసిన హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై 12 సంబంధిత శాఖ‌ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో స‌మీక్షాస‌మావేశం నిర్వ‌హించారు.


జిల్లాకు ఒక నోడల్ అధికారి
తెలంగాణ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌, ఇండియ‌న్ మెట్రాలాజిక‌ల్ శాఖ క‌లిసి స‌మ‌గ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్ష‌న్ ప్లాన్ (HAP)-2025 ను (Telangana Heatwave Action Plan) రూపొందించాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాకు ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించామని తెలంగాణ విప‌త్తుల నిర్వ‌హ‌ణాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వ‌డ‌గాల్పుల దృష్ట్యా చ‌లివేంద్రాల్లో తాగునీటితోపాటు ఓఆర్ఎస్, మ‌జ్జిగ ప్యాకెట్లను స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.సీఎస్ ఆర్ కింద వివిధ కంపెనీలు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు స‌ర‌ఫ‌రా చేసేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయన ఆదేశించారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం,మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నిజామాబాద్‌, కొత్త‌గూడెం, మెద‌క్‌, కరీంన‌గ‌ర్ త‌దిత‌ర నగరాలపై ప్ర‌ధానంగా దృష్టిసారించాల‌ని అరవిందకుమార్ సూచించారు



 588 మండ‌లాలు వ‌డ‌గాలుల ప్ర‌భావిత ప్రాంతాలు

తెలంగాణలో 612 మండ‌లాల్లో 588 మండ‌లాల‌ను వ‌డ‌గాలుల ప్ర‌భావిత ప్రాంతాలుగా వ‌ర్గీక‌రించామ‌ని తెలంగాణ విప‌త్తుల నిర్వ‌హ‌ణాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని గ‌త‌నెల 15న హీట్‌వేవ్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్ట‌ర్‌గా నోటిఫై చేశామ‌ని ఆయనతెలిపారు.వ‌డ‌గాలుల ప్ర‌భావం సామాన్య‌ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అయినా కూడా అనుకోని ప‌రిస్ధితుల్లో ఎవ‌రైనా చ‌నిపోతే మాన‌వ‌తా దృక్ఫ‌ధంతో వ్య‌వ‌హ‌రించి త‌క్ష‌ణం ఎక్స్ గ్రేషియో అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు.

ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను అందుబాటులో ఉంచండి
ఎండ‌ల‌కు సంబంధించిన స‌మాచారం, అధిక ఉష్ణోగ్ర‌త‌ల వేళ ప్ర‌జ‌లు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుప‌త్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వ‌హ‌ణ వంటి అంశాల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్ర‌జా ఆరోగ్య కేంద్రాలు, ఆస్ప‌త్రుల‌లో ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ‌ను మంత్రి సూచించారు. వేడి ప్ర‌దేశాల‌లో ప‌నిచేసే కార్మికుల‌ను రెండు బృందాలుగా విభ‌జించి క‌నీసం గంట లేదా రెండు గంటల పాటు విశ్రాంతి ఇచ్చేలా రొటేష‌న్ ప‌ద్ద‌తి అవ‌లంభించేలా ప‌రిశ్ర‌మ‌ల‌కు సూచించాల‌ని ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ‌కు మంత్రి కోరారు.ఘ‌న వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణా కార్మికులకు అవ‌స‌ర‌మైన విశ్రాంతి, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ స‌దుపాయం వంటి వైద్య సౌక‌ర్యాల అందుబాటు వంటి విష‌యాల్లో దృష్టిసారించాల‌ని కార్మిక సంక్షేమ శాఖ‌కు సూచించారు.

తాగునీరు అందుబాటులో ఉంచండి
బ‌స్టాండ్లు, మార్కెట్లు, పర్యాట‌క కేంద్రాలు, ప్రార్ధ‌నా స్ధ‌లాల వంటి పబ్లిక్ ప్రాంతాల్లో అవ‌స‌ర‌మైన షెల్ట‌ర్లు, తాగునీరు, వేస‌విలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట‌మ్‌,ఎల్ ఇ డి స్క్రీన్ల ద్వారా ప్ర‌చారం క‌ల్పించాల‌ని స్ధానిక సంస్ద‌లు, మున్సిపాల్టీలను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ముఖ్యంగా పార్కుల వ‌ద్ద ప‌క్షులు, వీధి జంతువుల కోసం నీటి స‌ర‌ఫ‌రాను స‌మ‌కూర్చాల‌ని కోరారు.రాష్ట్రంలో గ్రామీణాభివృద్ది. పంచాయితీరాజ్ శాఖల త‌ర‌పున ప్ర‌జ‌ల‌కు క్లోరినేట్ చేసిన తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని, అవ‌స‌ర‌మైన ప్రాంతాల‌కు ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు.

ఎన్నెన్నో విపత్తులు
తెలంగాణ రాష్ట్రం పలు విపత్తులను ఎదుర్కొంటోంది. రాష్ట్రాన్ని కరవు, వరదలు, వడగళ్ల వానలు, అగ్నిప్రమాదాలు, పిడుగులు, వేడిగాలులు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో చలిగాలులు వణికిస్తుంటాయి. రాష్ట్రం ఉష్ణ తరంగాలకు ఎక్కువగా గురవుతోంది, రాష్ట్రంలోని 612 మండలాల్లో 588 మండలాలు ఉష్ణ తరంగాలకు గురవుతున్నాయి.

ఈ ప్రణాళిక ఎందుకంటే...
హైకోర్టు ఆదేశాలు,జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 2016వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో హీట్ వేవ్ ప్రణాళిక రూపొందించారు. నాటి నుంచి 2017, 2018, 2019, 2020, 2021, 2024లో హీట్ వేవ్ కార్యాచరణ ప్రణాళికను నవీకరించారు.జిల్లా పరిపాలన, విభాగాల సంసిద్ధతను నిర్ధారించడం వడదెబ్బ మరణాలు, ప్రమాదాలను తగ్గించడం ఈ హీట్ వేవ్ ప్రణాళిక లక్ష్యం. వేడిగాలుల ప్రభావం నుంచి ప్రజలను కాపాడటానికి ఈ ప్రణాళిక ఉపకరించనుంది.


Tags:    

Similar News