తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్;
తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం ఉరుములు మెరుపులతోకూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, ఉమ్మడి నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. శనివారం హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
గడిచిన 24 గంటల్లో మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని వెల్లడించింది. అత్యధికంగా మెదక్ జిల్లా చేగుంటలో 2.85 సెం.మీ వర్షపాతం నమోదైంది. నేడు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.