తెలంగాణలో భారీవర్షాలు...స్తంభించిన జన జీవనం
తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా, ఎడతెరిపిలేని భారీవర్షాలతో జనజీవనం స్తంభించి పోయింది.;
By : Saleem Shaik
Update: 2025-08-17 12:00 GMT
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో జనజీవనం స్తంభించి పోయింది. పలు జిల్లాల్లో కురుస్తున్న అతి భారీవర్షాలతో రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు అన్ని ప్రాజెక్టుల్లోనూ వరదనీటితో జలకళను సంతరించుకున్నాయి. పలు కాల్వలకు గండ్లు పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు ప్రజలకు కడగండ్లు మిగిల్చాయి. ప్రాజెక్టులు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, చెరువులు, కాల్వలకు పడిన గండ్లతో పంటలు దెబ్బతిన్నాయి.
సింగూరు కాల్వకు గండి
సింగూరు ప్రాజెక్టు లోని పుల్కల్ మండలం ఇసోజు పేట గ్రామం లో ప్రధాన కాల్వ కు గండి పడింది. వరదనీటి ప్రవాహంతో కాల్వకు గండి పడిన విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సంగారెడ్డి జిల్లా కలెక్టరుప్రావీణ్యతో కలసి పరిశీలించారు. కాల్వ కు పడిన గండి కీ వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు . రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని కోరారు .భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ఇరిగేషన్ , రెవిన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా సూచించారు.
మున్నేరు పరివాహక ప్రాంతాలకు అలర్ట్
మున్నేరు వాగు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు 14.50 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.ముందస్తూ సహాయక చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న 12 డివిజన్లలోని ప్రజలకు అవసరమైన అత్యవసర తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ఆదేశించారు.
పలు చెరువులకు గండ్లు
వట్‌పల్లి మండలం కేరూర్ గ్రామంలో ఊరకుంట చెరువు అలుగుపారింది. దీంతో పలు కాలనీలకు వెళ్లే రోడ్డు నీట మునిగాయి. గౌతాపూర్, ఉసిరకపల్లి గ్రామాల్లో ఇళ్ల గోడలు కూలిపోయాయి. అందోల్ మండలంలోని కన్‌సాన్‌పల్లి పెద్ద చెరువు అలుగు పారడంతో చేపల కోసం గ్రామస్థులు పరుగులు తీశారు. నారింజ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీవర్సాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. భీమిలి మండలం లక్ష్మీపూర్ లో ఇళ్లలోకి నీరు చేరింది. బెల్లంపల్లి కాల్ టెక్స్ కాలనీ జలమయం అయింది. కన్నెపల్లి, భీమిని, ఎర్రవాగు, నల్లవాగు, నర్సాపూర్ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. భారీవర్షాల వల్ల 135 చెరువులకు గండ్లు పడ్డాయి. కేఎల్ఐ డీ 82, డీ 63 కాల్వలకు గండ్లు పడ్డాయి.
కృష్ణమ్మ పరుగులు...
తెలంగాణ రాష్ట్రంతోపాటు కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి బేసిన్ ల పరిధిలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వరదనీటి ప్రవాహం పెరగడంతో పలు ప్రాజెక్టుల జలాశయాల గేట్లు తెరచి దిగువకు నీరు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా ప్రస్థుతం 1042,29 అడుగుల మేరకు నీరు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 882.10 అడుగుల నీరుంది. నాగార్జునసాగర్ జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్థుతం 586.90 అడుగుల నీటితో జల కళ ఏర్పడింది. పులిచింతల ప్రాజెక్టులో 171.42 అడుగుల మేరకు నీరు చేరింది.
కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టు జలాశయాల ప్రస్థుత నీటిమట్టం పట్టిక (అడుగుల్లో)
అలమట్టి ప్రాజెక్టు 1704.66
నారాయణపేట 1614.90
ఉజ్జయిని 1630.00
జూరాల 1042.29
తుంగభద్ర 1626.06
శ్రీశైలం 882.10
నాగార్జునసాగర్ 586.90
పులిచింతల 171.42
గోదావరి బేసిన్ లో ప్రాజెక్టుల్లోనూ జలకళ
గోదావరి బేసిన్ పరిధిలోని జలాశయాల్లో జలకళ ఉట్టిపడుతుంది. సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లోకి వరదనీరు చేరడంతో ఈ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరడంతో గేట్లు తెరిచారు. మరో వైపు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వరదనీరు వస్తుండటంతో నీటిమట్టం పెరుగుతుంది. కడెం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లోకి వరదనీరు చేరడంతో రైతులు పొలం పనుల్లో ముునిగారు.
గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల జలాశయ ప్రస్థుత నీటిమట్టం పట్టిక (అడుగుల్లో)
జైక్వాడి 1520.56
సింగూర్ ప్రాజెక్టు 1712.60
నిజాంసాగర్ 1396.90
శ్రీరాంసాగర్ 1082.30
కడెం ప్రాజెక్టు 691..38
శ్రీపాద ఎల్లంపల్లి 480.22
అప్పర్ మానేరు 1476.94
మిడ్ మానేరు 1013.32
లోయర్ మానేరు 893.20
లక్ష్మీ బ్యారేజ్ 303.80
సమ్మక్కసాగర్ 259.51
సీతారాం సాగర్ 158.33
భద్రాచలం 27.90