గ్రూప్-1 ర్యాంకింగ్ లిస్ట్ రద్దు..

మరోసారి మూల్యాంకనం చేయాలంటూ టీజీపీఎస్సీకి ఆదేశాలు.;

Update: 2025-09-09 07:03 GMT

గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల లిస్ట్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా పునఃమాల్యాంకనం చేయాలంటూ అధికారులకు ఆదేశించింది. సంజయ్ వర్సెస్ యూపీఏస్సీ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అంతేకాకుండా ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో మెయిన్స్ పరీక్షలనే రద్దు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. గ్రూప్‌-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు.. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జులై 7న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. తాజాగా ఈ కేసులో తీర్పును వెలువరించారు.

అసలేంటీ వివాదం..

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనాల్లో భారీ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గించారని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ రాజేశ్వరరావు.. ‘‘తెలుగులో గ్రూప్‌-1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేమిటో స్పష్టత ఇవ్వాలి. మెయిన్స్‌ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి’’ అని టీజీపీఎస్సీని ఆదేశించారు.

Tags:    

Similar News