బీఆర్ఎస్ సభపై హైకోర్టు తుది తీర్పు ఏంటంటే..!
బీఆర్ఎస్ సభకు అనుమతులు ఇవ్వడంపై ఈ నెల 17 లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేసింది.;
బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం తమ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది. అందుకోసం వరంగల్ వేదికగా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తమ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులను కూడా బీఆర్ఎస్ నేతలు సంప్రదించారు. కానీ పోలీసుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ నిర్వహించాలనుకుంటున్న సభకు పోలీసులు కావాలనే అనుమతులు ఇవ్వడం లేదని, ఈ విషయంలో పోలీసులు త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ తమ పిటిషన్‌లో పేర్కొంది. కాగా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ విచారణలో భాగంగా అనుమతులపై పరిశీలిస్తున్నామని డీజీపీ తెలిపారు. వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. బీఆర్ఎస్ సభకు అనుమతులు ఇవ్వడంపై ఈ నెల 17 లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు వరంగల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే తమ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏప్రిల్ 27న అంగరంగ వైభవంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిశ్చయించింది. ఈ సభకు 10 లక్షల మంది వరకు హాజరుకావొచ్చని పార్టీ అంచనా వేసింది.