ఓజీ సినిమాకు హైకోర్టు షాక్

సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.

Update: 2025-09-24 10:26 GMT
OG Movie

ఏపీ డిప్యుటి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు(Telangana High Court) తాజా నిర్ణయంతో ఓజీ సినిమాకు(OG Movie) తెలంగాణలో గట్టి దెబ్బ తగిలినట్లే అనుకోవాలి. 25వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. 24వ తేదీ బుధవారం అర్ధరాత్రి నుండే షోలు వేయటానికి చాలా థియేటర్లు ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రముఖ హీరోలు నటిస్తున్న సినిమాలకు మూడునాలుగురోజులు లేదా వారంపాటు కూడా టికెట్ల రేట్లు పెంచుకోవటానికి తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక ఉత్తర్వులు జారీచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేక ధరలు అన్నముసుగులో భారీదందాలు జరుగుతున్నాయి. ఇపుడు ఓజీ సినిమానే తీసుకుంటే టికెట్ ధర ఏపీలో వెయ్యిరూపాయలకు అమ్ముకునేందుకు చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రభుత్వం అనుమతిచ్చింది. దాన్ని చూపించి తెలంగాణలో కూడా నిర్మాతలు టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

నిజానికి ఓజీ సినిమా టికెట్ల ధరల పెంచుకునే విషయంలో ఒక హేతుబద్దత ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ప్రభుత్వం అనుమతిస్తున్న ధరలు వేరు వాస్తవంగా అమ్ముడవుతున్న ధరలు వేరు. ఓజీ సినిమాకు 50 రూపాయల టికెట్ ను 800 రూపాయలకు అమ్ముతున్నట్లు సోషల్ మీడియాలో ఒక టికెట్ వైరల్ అవుతోంది. అలాగే అధిక ధరలకు టికెట్లు దక్కించుకున్న కొందరు వాటిని వేలంపాట పెట్టి మరీ రు. 1.3 లక్షలకు అమ్ముకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనబడుతున్నాయి. టికెట్ల ధరలు ఇష్టంవచ్చినట్లు పెంచుకోవటం అన్నది ఒక జాడ్యంగా తయారైంది.

హీరోలకు భారీ రెమ్యునరేషన్లు చెల్లిస్తున్న నిర్మాతలు ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవటానికి ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోల పేరుతో జనాల గూబలు పగులగొడుతున్నారు. సినిమాల మీద జనాలకున్న అభిమానాన్ని నిర్మాతలు అడ్డుగోలుగా క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. తాజాగా ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో హైకోర్టు వేసిన బ్రేకులకు సినిమా యూనిట్, ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.

Tags:    

Similar News