HMPV Virus | చైనాలో హెచ్ఎంపీవీ వైరస్,తెలంగాణలో ముందు జాగ్రత్తలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ప్రబలిన దృష్ట్యా తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.శ్వాసకోశ సమస్యలు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ కోరింది.;
By : The Federal
Update: 2025-01-04 13:40 GMT
చైనా దేశంలో తాజాగా మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ వైరస్) ప్రబలిన నేపథ్యంలో శనివారం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
- తెలంగాణలో ఎలాంటి హెచ్ఎంపీవీ కేసులు వెలుగుచూడనప్పటికీ, వైద్యఆరోగ్య శాఖ ముందు జాగ్రత్తతు తీసుకుంటోంది. 2023వసంవత్సరం డిసెంబరు నెలలో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్యను, గత ఏడాది డిసెంబరులో వెలుగు చూసిన రోగుల సంఖ్యతో పోలిస్తే ఎలాంటి పెరుగుదల లేదని తేలింది.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లకూడదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రప్రభుత్వం, కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం తాము చైనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణలో అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ చెప్పారు.
ఇవీ పాటించండి, తెలంగాణ వైద్యుల సూచనలు
- మీరు దగ్గినపుడు నోటికి, ముక్కుకు చేతిరుమాలు లేదా టిస్యూ పేపరును అడ్డుగా పెట్టుకోండి.
- మీరు చేతులను సబ్బు లేదా నీరు, లేదా ఆల్కాహాల్ కలిసిన శానిటైజరుతో శుభ్రం చేసుకోండి.
- జనం రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లకండి. ఫ్లూ సోకిన రోగులకు దూరంగా ఉండండి.
- మీకు జ్వరం వచ్చినా, దగ్గు, జలుబు సోకినా రద్దీ ప్రదేశాలకు వెళ్లకండి.
- సరిపడా మంచినీరు తాగడంతోపాటు పోషకాహారం తీసుకోండి.
- ఇళ్లలోకి వెంటిలేషన్, బయటి గాలి వచ్చే విధంగా చూసుకోండి.
- మీరు అనారోగ్యానికి గురైతే ఇంట్లోనే ఉండండి, బాగా నిద్రపోండి.
చేయకూడనివి...
- ఒకసారి వాడిన మీ చేతిరుమాలు, టిష్యూ పేపర్లను మళ్లీ వినియోగించవద్దు.
- అనారోగ్యానికి గురైన వారితో కలిసి ఉండకండి.
- మీరు కళ్లు, ముక్కు, నోటిని తరచూ టచ్ చేయవద్దు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకండి.
- మీరు అనారోగ్యం పాలైతే వైద్యులను సంప్రదించకుండా మెడిసిన్స్ వేసుకోవద్దు.