ఏపీలో నేరం జరిగితే తెలంగాణలో అరెస్ట్ చేస్తారా? డాక్టర్ నమ్రత ఎదురుదాడి
'అసలు మీరెవరు నన్ను అరెస్ట్ చేయడానికంటూ' ఆమె అడ్డం తిరిగారు.;
By : The Federal
Update: 2025-07-29 14:18 GMT
అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత డాక్టర్ అత్తలూరి నమ్రత ఎలియాస్ పచ్చిపాల నమ్రత రూటే సెపరేట్ అనుకుంటా. 'అసలు మీరెవరు నన్ను అరెస్ట్ చేయడానికంటూ' ఆమె అడ్డం తిరిగారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనైతిక సరోగసి (Commercial Surrogacy Racket) వ్యవహారంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రత తరఫు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో ఆమె తరఫున వారు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.
నేరం ఏపీలో జరిగింది.. అరెస్ట్ తెలంగాణలో ఎలా?
నేరం జరిగిందని చెబుతున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అయినా, తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినవారు తెలంగాణ పోలీసులు కావడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది చట్ట విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. "ఇది జ్యూరిడిక్షన్ ఉల్లంఘన" అనే కోణంలో ఈ పిటిషన్ దాఖలైంది.
35 ఏళ్ల సేవలకు ఇది న్యాయమా?
డాక్టర్ నమ్రత తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, "35 ఏళ్లుగా మహిళల వైద్య సేవలలో పని చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా లేదు. ఇప్పుడు అసత్య ఆరోపణలతో మాకు పరువు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు" అన్నారు.
ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిపై ఈ తరహా ఆరోపణలు చేయడాన్ని వారు "పునరాలోచించాల్సిన విషయం"గా అభివర్ణించారు.
ఈ కేసు చుట్టూ చట్ట పరిమితులు (jurisdictional limits), ఇద్దరు రాష్ట్రాల పోలీసుల చొరవ, కేంద్ర చట్టాలకు అనుగుణంగా సరోగసీ నియంత్రణ వంటి అంశాలు కేంద్రబిందువుగా మారాయి. ఇందులో అసలైన నేరం ఏ రాష్ట్రంలో జరిగింది? కేసు దర్యాప్తు ఎవరిచేత జరగాలి? అరెస్ట్‌లు ఎవరు చేయాలి? వంటి ప్రశ్నలకు స్పష్టత అవసరం.
వివాదానికి తెర.. లేక రూట్ మారుతోందా ?
బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందించబోతోందన్న దానిపై రెండు రాష్ట్రాల్లోని న్యాయ, పోలీస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ కోర్టు పిటిషన్‌ను సమర్థిస్తే, ఇది రాష్ట్రాల మధ్య చట్టపరమైన హద్దులపై కొత్త చర్చకు దారితీయవచ్చు.
ఈ కేసు మౌలికంగా అనైతిక సరోగసి ఆరోపణలు, రాష్ట్రాల చట్ట అధికార పరిమితులు, న్యాయ ప్రక్రియలో సమర్థత, అన్నీ కలిసిన సంక్లిష్ట ఘటనగా మారనుంది. నిందితురాలికి బెయిల్ మంజూరవుతుందా? కేసు ఏ రాష్ట్రం విచారించాలి? – అన్న దానిపై కోర్టు తీర్పు ఆధారపడి ఉంటుంది.