లక్షల ఎకరాలు హాం ఫట్ ?

బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత . తాజాగా రెవిన్యు శాఖ నుండి ప్రభుత్వానికి అందిన రిపోర్టు ప్రకారం సాగుకు పనికిరాని సుమారు 2.31 లక్షల ఎకరాలు మాయమైపోయాట.

Update: 2024-03-29 08:33 GMT
Dharani portal

గడచిన పదేళ్ళలో ప్రభుత్వ భూములు పెద్దఎత్తున అక్రమంగా కొందరు పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయాయనే ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ భూములన్నీ ధరణి పోర్టల్ ద్వారానే చేతులు మారిపోయాయట. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ధరణి పోర్టల్ నిర్వహణపై విమర్శలు, ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆరోపణలు మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా రెవిన్యు శాఖ నుండి ప్రభుత్వానికి అందిన రిపోర్టు ప్రకారం సాగుకు పనికిరాని సుమారు 2.31 లక్షల ఎకరాలు మాయమైపోయాట. 2014లో సాగుకు పనికిరాని భూములు 17,78, 026 ఎకరాలుంటే 2024 లెక్కల ప్రకారం 15, 46,975 ఎకరాలున్నట్లు గుర్తించారు. అంటే పదేళ్ళల్లో 2,31, 051 ఎకరాలు ప్రభుత్వ లెక్కల్లో నుండి మాయమైపోయినట్లు రెవిన్యు అధికారులు గుర్తించారు.

2014లో సాగుభూమి ఎంతుండేది 2024లో ఎంతుందని రెవిన్యు అధికారులు లెక్కలు కడుతున్నారు. కేసీయార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ వ్యవస్ధను అమల్లోకి తెచ్చారు. నిజానికి ధరణి అమల్లోకి రాకముందు నుండే వివాదాల్లో ఇరుక్కున్నది. అయితే వివాదాలను, ఆరోపణలను కేసీయార్ లెక్కచేయకుండానే ధరణి పోర్టల్ ను 2020లో అమల్లోకి తెచ్చేశారు. దాంతో పోర్టల్ ద్వారా వివాదాలు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ విషయం ఏమిటంటే పోర్టల్లో భూములకు సంబంధించి రెండే కాలమ్లున్నాయి. అవేమిటంటే మొదటిది పట్టా భూములు, రెండోది అసైన్డ్ భూముల కాలమ్. ఈ రెండింటి పరిధిలోకి రాని జాగీర్ భూములు, దేవుడి మాన్యాలు, ఈనాం భూములను ఏ కాలమ్ లో చూపాలో జనాలకు అర్ధంకాలేదు. ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేదు. ఇలాంటి భూములు సుమారు 10 లక్షల ఎకరాలుంటాయని అంచనా.

ఎప్పుడైతే 2020లో పోర్టల్ అమల్లోకి వచ్చిందో చాలామంది అధికారపార్టీ నేతల కళ్ళు పైన చెప్పిన 10 లక్షల ఎకరాలపైన పడిందట. దాంతో శక్తి ఉన్న వాళ్ళంతా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయరనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పైన చెప్పిన 10 లక్షల ఎకరాల్లోనే ఎక్కువభాగం బీఆర్ఎస్ కీలక వ్యక్తుల చేతుల్లోకి, వాళ్ళ బినామాల ఖాతాల్లోకి చేరినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాలను రేవంత్ రెడ్డి అండ్ కో ప్రతిపక్షంలో ఉన్నప్పటినుండి పదేపదే ఆరోపిస్తున్నారు. ఇదేసమయంలో పోర్టల్లో భూముల నమోదులో ఏదన్నా సమస్యలు వస్తే వాటిని సరిచేసే వ్యవస్ధ లేకుండాపోయింది. ఎంఆర్వో, కలెక్టర్లు కూడా సమస్యలను పరిష్కరించకుండా చేతులెత్తేశారు. దాంతో ధరణి పోర్టల్ బాగా వివాదాస్సదమైపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిలో ధరణిపోర్టల్ సమస్యలు కూడా కీలకమనే చెప్పాలి.

ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. జరిగిన అక్రమాలు, బాధ్యుల వివరాలను తొందరలోనే శ్వతేపత్రం ద్వారా జనాలకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సమయంలోనే సాగుకుపనికిరాని సుమారు 2.31 లక్షల ఎకరాలు రికార్డుల్లోనుండి మాయమైపోయిందని రెవిన్యు అధికారులు గుర్తించారు. పైన చెప్పిన 10 లక్షల ఎకరాల్లోనే ఈ 2.31 లక్షల ఎకరాలు కూడా ఉన్నాయా ? లేకపోతే దీని లెక్క వేరేనా అన్న విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇదే విషయమై రియల్ ఎస్టేట్ వ్యాపారి ముత్యాల సాయిరమేష్ మాట్లాడుతు ధరణి పోర్టల్లో సమస్యలున్న మాట నిజమే కాని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నంత లేవన్నారు. ధరణి వ్యవస్ధను తెచ్చినపుడు అసైన్డ్, పట్టా అనే రెండు కాలమ్ లు మాత్రమే పెట్టడం పెద్ద సమస్యగా మారిందన్నారు. పై రెండు కాలమ్ల పరిధిలోకి రాని సుమారు 10 లక్షల ఎకరాల పైనే అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల కళ్ళు పడ్డాయన్నారు. దాంతోనే పోర్టల్ నిర్వహణపై విపరీతమైన ఆరోపణలు వచ్చినట్లు గుర్తుచేశారు.

ఇదే విషయమై ధరణి పోర్టల్ లో అక్రమాలపై పోరాటాలు చేసిన మన్నె నరసింహారెడ్డి ఫెడరల్ తో మాట్లాడుతు తనకు సంఖ్య సరిగా తెలీదు కాని భారీ ఎత్తునే చేతులు మారినట్లు చెప్పారు. 2014 ముందు రెవిన్యు రికార్డులను పరిశీలిస్తే కాని ఇప్పటి భూముల వాస్తవ వివరాలు తెలియవన్నారు. అందుకనే ప్రతి రెవిన్యు గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ప్రభుత్వ యంత్రాంగమే సక్రమంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. అప్పటి అధికారపార్టీ నేతల చేతుల్లోకి పెద్దఎత్తున భూములు వెళ్ళిందన్నది వాస్తవమని మన్నె చెప్పారు.

Tags:    

Similar News