కేసీఆర్‌కు ఏమైంది..?

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంవంతులు కావాలని ఆకాంక్షించిన సీఎం రేవంత్.;

Update: 2025-07-03 16:44 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఏమైంది? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. గురువారం సాయంత్రం సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్‌.. యశోధ ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని ప్రచారం జరిగింది. అంతా అదే నిజమనుకున్నారు. నెల రోజుల్లోనే ఆయన రెండోసారి ఆసుపత్రికి చేరడంతో.. సాధారణ వైద్య పరీక్షలే అని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి.. యశోధ ఆసుపత్రి వైద్యులను ఫోన్ చేయడం, కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో పిక్చర్ అంతా మారిపోయింది. సీఎం ఫోన్ చేసి ఆరా తీశారంటే విషయం ఏదో విషమమే అయ్యుంటదన్న గుబులు ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లో కూడా మొదలైంది.

అయోమయంలో కేసీఆర్ ఆరోగ్యం..!

కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లడంతో అంతా ఏమైందా అని అనుకున్నారు. సాధారణ వైద్య పరీక్షలే అని అంతా భావించారు. ఇంతలో సోషల్ మీడియాలో, ఇతర ప్రచార సాధనాల్లో జరుగుతున్న ప్రచారాలు.. అసలు కేసీఆర్‌కు ఏమైంది? అన్న ప్రశ్నను లేవనెత్తాయి. ఒక్కోక్కరు ఒక్కోలా ప్రచారం చేస్తున్నారు. కొందరు వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చేశారని అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని అంటున్నారు. దీంతో కేసీఆర్ ఆరోగ్యంపై తీవ్ర అయోమయం నెలకొంది.

అంతా ఓకే..!

సోమాజిగూడలోని యశోధ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. వైద్య పరీక్షలు చేయించుకుని నందినగర్‌లోని ఇంటికి చేరుకున్నారు. నందినగర్‌లో ఉన్నది కేటీఆర్ నివాసం. కేసీఆర్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. సీజనల్ ఫీవర్ రావడంతో ఇంటిలోనే కేసీఆర్‌కు వైద్యులు వైద్యం అందించనున్నారు. అందుకోసం నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలోనే కేసీఆర్ మూడు రోజుల పాటు బస చేయనున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ చికిత్స అందించనున్నారని ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌కు సీరియస్‌గా ఉందా..?

ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి.. వైద్యులకు ఫోన్ చేసిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయనకు అత్యుత్తమ చికిత్స అందించాలని ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి.. రంగంలోకి దిగి ఆరా తీయడం, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం అనేక అనుమానాలకు దారితీసింది. కేసీఆర్‌కు సీరియస్‌గా ఉందని, అభిమానులు, అనుచరులు అందోళన పడకూడదనే సమాచారాన్ని బయటకు చెప్పట్లేదన్న టాక్ మొదలైంది. కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి తీవ్రంగా క్షీణించిన కారణంగానే ఆయనతో పాటు యశోధ ఆసుపత్రికి కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు కూడా వెళ్లారని అంటున్నారు విశ్లేషకులు.

అయోమయంలో ప్రజలు..

కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న రకరకాల ప్రచారాలతో అసలు విషయం తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. మరోవైపు కేసీఆర్‌కు ఏమైందో అని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఆందోళన అధికమవుతోంది. ఏం చెప్పలేని పరిస్థితి వల్లే వారు ఎటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Tags:    

Similar News