గర్భవతిపై భర్త దాడి.. బండరాయితో..!

10 నుంచి 12 సార్లు భర్త చేసిన దాడిలో పర్వీన్ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయింది. అనంతరం బస్రత్ అక్కడి నుంచి పరారయ్యాడు.;

Update: 2025-04-07 07:03 GMT

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవత్వం ఉనికి ప్రశ్నార్థకంగా మార్చే ఈ ఘటనను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. ఎండీ బస్రత్ అనే వ్యక్తి తన భార్యపై చేసిన దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అతడిపై కఠినాతికఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే.. వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్, షబానా పర్వీన్ దంపతులు. వీరిద్దరూ హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. షబానా ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. మార్చి 29న ఆమె అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందుకున్న పర్వీన్‌ను ఏప్రిల్ 1న డిశ్చార్జ్ చేశారు.

ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే దంపతులిద్దరి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం కాస్తా ఘర్షణ కిందకు మారింది. ఈ క్రమంలో పర్వీన్ కిందపడిపోయింది. అదే అదునుగా తీసుకున్న భర్త.. పక్కనే ఉన్న బండారాయిని తీసుకుని భార్యపై దాడి చేశాడు. తల, వంటిపై పలుసార్లు దాడి చేశారు. 10 నుంచి 12 సార్లు భర్త చేసిన దాడిలో పర్వీన్ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయింది. అనంతరం బస్రత్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు షబానాను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఏప్రిల్ 3న బస్రత్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా ఈ దాడికి కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత విచారణ చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు.

Tags:    

Similar News