సీఎం రేవంత్ దృష్టికి హుసేన్‌సాగర్ కబ్జా కథ

హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలోని 10 ఎకరాల్లో వెలసిన కబ్జాల బాగోతం తాజాగా వెలుగుచూసింది.

Update: 2024-09-10 23:33 GMT

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ జలాశయం ఆక్రమణల పాలైంది. సచివాలయం, ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్షూపం పక్కనే ఉన్న హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతంలోని 10 ఎకరాల్లో ప్లాట్లు వేయడంతోపాటు భవనాలు నిర్మించారు.

- హుసేన్ సాగర్ జలాశయం మూడు వైపులా మణిహారంలా నిర్మించిన నెక్లెస్ రోడ్డు నిర్మించారు. దీంతో పాటు పీవీ స్మారక స్థూపం, జలవిహార్, రెస్టారెంట్లు వెలిశాయి. 4101 ఐడీ నంబరుతో ఉన్న హుసేన్ సాగర్ జలాశయం పరిధిలోని సర్వే నంబరు 194 పరిధిలోని పది ఎకరాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.
- ఖైరతాబాద్ ప్రాంతంలోని సర్వే నంబరు 194 పరిధిలోని పది ఎకరాల కబ్జాపై చెరువుల పరిరక్షణ ఉద్యమ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ తెలంగాణ హైకోర్టులో 2020 వ సంవత్సరంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ధరణిలోనూ ప్రభుత్వ భూములే...
హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న సర్వే నంబరు 194లోని 10 ఎకరాలు ప్రభుత్వ భూములుగా ధరణి రికార్డుల్లో నమోదైంది.అయినా ఈ భూములు యథేచ్ఛగా కబ్జా అయ్యాయి.2020వ సంవత్సరంలో హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో గేట్లు,భవనాలను తొలగించినా, ఆ తర్వాత కబ్జాదారులు పునర్ నిర్మించారు. సర్వేనంబరు 194/8 పేరిట బాలాజీ రెసిడెన్షియల్ సొసైటీ పేరిట బోర్డు మార్చారు.


హైడ్రా ఛైర్మన్, సీఎంకు ఫిర్యాదు
చెరువుల్లోని అక్రమ భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో హుసేన్ సాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 10 ఎకరాలను ఆక్రమించారని కాంగ్రెస్ పార్టీ క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ తెలంగాణ సీఎం, హైడ్రా ఛైర్మన్ ఎ రేవంత్ రెడ్డికి తాజాగా ఫిర్యాదు చేశారు.హుసేన్ సాగర్ ఆక్రమణలను తొలగించాలని కోరుతూ సీఎంతోపాటు హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ కలెక్టరులకు డాక్టర్ లుబ్నా ఫిర్యాదు చేశారు.

హుసేన్ సాగర్ ఉపగ్రహ ఛాయాచిత్రాలు జత చేసి...
నేషనల్ రీమోట్ సెన్సింగ్ ఏజెన్సీ2010, 2016 సంవత్సరాల్లో తీసిన చిత్రాలు, 2024 ఫిబ్రవరిలో గూగుల్ ఎర్త్ నుంచి సేకరించిన హుసేన్ సాగర్ ఉపగ్రహ చిత్రంతో పోలిస్తే, ఈ సరస్సు కబ్జా బాగోతం బయటపడుతుంది. హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కాడాస్ట్రాల్ మ్యాప్ ను పబ్లిక్ డొమైన్ లో అధికారులు ఉంచక పోవడంపై డాక్టర్ లుబ్నా సార్వత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్సు ఉపగ్రహ చిత్రాలను డాక్టర్ లుబ్నా మీడియాకు విడుదల చేశారు.

ఆక్రమణలను తొలగించండి
హుసేన్ సాగర్ సరస్సు పరిధిలోని 194 సర్వే నంబర్లలో వెలసిన భవనాలను తొలగించి, ఆ స్థలాన్ని చెరువులోకి కలుపుతూ తక్షణం డ్రెడ్జింగ్ చేయాలని డాక్టర్ లుబ్నా సార్వత్ డిమాండ్ చేశారు. ఈ సరస్సు కబ్జాలకు కారణమైన కబ్జాదారులపై, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా కోరారు.భారత రాజ్యాంగంలోని పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 48ఎ ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

తగ్గిన సున్నం చెరువు విస్తీర్ణం
బాలానగర్ అల్లాపూర్ సున్నం చెరువు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో విస్తీర్ణం తగ్గింది. ఈ చెరువు విస్తీర్ణం 29.75 ఎకరాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ చెరువు విస్తీర్ణాన్ని మరో నివేదికలో 15 ఎకరాలకు తగ్గించారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల విస్తీర్ణంలో మార్పులు చేయడం వెనుక కొందరు అధికారులు కబ్జాదారులకు అండదండలందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.2012లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రంతో పోలిస్తే 2024 నాటి శాటిలైట్ చిత్రంలో చెరువు విస్తీర్ణం తగ్గిందని తేలింది.





Tags:    

Similar News