హైదరాబాద్ ప్రజల భద్రతకు ‘హైడ్రా’ ప్రథమ ప్రాధాన్యం

హైదరాబాద్ ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ‘హైడ్రా’ నిర్ణయించింది.అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైనే కాకుండా ప్రజోపయోగ పనులపై దృష్టి సారించనుంది.;

Update: 2025-04-28 03:46 GMT
మురుగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పరిరక్షణ, చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేతలు చేపట్టి హడలెత్తించిన హైడ్రా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రూటు మార్చింది. ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ఆదివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ప్ర‌మాదాల నివార‌ణ‌కు విద్యుత్‌, ఫైర్, ఇండ‌స్ట్రీ కలిసి పనిచేసేలా హైడ్రాకు చెందిన డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్సు విభాగం సమన్వయం చేయాలని ఆయన ఆదేశించారు.

- మరో వైపు ప్రజోపయోగ కార్యక్రమాలపై హైడ్రా దృష్టి సారించింది. భారీవర్షాలు కురిసినప్పుడు వరదనీటిని తొలగించడం, కూలిన చెట్లను తరలించడం లాంటి సహాయ కార్యక్రమాలు చేస్తోంది.
- మరో వైపు లాలాపేట వంతెన రోడ్డుపై ఇంజిన్ ఆయిల్ పడి వాహనచోదకులు జారి పడుతుంటే వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆయిల్ పై మట్టి, ఇసుక పోసి ప్రమాదాలను నివారించింది. ఇలా ప్రజోపయోగ పనులు చేస్తూ ప్రజల మద్ధతును కూడగట్టాలని హైడ్రా నిర్ణయించింది.

హైడ్రాపై కేసీఆర్ తాజా వ్యాఖ్యలు
‘‘మేం జేసీబీలు పెట్టి చెరువుల్లో పూడిక తీస్తే కాంగ్రెస్ పార్టీ హైడ్రా అంటూ పేదల ఇళ్లు కూలగొట్టిస్తోంది’’ అంటూ బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎల్కతుర్తి సభలో వ్యాఖ్యానించారు.మరో వైపు హైడ్రా వల్ల హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని రియల్టర్లు ఆందోళన చెందుతున్నారు.హైడ్రా నిర్వాకంతో ఇళ్ల విక్రయాలు తగ్గి, రిజిస్ట్రేషన్లు కూడా తగ్గుముఖం పట్టి ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గింది.మంచినీటి రిజర్వాయర్ల చెంత ఉన్న పెద్దల ఫాంహౌస్ లను పట్టించుకోని హైడ్రా పేదల ఇళ్లను కూలగొట్టిన నేపథ్యంలో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.



  ప్రజల భ‌ద్ర‌త‌కు నోడ‌ల్ ఏజెన్సీగా ‘హైడ్రా’

ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్యాన్నివ్వాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌సూచించారు.ప్ర‌మాదాల నివార‌ణ‌కు విద్యుత్‌, ఫైర్, ఇండ‌స్ట్రీ ఇలా ఎవ‌రికి వారు కాకుండా..ఇందుకు ఉద్దేశించిన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఒక ప్లాట్‌ఫామ్‌పైకి వ‌చ్చి ప‌ని చేయాలని రంగనాథ్ కోరారు.విద్యుత్ వినియోగంలో ఉన్న లోపాల‌ వ‌ల్లే ఎక్కువ అగ్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్న వేళ‌.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై రంగనాథ్ మాట్లాడారు. భ‌ద్ర‌త‌కు సంబంధించి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారో లేదో ప‌రిశీలించ‌డానికి సంబంధిత విభాగాల‌కు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడ‌ల్ ఏజెన్సీని రూపొందించాల‌ని ఆయన సూచించారు. విద్యుత్ వైరింగ్‌, ఎర్తింగ్‌, నాణ్య‌మైన ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాల‌ను వినియోగిస్తున్నారా లేదా అనేది త‌నిఖీ చేయాల్సిన‌వ‌స‌రం ఉందన్నారు. ప‌రిశ్ర‌మ‌లే కాకుండా అపార్టుమెంట్లు, కార్యాల‌యాలు, నివాసాల్లో కూడా భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించేలా ఈ నోడ‌ల్ ఏజెన్సీ చూడాల‌న్నారు.హైడ్రాకు చెందిన డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్సు విభాగం ఈ స‌మ‌న్వ‌యాన్ని తీసుకు రావాల‌ని రంగనాథ్ సూచించారు.



వంతెనపై ప్రమాదాన్ని తప్పించిన హైడ్రా

మూడు రోజుల క్రితం కార్యాలయాలకు వెళ్లే సమయం..లాలాపేట వంతెనపై ఇంజన్ ఆయిల్ పడింది. ద్విచక్రవాహన ప్రయాణికులు అప్పటికే కొంత మంది జారి పడ్డారు. ఆ దారిన వెళ్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం దృష్టికి వచ్చింది. అంతే క్షణాల్లో అక్కడకి చేరుకున్న హైడ్రా మట్టిని, ఇసుకను పోసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేసింది.

ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా పరిశీలన

ప్రతీ సోమవారం ప్రజలు ఇస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి హైడ్రా ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాదర్గుల్ గ్రామంలో 230 ఎకరాల పరిధిలో వేసిన లే ఔట్ లో కొంత భాగంలో చేసిన కబ్జాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.



 ఫిర్యాదులపై పరిశీలన

పటాన్ చెరు ప్రాంతంలో ప్రణీత్ కౌంటీ కి ఆనుకుని వెళ్తున్న నక్కవాగు నాలా కబ్జాను హైడ్రా అధికారులు పరిశీలించారు. నాలా వెడల్పు బఫర్ జోన్ తో కలిపి 36 మీటర్లుండాల్సి ఉండగా సగం వరకు కబ్జా చేసినట్టు గుర్తించారు. నిబంధనల మేరకు నాలా వెడల్పు లేని పక్షంలో ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.మసీదు బండ ప్రాంతంలోని జంగంకుంట తనదిగా చెప్పుకొని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో కమిషనర్ పరిశీలించారు.అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డి పేటలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదును పరిశీలించారు.నెక్నంపూర్లో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద రోడ్డు కు అడ్డంగా ప్రహరీ నిర్మించి దారిని బంద్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు. నెక్నంపూర్ లే ఔట్ లో పారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా ఫిర్యాదును తనిఖీ చేశారు.గండిపేట మండలం నెక్నంపూర్ సర్వే నెంబర్ 20 లో ప్రభుత్వ భూమి కబ్జాను పరిశీలించారు.

మురుగునీటికి చెక్‌పెట్టిన హైడ్రా
మురుగు నీటి పైపు లైన్ల‌లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొల‌గించే సీవర్ క్రోక్ రోబోటిక్ ప‌రిక‌రం ప‌నితీరును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు.రోబోటిక్, వాటర్-జెట్ శక్తితో నడిచే ఈ పరికరం సిల్ట్‌ను తొల‌గించే విధానాన్ని గ‌మ‌నించారు.మురుగు ముప్పు ఉన్న‌ ప్రాంతాల‌ను పైల‌ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని అక్క‌డ ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది.

24 గంట‌ల్లో మురుగు ముప్పును తొల‌గించిన హైడ్రా
ఫిర్యాదు స్వీక‌రించిన 24 గంట‌ల్లోనే మురుగు స‌మ‌స్య‌కు హైడ్రా ప‌రిష్కారం చూపింది. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా దుండిగ‌ల్ మండ‌లం మ‌ల్లంపేట‌లోని రామ‌చంద్ర‌య్య కాల‌నీకి మురుగు ముప్పును తొల‌గించింది. చెన్నం చెరువు నుంచి రేళ్ల‌కుంట‌కు వెళ్లే కాలువ‌కు మ‌ధ్య‌లో ఆటంకాలు సృష్టించ‌డంతో రామ‌చంద్ర‌య్య కాల‌నీలో కొంత భాగం మురుగు ముప్పును ఎదుర్కొంది. మీట‌రుకు పైగా ఇళ్లు మురుగులో మునిగిపోవ‌డంతో అక్క‌డి నివాసితులు ఇళ్ల‌ను ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. మురుగు నీటిలో మా ఇళ్లు నీట మునిగాయ‌ని, నెల రోజులుగా ఇళ్లు ఖాళీ చేసి బ‌య‌ట త‌ల‌దాచుకుంటున్నామ‌ని రామ‌చంద్ర‌య్య కాల‌నీ వాసులు హైడ్రా ప్ర‌జావాణిలో సోమ‌వారం ఫిర్యాదు చేశారు. దుండిగ‌ల్ మున్సిపాలిటీలోని చెన్నం చెరువు కు నిజాంపేట మున్సిపాలిటీ మురుగు నీరు వ‌చ్చి చేరుతోంద‌ని. ఆ నీరు బొల్లారం మున్సిపాలిటీ ప‌రిధిలోని రేళ్ల‌కుంట‌కు చేరాల్సి ఉండ‌గా ఆటంకాలు ఏర్ప‌డ్డాయ‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. రామ‌చంద్ర‌య్య కాల‌నీకి ప‌క్క‌న లే ఔట్ వేసిన వారు కాలువ‌ను మూసేయ‌డంతో ఈ ఇబ్బంది త‌లెత్తింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదును గూగుల్ మ్యాప్స్‌తో పాటు శాటిలైట్ ఇమేజీల‌లో ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం హైడ్రా అధికారులు అక్క‌డ‌కు చేరుకుని మురుగు కాలువ‌ను పున‌రుద్ధ‌రించారు. దీంతో రామ‌చంద్ర‌య్య కాల‌నీలో నిలిచిన మురుగు నీరు బ‌య‌ట‌కు వెళ్లింది. ఏం చేయాలో దిక్కు తోచ‌ని ప‌రిస్థితిలో హైడ్రాకు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌గా 24 గంట‌ల‌లోపే ప‌రిష్కారం ల‌భించ‌డం ప‌ట్ల రామ‌చంద్ర‌య్య కాల‌నీ వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

చెరువుల అభివృద్ధి అభినందనీయం : ఎమ్మెల్యే కృష్ణారావు
న‌గ‌రంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు అభినందించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువును పైల‌ట్ ప్రాజెక్టుగా తీసుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని ఆయన చెప్పారు.చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న భూ యజమానులతో పాటు ప్లాట్లు ఉన్న‌వారికి టీడీఆర్ కింద త‌గిన న‌ష్ట ప‌రిహారం అందేలా చూడాల‌ని కోరారు.కబ్జాలకు పాల్పడిన వారు ఎవ‌రైనా.. పార్టీల‌తో సంబంధం లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

బతుకమ్మ కుంటలోనే ఉత్సవాలు
వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. బతుకమ్మ కుంటలకు సంబంధించిన కోర్టు వివాదం పరిష్కారమవడంతో ఇటీవల హైడ్రా కమిషనర్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు.బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేద మంత్రోచ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నులు జ‌ర‌గాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


Tags:    

Similar News