వీళ్ళు ఐఏఎస్ అయ్యింది ఇందుకేనా ?
నిర్ణయాలన్నీ పై స్ధాయిలోనే తీసుకున్నారని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను తాము అమలుచేసామంతే అని చెప్పారు.
అఖిల భారత సర్వీసుకు ఎంపికవ్వాలంటే అభ్యర్ధులు రేయింబవళ్ళు ఎంతో కష్టపడాలి. వివిధ దశల్లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో మంచి మార్కులతో పాసవ్వాలి. చివరగా ఇంటర్వ్యూకి హాజరై నిపుణులు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పి వాళ్ళని మెప్పించాలి. తర్వాత అనేక వడపోతల తర్వాత అఖిల భారత సర్వీసుకు ఎంపికైన వాళ్ళ జాబితాను యూపీఎస్సీ ప్రకటిస్తుంది. పరీక్షలకు హాజరవ్వటానికి, ఇంటర్వ్యూను ఫేస్ చేయటానికి అభ్యర్ధులు రోజుకు గంటలపాటు కష్టపడతారు. చాలామంది చాలాకాలం కోచింగ్ తీసుకుంటే కొందరు మాత్రం కోచింగ్ లేకుండా సొంతంగానే ప్రిపేరవుతారు. ఏఐఎస్ లో అందరికీ తెలిసిన అత్యుత్తమైన క్యాడర్ ఏమిటంటే ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్).
ఐఏఎస్ కు ఎంపికైన అభ్యర్ధులకు ముస్సోరిలో దాదాపు రెండేళ్ళు శిక్షణ ఉంటుంది. అనేక రంగాలు, శాఖలపై వీళ్ళకు నిపుణులు పాఠాలు బోధిస్తారు. ప్రభుత్వంలో ఉండే ప్రతిశాఖలోను వీళ్ళకు మంచి అవగాహన కల్పించేట్లుగా తర్ఫీదుంటుంది. ఆ తర్వాత రాష్ట్రాలకు కేటాయించిన వాళ్ళు వివిధ శాఖల్లో క్షేత్రస్ధాయిలో పనిచేయటం ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని సంపాదిస్తారు. ఇన్ని దశల్లో, ఇంత కఠినమైన శిక్షణ ఎందుకుంటుందంటే ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడపాల్సింది వీళ్ళే కాబట్టి. సబ్ కలెక్టర్లు, కలెక్టర్లుగా అనుభవం సంపాదించిన వీళ్ళు తర్వాత వివిధ శాఖల్లో సెక్రటరీలు, ప్రిన్సుపుల్ సెక్రటరీలుగా పనిచేస్తారు.
ఇపుడిదంతా ఎందుకంటే బీఆర్ఎస్ పదేళ్ళ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దీనిలో భాగంగా ఉన్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లో అవకతవకలు, అవినీతి ఆరోపణలపైన జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న అనేకమంది ఉన్నతాధికారులను కమిషన్ విచారించింది. ఇందులో భాగంగానే ఇరిగేషన్, ఆర్ధికశాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన ఏడుగురు ఐఏఎస్ అధికారులను కూడా కమిషన్ విచారించింది. ప్రాజెక్టుల్లోని లోపాలు, అవకతవకలు, అవినీతిపై ఛైర్మన్ ఐఏఎస్ లను ప్రశ్నించినట్లు సమాచారం. ఏడుగురిలో కొందరు ఇంకా సర్వీసులోనే ఉంగా కొందరు రిటైరయ్యారు. వీళ్ళంతా వన్ టు వన్ ఏమి సమాధానం చెప్పారో తెలీదు. స్మితా సబర్వాల్, వికాస్ రాజ్, సోమేష్ కుమార్, రామకృష్ణారావు, రాహూల్ బొజ్జా, ఎస్ కే జోషి, రజత్ కుమార్ హాజరై తమ వాదనలు వినిపించారు.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వీళ్ళు చెప్పిందాంట్లో కామన్ పాయింట్ ఏమిటంటే పై ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలకు, అవినీతికి తమకు ఏమీ సంబంధంలేదని. నిర్ణయాలన్నీ పై స్ధాయిలోనే తీసుకున్నారని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను తాము అమలుచేసామంతే అని చెప్పారు. ప్రాజెక్టుల డిజైన్లు, మార్పులు, చేర్పులు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రాంతం, నిధుల వినియోగం, విడుదల, ఆయకట్ట లాంటి ఏ విషయంలో కూడా తమ పాత్రలేదని కేవలం పాలకులు చెప్పినట్లుగా మాత్రమే నడుచుకున్నట్లు చెప్పారట. నిర్మాణలోపాలపై ఛైర్మన్ వీళ్ళని ప్రశ్నించినపుడు దాంతో తమకేమి సంబంధంలేదన్నారట. వీళ్ళ వాదనలు విన్న ఛైర్మన్ ఘోష్ అవే విషయాలను అఫిడవిట్ల రూపంలో అందించమని చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాలకులు ఏది చెబతే అది చేయటానికి, పాలకులు కోరినట్లుగా ఫైళ్ళపై సంతకాలు పెట్టడానికేనా వీళ్ళంతా ఐఏఎస్ అధికారులైంది ? అనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. పాలకులు తీసుకునే నిర్ణయాల్లో లోపాలంటే వాటిని ఎత్తిచూపి లోపాలను సరిచేయాల్సిన బాధ్యతలు ఐఏఎస్ అధికారులపైన ఉంది. వీళ్ళ సలహాలను, సూచనలను పాలకులు పట్టించుకోకుండా సంతకాలు చేయాలని ఒత్తిడి చేసినా చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే వీళ్ళ ఉద్యోగాలను ప్రభుత్వం పీకేసే అవకాశంలేదు. మహాయితే వెంటనే శాఖనుండి బదిలీచేస్తుంది. అప్రధాన్యత శాఖలో పనిచేయమంటుంది. ఐఏఎస్ అధికారుల వల్ల ప్రభుత్వానికి మంచి జరగాలి కాని పాలకులకు కాదు. పాలకులు ఈరోజుంటారు రేపు వెళ్ళిపోతారు. కాని ప్రభుత్వం, ఏఐఎస్ వ్యవస్ధ శాశ్వతం. పాలకులైనా, ఐఏఎస్ లైనా జనాలకే జవాబుదారి అన్నవిషయాలను మరచిపోకూడదు. పాలకులు తమ బాధ్యతలను మరచిపోతే గుర్తుచేయాల్సింది ఐఏఎస్ అధికారులే.
కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లో అవకతవతకలు, అవినీతి జరిగిందన్న విషయం అర్ధమవుతోంది. ప్రాజెక్టుల్లోని లోపాలను, అవకతవకలు, అవినీతి జరిగిందని ఇరిగేషన్ నిపుణుడు వెదిరె శ్రీరామ్ లాంటి చాలామంది బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జరిగిన విషయాలను అఫిడవిట్ల రూపంలో ఇప్పటికే కమిషన్ కు అందించారు. వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ప్రాజెక్టులు పనికిరాకుండా పోతే, భారీ ఎత్తున అవినీతి జరిగితే అందుకు బాధ్యులు ఎవరు ? పైన చెప్పిన ఐఏఎస్ అధికారులందరు పై ప్రాజెక్టుల్లో పాలనాపరంగా భాగస్వాములైన వారే. ఇరిగేషన్ కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలుగా నిధులు మంజూరు చేసినవాళ్ళు, ప్రాజెక్టుల నిర్మాణాలను పర్యవేక్షించిన వాళ్ళే. ఇరిగేషన్ కార్యదర్శిగా రాహూల్ బొజ్జా, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన స్మితా సబర్వాల్ సంవత్సరాల తరబడి పై ప్రాజెక్టులను పర్యవేక్షించారు. ఇపుడు వాళ్ళే ప్రాజెక్టుల్లోని లోపాలతో తమకేమి సంబంధంలేదని వాదన వినిపించినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి.
పాలకుల నిర్ణయాలతో వేలకోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం జరుగుతుందని అనుకున్నపుడు ఆ నిర్ణయాలను అడ్డుకునుంటే ఇపుడీ పరిస్ధితి ఎదురయ్యేది కాదేమో. అప్పుడేమో పాలకుల నిర్ణయాలకు తలూపి ఇపుడు నష్టాలు బయటపడగానే తమకు సంబంధంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కీలకమైన పోస్టింగుల కోసం ఎప్పుడైతే ఐఏఎస్ లు పాకులాడుతారో అప్పుడో పాలకులకు వీళ్ళు సరెండర్ అయిపోయినట్లు లెక్క. తమ కోరిక ప్రకారం కీలకమైన పోస్టింగులు ఇస్తారు కాబట్టి పాలకుల నిర్ణయాలకు ఎదురు చెప్పకుండా చాలామంది తలూపేస్తారు. తర్వాత ఏదైనా సమస్య వస్తే తగులుకుంటారు లేదా సంబంధంలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నంచేస్తారు.
ఇదే విషయాన్ని 1977 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మహమ్మద్ షఫి కుజ్జుమా తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘తమ శాఖలో జరిగిన వ్యవహారాలతో సంబంధంలేదని తప్పించుకోవటం ఐఏఎస్ అధికారులకు కుదరదని చెప్పారు. ‘ఐఏఎస్ అధికారులు ఉండేదే పాలకులను సరైన మార్గంలో నడిపించేందుకే’ అన్నారు. ‘పాలకులకు అన్నీ విషయాల్లో క్షుణ్ణమైన నాలెడ్జి లేకపోయినా ఐఏఎస్ అధికారులకు ఉంటుంద’ని చెప్పారు. ‘పాలకులు తీసుకున్న నిర్ణయాలు తప్పని అనుకున్నపుడు అదే విషయాన్ని ఐఏఎస్ అధికారులు స్పష్టంగా చెప్పాల’న్నారు. ‘పాలనా విషయాల్లో ఐఏఎస్ అధికారులు గట్టిగా నిలబడినపుడు పాలకులు తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉంటాయ’ని చెప్పారు. ‘పాలకులు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు బయటపడితే అందుకు ఆయా శాఖల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారుల బాధ్యత కూడా ఉంటుంద’ని షఫిక్ అభిప్రాయపడ్డారు.