అధికారి సంపాదనే రు. 200 కోట్లయితే ప్రాజెక్టులో నాణ్యతుంటుందా ?
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకింత నాసిరకంగా నిర్మాణమైందో ఇపుడు అందరికీ అర్ధమవుతున్నట్లుంది;
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకింత నాసిరకంగా నిర్మాణమైందో ఇపుడు అందరికీ అర్ధమవుతున్నట్లుంది. కాళేశ్వరం(Kaleswaram Project) ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన మేడిగడ్డ, సందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ) స్పష్టంగా తేల్చిచెప్పేసింది. పై ప్రాజెక్టుల్లో నీటిని నిల్వుంచి సాగుకు ఉపయోగించే అవకాశంలేదని తేలిపోయింది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నిల్వచేస్తే మొత్తం ప్రాజెక్టే బద్ధలైపోయే ప్రమాధముందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. లక్ష కోట్లరూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి కేసీఆర్(KCR) హయాంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత ఇంతబాగుంది. అందుకనే కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నట్లు రేవంత్, మంత్రులు పదేపదే ఆరోపిస్తున్నారు.
సరే, కాంగ్రెస్ ఆరోపణలను బీఆర్ఎస్ క్యాంపు ఎలాగూ ఒప్పుకోదు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని క్యాంపు మొత్తం ఎదురుదాడులు చేస్తున్నది. పైగా అంత ప్రాజెక్టు కట్టినపుడు ఎక్కడో చిన్న టెక్నికల్ ఎర్రర్ జరగకుండా ఉంటుందా అని దబాయిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). మరి ఈనేతలు కట్టించుకున్న ఇళ్ళు, ఫామ్ హౌసులు ఇలాంటి నాసిరకం నిర్మాణాలే చేసుకున్నారా ? అనడిగితే సమాధానముండదు. అసలు నిర్మాణాలను నాసిరకంగా ఎందుకు కట్టాలని అడిగితే ఎదురుదాడులే సమాధానమవుతోంది. ఎంతైనా నోరున్నవాడిదే కదా రాజ్యం. ఇపుడు విషయానికి వస్తే భూక్యా హరిరామ్(Bhukya Hariram) అని ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ పెద్దమనిషిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఆయనింట్లో జరుపుతున్న సోదాల్లో ఇప్పటికి సుమారు రు. 200 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు బయటపడ్డాయి. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేలులో 30 ఎకరాలు, హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేటలో 100 ఎకరాలు కొన్నాడు. అలాగే నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో పెద్ద విల్లాలు కొనుగోలుచేశాడు. ఇంకా ఎక్కడెక్కడో రెసిడెన్షియల్ ప్లాట్లు, అపార్టమెంట్లు కూడా ఉన్నాయి. చివరకు ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో కూడా పెద్దఎత్తున భూములు కొన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ గాను తర్వాత కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎండీగా కూడా పనిచేశాడు. ఈయన భార్య అనిత కూడా ఇరిగేషన్ శాఖలోనే డిప్యుటి ఈఎన్సీగా పనిచేసింది. ప్రాజెక్టులకు సంబంధించి మేడిగడ్డ, సుందిళ్ళు, అన్నారం ప్రాజెక్టుల నాణ్యతంతా నిసిరకమే అని నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. అంటే ఇవేవి కూడా నీటినిల్వకు పనికిరావు. నీటిని నిల్వచేసేందుకు పనికిరానపుడు ఇక ఈ ప్రాజెక్టులెందుకు ? ఇలాంటి నాసిరకం ప్రాజెక్టులుకట్టి వ్యవసాయశాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్ధరించిందేముంది ?
లక్షకోట్లరూపాయల ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకఅధికారి సంపాదనే ఇప్పటికి రు. 200 కోట్లయితే ఇక మిగిలిన ఉన్నతాధికారుల సంపాదన మాటేమిటి ? ఉన్నతాధికారులు, అధికారులు, కాంట్రాక్టుల సంపాదనను పక్కనపెట్టేస్తే పాలకులసంపాదన ఏమేరకుఉంటుందో ఎవరికివాళ్ళుగా అంచనాలు వేసుకోవాల్సిందే. ఇప్పటికి పట్టుబడిన హరిరామ్ దగ్గరే రు. 200 కోట్లు విలువైన ఆస్తులు బయడపడితే ఇంకా దొరకని ఉన్నతాధికారులు, అధికారుల్లో ఎవరెంత అక్రమార్జన చేశారో అంచనావేయలేకపోతున్నారు. ప్రజాధనాన్ని ఎవరికి దొరికింది వాళ్ళు తినేస్తున్నారు కాబట్టే ప్రాజెక్టులు అంత నాసిరకంగా ఉంటున్నాయని అర్ధమవుతోంది. ఎప్పుడో రాజుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, రాజభవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రిటీష్ పాలకుల కాలంలో నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణాలు కూడా చక్కగా బలంగా ఉన్నాయి.
స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత నిర్మించిన ముఖ్యంగా 1980ల తర్వాత కట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కువభాగం నాసిరకంగానే ఎందుకు ఉంటున్నాయి ? ప్రాజెక్టులను ఒకవైపు కడుతుంటే మరోవైపు ఎందుకు కూలిపోతున్నట్లు ? మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఈమధ్యే కొన్నిప్రాజెక్టులు కూలిపోయాయి. వీటిల్లో కొన్నయితే ప్రారంభానికి ముందే కూలిపోవటం మరీ ఆశ్చర్యం. పాలకులు, అధికారయంత్రాంగం, కాంట్రాక్టులు వాటాలువేసుకుని ప్రజాధనాన్ని పంచుకోగా మిగిలిన నిధులతోనే ప్రాజెక్టులను కడుతున్నట్లు అనుమానంగా ఉంది. అందుకనే కొన్ని ప్రాజెక్టులు మరీనాసిరకంగా ఇలా కడుతుండగానే అలా కూలిపోతున్నాయి. హరిరామ్ దగ్గర దొరికిన, దొరుకుతున్న అక్రమాస్తుల ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రాజెక్టులో భాగమైన అందరినీ లోతుగా దర్యాప్తుచేస్తే ఇంకెన్ని తిమింగలాలు, సొరచేపలు బయటపడతాయో ?