అసెంబ్లీలో ఫూలే విగ్రహం లేనట్లేనా..?

ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కవిత నిరసన బాట పట్టడంతో.. కాంగ్రెస్ తెలివిగా ఆలోచించిందని విశ్లేషకులు చెప్తున్నారు.;

Update: 2025-04-12 08:17 GMT

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు అంశం కీలకంగా మారుతోంది. అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాడిన జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహిళల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే. అటువంటి మహోన్నతవ్యక్తి విగ్రహాన్ని అసెంబ్లీ ఏర్పాటు చేయాలని కవిత.. డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయితే ప్రభుత్వం పోరడటానికి బీసీ నినాదాన్ని స్మరిస్తున్న కవిత.. అందులో భాగంగానే ఈ విగ్రహ ఏర్పాటు కోసం పట్టుబడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చూడా చేపట్టారు. బీసీ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేస్తోందని, అణచివేత కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే బీసీ సమస్యలను తన భుజాలపై మోస్తున్న కవితకు ఫూలే విగ్రహం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇచ్చాయి.

కవిత తన నిరసనను, ప్రశ్నాస్త్రాలను మరింత అధికం చేయకముందే.. ఫూలే విగ్రహం ఏర్పాటు అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేశారు. అయితే ఆమె డిమాండ్ చేసినట్లు అసెంబ్లీలో కాకుండా.. నెక్లెస్‌రోడ్‌లో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ స్థల పరిశీలన కూడా చేశారు అధికారులు. స్థల పరిశీలనకు సీఎం రేవంత్ కూడా స్వయంగా హాజరయ్యారు. స్థల సర్వేను పూర్తి స్థాయి ప్రణాళికలతో అందించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. భవిష్యత్తులో ఈ విగ్రహం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడానికి అవకాశం లేకుండా డిజైన్ చేయానలి చెప్పారు.

దీంతో కవిత దగ్గర ఒక్క అస్త్రం కూడా నిర్వీర్యమైందని విశ్లేషకులు అంటున్నారు. ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కవిత నిరసన బాట పట్టడంతో.. కాంగ్రెస్ తెలివిగా ఆలోచించిందని విశ్లేషకులు చెప్తున్నారు. మూర్ఖంగా ఫూలే విగ్రహం గురించి పట్టించుకోకుండా ఉండకుండా.. విగ్రహ ఏర్పాటు దిశగా అడుగులు వేసి ప్రజల మన్ననలను పొందుతూనే.. అసెంబ్లీలో ఏర్పాటు చేయబోమని కవితకు ఇండైరెక్ట్‌గా సీఎం చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై విరుచుకుపడటానికి, విమర్శలు చేయడానికి కవిత దగ్గర ఉన్న ఒకేఒక అవకాశం కూడా ఇప్పుడు చేజారిపోయిందని అంటున్నారు.

ఒకవేళ అసెంబ్లీలో కదా విగ్రహాన్ని ఏర్పాటు చేయమని డిమాండ్ చేసింది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ఫూలే గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే 24 గంటలు రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నామని చెప్పే అవకాశాలు ఉన్నాయని, అదే మాట అంటే దానికి ఎదురు చెప్పడానికి కూడా ఏమీ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు చేరువలో ఉంచి ఫూలే త్యాగాలను, ఆయన సాధించిన విజయాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పే అవకశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

పట్టువదలని కవిత..

అయితే ఈ విషయంలో కవిత మాత్రం పట్టువీడటం లేదు. నెక్లెస్‌రోడ్‌లో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడం హర్షనీయమని కవిత అన్నారు. కానీ అసెంబ్లీ ఆవరణలో కూడా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్వాన్ లో ఫూలే జయంతి వేడుకల్లో కవిత పాల్గొని, పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కవిత మాట్లాడుతూ.. ఫూలే విగ్రహ ఏర్పాటుకు సిఎం రేవంత్ రెడ్డి స్థల పరిశీలన చేశారనే విషయం తెలిసిందని అన్నారు. ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలని, విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు. కానీ అసెంబ్లీలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని, ఆ ఆలోచనే ఉండి ఉంటే ఏర్పాటు చేయడమే అసెంబ్లీలో చేస్తుంది కదా? అని విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటు లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏనాడూ కూడా ఫూలే గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్‌కు చెందిన ఏ ఒక్కనేతా అడగలేదు. అసలు బీసీలకు రిజర్వేషన్ల గురించిన ప్రస్తావనే లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీసీలను బీఆర్ఎస్ నేతలు నెత్తిన పెట్టుకుంటున్నారు. బీసీల కోసం పోరాడుతున్నట్లు, బీసీల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమన్నట్లు ప్రసంగాలిస్తున్నారు. కవిత సైతం అధికారంలో ఉన్నంత కాలం ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం బీసీల సమస్యను తన సమస్యగా తీసుకుని ముందుకెళ్లడం వింతగా ఉందంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారం పోవడంతోనే బీఆర్ఎస్‌కు బీసీలు గుర్తుకొచ్చారు తప్పితే.. వారిపై ప్రేమ ఇసుమంత కూడా లేదని, ఇప్పటికి కూడా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీఆర్ఎస్, ఎమ్మెల్సీ కవిత బీసీ మంత్రం జపిస్తున్నారని విమర్శిస్తున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News