కాళేశ్వరం పాపమంతా కేసీఆర్దేనా ?

కాళేశ్వరం పాపమంతా మాజీ సీఎం కేసీఆర్ దే అని స్పష్టమవుతోందా ? బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన తప్పులకు ఇఫుడు సాక్ష్యాలు బయటకు వస్తున్నాయా ?

Update: 2024-08-23 04:55 GMT
KCR

కాళేశ్వరం పాపమంతా మాజీ సీఎం కేసీఆర్ దే అని స్పష్టమవుతోందా ? బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన తప్పులకు ఇఫుడు సాక్ష్యాలు బయటకు వస్తున్నాయా ? కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు ఇపుడు నాటి పరిస్ధితులను రిటైర్డ్ ఉన్నతాధికారులు కళ్ళకు కడుతున్నట్లు వివరిస్తున్నారు. వివరించటమే కాకుండా తమ వాదనలకు మద్దతుగా డాక్యుమెంట్లతో పాటు అఫిడవిట్లను కూడా అందించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు ఇంజనీర్ ఇన్ చీఫుగా పనిచేసిన నరేందర్ రెడ్డి, మురళీధర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై తాము సంతకాలు చేయటానికి నిరాకరించినా కేసీఆర్, హరీష్ రావు పదేపదే తమపై ఒత్తిడి తెచ్చి తమతో సంతకాలు చేయించుకున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

పాలకుల ఒత్తిడివల్లే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఫైలుపైనా తాము సంతకాలు పెట్టాల్సొచ్చిందన్నారు. డిజైన్లు రెడీ అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఫైలుపై సంతకాలు చేయటంలేదని కేసీఆర్, హరీష్ తమను చాలాసార్లు నిలదీసినట్లు వీళ్ళిద్దరు చెప్పారు. కాళేశ్వరం డిజైన్లపై తాము మనస్పూర్తిగా సంతకాలు చేయలేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలకు సంబంధించి కేసీఆర్, హరీష్ పాత్రపై మొదటిసారిగా సాక్ష్యమిచ్చింది బహుశా పై ఇంజనీర్ ఇన్ చీఫులే. ప్రాజెక్టుకు డిజైన్ చేసింది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషనే అయినా అందులో ఎల్ అండ్ టీ ఇంజనీర్లదే మేజర్ పాత్రగా చెప్పారు. సీడీవో ఇంజనీర్లు కూడా ఎల్ అండ్ టీ ఇంజనీర్లు చెప్పినట్లుగానే నడుచుకున్నట్లు వీళ్ళిద్దరు ఆరోపించారు.

డిజైన్లలో చాలా లోపాలున్నా మైన్ టెనెన్స్ లోపాల వల్లే ప్రాజెక్టు దెబ్బతినేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నపుడు ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్మాణపనుల్లో నాణ్యతను పరిశీలించాలని మురళీధర్ చెప్పారు. అయితే తాము నాణ్యతా పనులను పరిశీలించకుడానే బిల్లులు చెల్లించినట్లు అంగీకరించారు. అప్పటి పాలకుల ఆదేశాలకు అనుగుణంగానే తాను పనిచేసినట్లు మురళి ఒప్పుకున్నారు. డిజైన్లకు సంబంధించి మాత్రమే తాను జవాబుదారి అని హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి తనకు సంబంధంలేదన్నారు. అయినా ఈ ఫైళ్ళపైన కూడా కేసీఆర్, హరీష్ తనతో సంతకాలు చేయించుకున్నట్లు నరేందర్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్ ఇన్ చీఫులు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ల పాత్రకన్నా ఎల్ అండ్ టీ ఇంజనీర్ల పాత్రే చాలా ఎక్కువగా నరేందర్ రెడ్డి కమిషన్ కు స్పష్టంచేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, నాసిరకం నిర్మాణానికి కారణాలు, విద్యుత్ రంగంలో అవినీతి, అక్రమాలు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తానికి బీఆర్ఎస్ పాలకులదే కీలకపాత్రని అందరికీ తెలుసు. అయితే టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ రంగంలో అవినీతి, అక్రమాలపై జరుగుతున్న విచారణలో చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దతలకాయలు, పాలకులు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారే కారణమని, వారుచెప్పినట్లే తాము నడుచుకున్నామని విచారణ కమిషన్ల ముందు, పోలీసుల దర్యాప్తులో చెప్పారు. ఎవరు కూడా కేసీఆర్ పాత్రను బయటపెట్టలేదు.

మొదటిసారి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, నాసిరకం నిర్మాణాలపై జరుగుతున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఇద్దరు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ లు స్పష్టంగా కేసీఆర్, హరీష్ రావుల పేర్లను ప్రస్తావించారు. దీని ఆధారంగా విద్యుత్ రంగంలో అవినీతి, అవకతవకలు, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మెల్లిగానే అయినా కేసీఆర్ పాత్ర బయటపడక తప్పదని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. మరి పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయ్యేలోగా ఇంకెంతమంది కేసీఆర్, హరీష్ పాత్రను ప్రస్తావిస్తారో చూడాలి.

Tags:    

Similar News