కవిత ఆధ్వర్యంలో కొత్త పార్టీ..?

తెలుగు రాష్ట్రాలో పార్టీ పెట్టిన నాలుగో మహిళగా నిలుస్తారా.;

Update: 2025-09-02 11:21 GMT

కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీనే దిక్కా? అంటే అవుననే చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె బీఆర్ఎస్‌లో కీలకంగా మెలిగారు. కేసీఆర్ కూతురుగా ఆమె ఒక యువరాణి తరహాలోనే ఉన్నారు. కానీ కొన్ని నెలల్లో అంతా మారిపోయింది. చివరకు పార్టీ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఇతర పార్టీలు కూడా కవిత తమకు అక్కర్లేదని అంటున్నాయి. దీంతో కవిత ముందు ఉన్న ఒకే ఒక మార్గం.. కొత్త పార్టీ. ఆ దిశగానే కవిత కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఆలోచనలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

కవిత పార్టీ పేరు ఇదే..

కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు అన్నది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రచారం ఏమీ కాదు. కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ లీక్ అయిన సమయంలో కూడా ఇదే ప్రచారం జోరుగా సాగింది. కేటీఆర్‌తో విభేదాలు ముదిరినప్పుడు కూడా కవిత.. కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కూడా అంతే చర్చ జరుగుతోంది. అయితే కవిత తన కొత్త పార్టీకి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ అన్న పేరుపై మొగ్గు చూపుతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. జాగృతిని వినియోగించుకుని కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చర్చలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నాలుగో మహిళ..

తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీ పెట్టిన మహిళా నాయకురాళ్లు అతి తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వారి జాబితాలోకి కవిత కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సస్పెన్షన్‌తో కవిత పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారట. అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని సొంత పార్టీ పెట్టిన నాలుగో మహిళా లీడర్‌గా కవిత మారతారు. తొలుత లక్ష్మీ పార్వతీ.. ఎన్‌టీఆర్ మరణం తర్వాత ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీ(లక్ష్మీ పార్వతి) అనే పార్టీని స్థాపించారు.

అదే విధంగా విజయశాంతి కూడా 2005లో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ‘తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ప్రస్తుత భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో విలీనం చేశారు.

వైఎస్ షర్మిల.. అన్న జగన్‌తో విభేధాలు రావడంతో జులై 2021లో ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ని స్థాపించారు. కానీ ఆమె 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 4 జనవరి 2024న ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ఇప్పుడు కవిత కూడా సొంత పార్టీని ప్రకటిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీని స్థాపించిన నాలుగో మహిళా నేతగా నిలుస్తారు. మరి సొంత పార్టీపై కవిత వైఖరి ఏంటో చూడాలి.

Tags:    

Similar News