KCR and ManMohan Singh|కేసీఆర్ మరీ ఇంత అన్యాయమా ?
నిజానికి మన్మోహన్ పార్ధివదేహాన్ని సందర్శించటానికి స్వయంగా కేసీఆరే ఢిల్లీకి వెళ్ళాల్సింది.
కేసీఆర్ మరీ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీలో జరిగే మన్మోహన్ (Manmohan Singh)అంత్యక్రియలకు పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), పార్టీ ఎంపీలు, ప్రజా ప్రతినిదులు హాజరై నివాళులర్పించనున్నారు. కేసీఆర్(KCR) ఆదేశాల మేరకే వీళ్ళంతా ఢిల్లీకి వెళుతున్నారు. ఇక్కడే కేసీఆర్ వైఖరి ఏమిటో జనాలకు అర్ధమైపోయింది. నిజానికి మన్మోహన్ పార్ధివదేహాన్ని సందర్శించటానికి స్వయంగా కేసీఆరే ఢిల్లీకి వెళ్ళాల్సింది. ఎందుకంటే మన్మోహన్ హయాంలోనే ప్రత్యేక తెలంగాణా(Telangana State) ఏర్పడింది. కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే అందుకు మన్మోహన్ సింగ్ నిర్ణయమే కారణం. తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi)తో పాటు ఇంకా ఎవరెవరిపాత్ర ఎంతుందన్నది వేరేవిషయం. మన్మోహన్ నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోకపోతే ప్రత్యేక తెలంగాణా వచ్చేదే కాదన్నది మాత్రం వాస్తవం.
దశాబ్దాలుగా కేసీఆర్ రాజకీయాల్లోనే ఉన్నా ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన 2014 మాత్రం చిరస్మరణీయం. ప్రత్యేకతెలంగాణా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మన్మోహన్ మరణిస్తే వ్యక్తిగతంగా వెళ్ళకపోవటం చాలా అన్యాయమనే చెప్పాలి. కేసీఆర్ ఏమన్నా ఊపిరిసలుపని పనిలో ఉన్నారా అంటే అదీలేదు. పోనీ తీవ్ర అనారోగ్యంతో మంచంమీదున్నారా అంటే అదీలేదు. తాను అవసరం అనుకున్నచోటికి వెళుతునే ఉన్నారు. అవసరమైనపుడు పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని గంటలతరబడి సమావేశం నిర్వహిస్తునే ఉన్నారు. మన్మోహన్ కు నివాళులు అర్పించటానికి కేసీఆర్ కు ఇదే చివరి అవకాశం అని అందరికీ తెలిసిందే. అయినా తాను ఢిల్లీకి వెళ్ళకుండా తన ప్రతినిధిగా కేటీఆర్ అండ్ కో ను పంపటంలో అర్ధంలేదు. అందరినీ తీసుకుని తాను ఢిల్లీకి వెళ్ళుంటే ఎంతో హుందాగా ఉండేది అనటంలో సందేహంలేదు.
తెలంగాణా ఉద్యమ సమయం నుండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటువరకు మన్మోహన్ అందించిన సహకారాన్ని తెలంగాణా సమాజం ఎప్పటికీ మరచిపోదనే ప్రకటన విచిత్రంగా ఉంది. తెలంగాణా సమాజం మరచిపోదు సరే తానేంచేశాడు అన్నదే ప్రశ్న. ఢిల్లీకి వెళ్ళి నివాళులు అర్పించకుండా ఫామ్ హౌసులో కూర్చుని మన్మోహన్ గురించి ఎన్నిమాటలు మాట్లాడినా ? ఎంత పొగిడినా ఎలాంటి ఉపయోగం ఉండదని వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్ కు అంతమాత్రం తెలీదా ?