కాళేశ్వరం గుట్టును ఘోష్ రిపోర్టు బయటపెట్టిందా ?
ప్రాజెక్టు, బ్యారేజీల్లో జరిగిన అవినీతి, అవకతవకలకు కేసీఆరే కారణమని స్పష్టంచేశారు.;
ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ లో కాళేశ్వరం రిపోర్టు టెన్షన్ పెరిగిపోతోందా ? కారణం ఏమిటంటే కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణజరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మాణంలో అవినీతి, అవకతవకలు జరిగినట్లు కమిషన్ నిర్ధారించినట్లు అర్ధమవుతోంది. అందుకు అప్పటి పాలకులే ప్రధాన కారణమని కూడా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ అందుకున్న రిపోర్టును ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. బహుశా రెండు, మూడురోజుల్లోనే ఆ రిపోర్టు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)కి అందుతుంది. రేవంత్ రిపోర్టును స్టడీచేసిన తర్వాత తొందరలోనే జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెడుతుంది.
కాళేశ్వరం విచారణ రిపోర్టు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కాబోతోందన్నది వాస్తవం. ఎందుకంటే ఇందులో 90 వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులు ఎవరు, ఏమేరకు బాధ్యులు అన్న వివరాలు ఉండబోతున్నాయి. ప్రభుత్వవర్గాల నుండి లీకైన సమాచారం ప్రకారం రిపోర్టులో జస్టిస్ ఘోఫ్(Justice PC Ghosh) ప్రాజెక్టు, బ్యారేజీల్లో జరిగిన అవినీతి, అవకతవకలకు కేసీఆరే కారణమని స్పష్టంచేశారు. వ్యక్తుల ఇష్టం ప్రకారమే కాళేశ్వరం పనులు జరిగాయని తేల్చిచెప్పినట్లు చెప్పారు. వ్యక్తులు అంటే ఇక్కడ అర్ధం అచ్చంగా కేసీఆర్(KCR) మాత్రమే అని అనుకోవాల్సుంటుంది. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు లోబడే ఎవరైనా పనిచేయాల్సుంటుంది.
ఏ విషయంలో అయినా ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమనిర్ణయం అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రాజెక్టుతో పాటు బ్యారేజీల్లో అవసరనికిమించిన నీటిని స్టోరేజి చేయటం కూడా పెద్ద సమస్యగా మారిందని జస్టిస్ తేల్చిచెప్పినట్లు సమాచారం. అలాగే సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల నిర్మాణ స్ధలం మారటం, లీకేజీలు, మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిన విషయంలో సాక్ష్యుల వాగ్మూలాలు, అఫిడవిట్లు, ఇరిగేషన్ రంగంలోని నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఘోష్ తన రిపోర్టును తయారుచేశారు. కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో వైఫల్యాలు ఉన్నాయని, వ్యవస్ధలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఘోష్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
అవినీతే కాకుండా ఆర్ధిక అవకతవకలు కూడా చాలానే జరిగాయని చెప్పిన జస్టిస్ అందుకు బాధ్యులు ఎవరన్న విషయాన్ని పేర్లతో సహా ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటూ ప్రాజెక్టు, బ్యారేజీ పనులను పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రాజెక్టులు, బ్యారేజీల అంచనాలు మార్చటం, నిర్మాణస్ధలం మార్పు తదితరాలకు ఎవరు బాధ్యులు అన్న విషయాన్ని కూడా ఘోష్ చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ నిర్ణయం లేకుండానే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని, ముందు నిర్ణయాలు తీసుకుని తర్వాత మంత్రివర్గ సమావేశంలో రాటిఫై చేయించుకున్నట్లు జస్టిస్ స్పష్టంగా చెప్పరని సమాచారం. ర్యాటిఫై చేయించుకున్న నిర్ణయంలో కూడా బ్యారేజీల పనులు లేవని తెలిసింది. క్వాలిటి కంట్రోల్ ను పర్యవేక్షించటంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించారని, పర్యవేక్షణలోపం బయటపడిందని అన్నట్లు తెలిసింది.
అందుబాటులోని సమాచారం ప్రకారం ఘోష్ రిపోర్టులో కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణలకు క్యాబినెట్ ఆమోదంలేదన్న విషయం స్పష్టమైంది. ఆరు క్యాబినెట్ సమావేశాల్లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao), కేసీఆర్ చెప్పింది వాస్తవంకాదని తేలిపోయింది. మొదటినుండి రేవంత్ తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ చెబుతున్నట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదంలేదన్నదే నిజమని తేలిపోయింది. లీకైన రిపోర్టులోని అంశాలే ఇంత సంచలనంగా ఉంటే మొత్తం రిపోర్టు బయటకు వస్తే ఇంకెన్ని విషయాలు ఉంటాయో చూడాల్సిందే.