Kazipet Coach factory |కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కలేనా ?
కోచ్ ఫ్యాక్టరీ(Coach Factory) ఏర్పాటుపై మూడు ప్రధాన పార్టీలు భిన్నవాదనలు వినిపిస్తుండటంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.;
ఉమ్మడి వరంగల్ జల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కలగా మిగిలిపోవాల్సిందేనా ? ఇపుడిదే ప్రశ్న జిల్లా వాసులను పట్టి పీడిస్తోంది. ఎందుకంటే కోచ్ ఫ్యాక్టరీ(Coach Factory) ఏర్పాటుపై మూడు ప్రధాన పార్టీలు భిన్నవాదనలు వినిపిస్తుండటంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య(Warangal MP Kadiyam Kavya) మాట్లాడుతు తొందరలోనే కాజీపేట(Kajipet)లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రకటించారు. తొందరలోనే నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఆగష్టులోపు ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తయి కోచ్ ల నిర్మాణం మొదలవుతుందన్నారు. ఇపుడున్న వ్యాగన్ నిర్మాణం స్ధానంలోనే కోచ్ నిర్మాణ ఫ్యాక్టరీ ఏర్పాటవుతుందన్నారు. ఇంతటితో ఆగని ఎంపీ కావ్య కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా చెప్పుకున్నారు.
కావ్య ఇలా ప్రకటన చేసిందో లేదో వెంటనే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(BRS MP Vaddiraju Ravi) మీడియా ముందుకు వచ్చేశారు. వద్దిరాజు ఏమన్నారంటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అంగరించలేదన్నారు. వ్యాగన్ నిర్మాణ ఫ్యాక్టరీ స్ధానంలోనే కోచ్ బిల్డింగ్ నిర్మాణం యూనిట్ ను ఏర్పాటు చేసేంతవరకు తమ పార్టీ పోరాటాలు చేస్తునే ఉంటుందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రమంత్రికి అవగాహన కూడా లేదన్నారు. ఇద్దరు ఎంపీల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnaw) పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అందులో ఏముందంటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఇంకా ఆలోచన దశలోనే ఉందన్నారు. ఆలోచనలోనే ఉందంటే నిర్ణయం తీసుకోవటానికి ఇంకెంతకాలం పడుతుందో అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. మొత్తంమీద కేంద్రమంత్రి ప్రకటన ఒకలాగ, రెండుపార్టీల ఎంపీల ప్రకటనలు పరస్సర విరుద్ధంగా ఉండటంతో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమో అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
ఇపుడు వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీకి ఉన్న భూమి 164 ఎకరాలే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా సరిపోతుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. కోచ్ ఫ్యాక్టరీ గనుక ఏర్పాటైతే 10 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నది దశాబ్దాల కల. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే పారిశ్రామికంగానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచిఊపు వస్తుందని అనుకుంటున్నారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నేతలు ఎందుకిలా ఆటలాడుకుంటున్నారో అర్ధంకావటంలేదు.