ఇది కొత్తరకం క్యాస్టింగ్ కౌచా ?
తమిళ, తెలుగు పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అంతగా లేకపోయినా పై రెండు పరిశ్రమల్లో అసలు లేవని మాత్రం అనేందుకు లేదు.
ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో మళయాళ సినిమా పరిశ్రమ అల్లాడిపోతోంది. ఎప్పటినుండో బాలీవుడ్ లో ఈ ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. తమిళ, తెలుగు పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అంతగా లేకపోయినా పై రెండు పరిశ్రమల్లో అసలు లేవని మాత్రం అనేందుకు లేదు. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తెలీదుకాని ఆరోపణలైతే పెద్దగా వినబడలేదు. ఇప్పటివరకు క్యాస్టింగ్ కౌచ్ అంటే హీరోయిన్లకు అవకాశాల కోసం లేదా కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్న వాళ్ళని తమ కోరికలు తీర్చమని అడగటమే.
అయితే తాజాగా మంత్రి కొండాసురేఖ చేసిన ఆరోపణలతో కొత్తతరహా క్యాస్టింగ్ కౌచ్ విషయం బయటపడింది. మంత్రి మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవేమిటంటే నాగచైతన్య-సమంతల విడాకులకు కేటీఆరే కారణమన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపించమని కేటీఆర్ అడిగారని చెప్పారు. మావగారు అక్కినేని నాగార్జున, భర్త అక్కినేని నాగచైతన్య కన్వెన్షన్ సెంటర్ను కాపాడుకోవటం కోసం సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని బలవంతం చేశారట. వాళ్ళు ఎంతగా బలవంతంచేసినా కేటీఆర్ దగ్గరకు వెళ్ళటానికి సమంత అంగీకరించకపోవటంతో వాళ్ళమధ్య గొడవలై ఇంట్లోనుండి వెళ్ళిపొమ్మని సమంతకు చెప్పారట.
గొడవల కారణంగా ఇంట్లోనుండి బయటకు వచ్చేసిన సమంత తర్వాత చైతన్యతో విడాకులు తీసుకున్నట్లు మంత్రి ఆరోపించారు. సమంత మాత్రమే కాదని కేటీఆర్ దెబ్బకు చాలామంది హీరోయిన్లు బలైపోయినట్లు చెప్పారు. కేటీఆర్ ఒత్తిడిని తట్టుకోలేక రకుల్ ప్రీత్ సింగ్ లాంటి కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డుకు దూరమైపోయినట్లు సురేఖ పెద్ద బాంబు పేల్చారు. ముఖ్యంగా డ్రగ్స్ రాకెట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్లలో చాలామందిని కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసినట్లు మంత్రి చెప్పారు.
సురేఖ ఆరోపణలపై నాగార్జున, సమంత స్పందించారు. రాజకీయంగా ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు తమను పావులుగా ఉపయోగించుకోవద్దని నాగార్జున మంత్రిని ఎక్స్ వేదికగా కోరారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండని అభ్యర్ధించారు. బాధ్యత కలిగిన మంత్ర హోదాలో ఉండి తమ కుటుంబం విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నాగార్జున కోరారు. ఇక సమంత ఎక్స్ వేదికగా స్పందించి విడాకులు తన వ్యక్తిగతమని చెప్పి ఊహాగానాలను మానుకోవాలని కోరారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పోరాడటానికి చాలా బలం కావాలని చెప్పారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాగార్జున అయినా సమంత అయినా మంత్రి విషయంలో చాలా ఘాటుగా స్పందిస్తారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే నాగార్జున, చైతన్య, సమంతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అంతటి సంచలనం సృష్టించిన మంత్రి ఆరోపణలపై నాగార్జున, సమంత స్పందన ఉండాల్సినంత గట్టిగా లేదు. మంత్రి ఆరోపణలు అబద్ధమే అయితే నాగార్జున, సమంత స్పందించిన విధానం చాలా పేలవంగా ఉంది. తమ వ్యక్తిగత విషయాలను రచ్చకీడ్వద్దని మంత్రిని బతిమలాడుకుంటున్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం.
సరే వీళ్ళ వ్యవహారాన్ని పక్కనపెట్టేస్తే కేటీఆర్ పైన మంత్రిచేసిన ఆరోపణలు కూడా క్యాస్టింగ్ కౌచ్ కిందకే వస్తాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు వినిపించిన క్యాస్టింగ్ కౌచ్ పరిశ్రమలోని వ్యక్తులకు మాత్రమే పరిమితమైనది. హీరోయిన్ ఛాన్సులు కావాలని అనుకునే వారు, హీరోయిన్లుగా ఎదగాలని అనుకునే వారు కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు లేదా హీరోల కోరికలు తీర్చటాన్ని లేదా తీర్చమని ఒత్తిడి ఎదుర్కోవటాన్నే క్యాస్టింగ్ కౌచ్ అనేవారు. కాని ఇప్పుడు మంత్రి ఆరోపణల ప్రకారం ఫీల్డులో ఉండాలంటే కేటీఆర్ కోరిక తీర్చాల్సిందే అన్న అర్ధం వస్తోంది. కేటీఆర్ కోరిక తీర్చితే ఫీల్డులో ఉంటారు లేకపోతే ఏకంగా ఫీల్డులో నుండి బయటకు వెళ్ళిపోవాల్సిందే అని మంత్రి చెప్పారు.
కేటీఆర్ కోరిక ఎందుకు తీర్చాలి ?
ఎందుకు తీర్చాలంటే చాలామంది సినీ ప్రముఖులు హీరోయిన్లతో కలిపి డ్రగ్స్ వివాదంలో ఇరుక్కున్నారని కొండా సురేఖ చెబుతున్నారు. పైగా అధికారంలో ఉన్నపుడు వేలాది ఫోన్లను ట్యాప్ చేయించారనే ఆరోపణలు కేసీఆర్, కేటీఆర్ మీద బలంగా ఉన్నాయి. ట్యాప్ అయిన ఫోన్లలో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు కేటీఆర్ దగ్గరున్నాయని మంత్రి అంటున్నారు. హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను గుప్పిట్లో పెట్టుకుని కోరిక తీర్చమని కేటీఆర్ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేవాడని మంత్రి ఆరోపించారు. కేటీఆర్ కోరిక తీర్చిన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారా అన్న విషయాన్ని మంత్రి చెప్పలేదు. కోరిక తీర్చటం ఇష్టంలేని రకుల్ ప్రీత్ సింగ్ లాంటి కొందరు హీరోయిన్లు వివాహాలు చేసుకుని ఫీల్డునే వదిలేసినట్లు సురేఖ చెప్పారు. కేటీఆర్ పై మంత్రి చేసిన ఆరోపణలు దాడుల్లో ఇరాన్, ఇజ్రాయేల్ ప్రయోంచుకుంటున్న మిస్సయిళ్ళలాగ పేలాయి. మంత్రి ఆరోపణల దెబ్బకు బీఆర్ఎస్ నేతలతో పాటు సినీ పరిశ్రమలోని చాలామందికి షాక్ కొట్టినట్లయ్యింది. మరి ఎవరి స్పందన ఎలాగుంటుందో చూడాల్సిందే.