MLA Kaushik Suicide | చావును నెత్తిన పెట్టుకుని తిరుగుతున్న ఎంఎల్ఏ?
విషయం ఏదైనా కానీండి మాటకు ముందు చస్తాను, మాటకు తర్వాత చచ్చిపోతాను అంటు బెదిరించటమే పనిగా పెట్టుకున్నాడు.;
తెలంగాణాలోని అందరు ఎంఎల్ఏలతో పోల్చుకుంటే ఈ ఎంఎల్ఏ వైఖరికి పోలీసులు విస్తుపోతున్నారు. విషయం ఏదైనా కానీండి మాటకు ముందు చస్తాను, మాటకు తర్వాత చచ్చిపోతాను అంటు బెదిరించటమే పనిగా పెట్టుకున్నాడు. నిజంగానే చనిపోయే ఉద్దేశ్యంతో చనిపోతానని బెదిరిస్తున్నాడా లేకపోతే చనిపోతానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో అర్ధం కావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ ఎంఎల్ఏగా 2023 ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy) గెలిచాడు. కౌశిక్ గెలిచింది అల్లాటప్పా ప్రత్యర్ధి మీద కాదు ఏకంగా మాజీమంత్రి ఈటల రాజేంద్ర(Eatala Rajendra) మీద. ఈటల మీద గెలవగానే ఈ ఎంఎల్ఏ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయిపోయాడు.
ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన పాడి అప్పటికే ఐదుసార్లు గెలిచి, మంత్రిగా కూడా పనిచేసున్న ఈటల మీద గెలవటంతో పార్టీలో క్రేజు పెరిగిపోయింది. దాంతో ఇంకేముంది అధినేత కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దృష్టిలో పడిపోయాడు. అసలు ఈ ఎంఎల్ఏ గెలిచిందే ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసని కాంగ్రెస్(Congress party) నేతలు సెటైర్లు వేస్తుంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వీడియో ద్వారా ఓటర్లకు సందేసం పంపించాడు. కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని తాను చెప్పటమే కాకుండా భర్తను గెలిపించమని భార్యతోను, తండ్రిని గెలిపించమని కూతురుతో కూడా చెప్పించాడు. ఎన్నికల్లో పోటీచేస్తున్న వారికి కుటుంబసభ్యులు ప్రచారం చేయటం కొత్తేమీకాదు. కాకపోతే మీరు ఓట్లేసి గెలిపించకపోతే అభ్యర్ధి చనిపోతాడని చెప్పించటమే విచిత్రం. అలాగే రోడ్డుషో ప్రచారంలో కూడా భార్య, కూతురును జీపులో పక్కనే పెట్టుకుని గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జనాలకు పదేపదే చెప్పాడు. మరి దీన్ని ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటం అంటారో లేకపోతే బెదిరించటం అంటారో.
ఈటల హుజూరాబాద్ తో పాటు గజ్వేలులో కేసీఆర్ కు వ్యతిరేకంగా పోటీచేశారు. దృష్టి ఎక్కువగా గజ్వేలు మీదే ఉంచటంతో హుజూరాబాద్ పై పెద్దగా కాన్సంట్రేట్ చేయలేకపోయారు. దానికితోడు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లేదా బెదిరింపు ఏదన్నా కానీండి వర్కవుటై కౌశిక్ గెలిచాడు. దాంతో నియోజకవర్గం జనాలు పెద్ద సమస్య నుండి బయటపడ్డారు. ఈటల మీద గెలిచిన దగ్గర నుండి కౌశిక్ రెచ్చిపోతున్నాడు. ఇదేసమయంలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ(Arekapudi Gandhi)తో గొడవలై కేసు నమోదైంది. గొడవల నేపధ్యంలో పాడిని అరెస్టుచేయటానికి పోలీసులు వస్తే అప్పుడు కూడా తనను అరెస్టు చేస్తే చచ్చిపోతానని పెద్ద గోలచేశాడు. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది.
తాజాగా తన ఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) అవుతోందని ఫిర్యాదు చేయటానికి బంజారాహిల్స్(Banjara Police Station) పోలీసుస్టేషన్ కు వెళ్ళాడు. అక్కడ ఇన్స్ పెక్టర్ రాఘవేంద్రతో పెద్ద వాగ్వాదం జరిగింది. తన ఫిర్యాదును తీసుకుని ట్యాపింగ్ కు కారణమైన రేవంత్(Revanth), ఇంటెలిజెన్స్ చీఫ్ పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అంటు పెద్ద గొడవే చేశాడు. తన స్టేషన్లోనే సీఐని ఎంఎల్ఏ+మద్దతుదారులు నిర్బంధించారు. దాంతో విధులకు ఆటంకం కలిగించాడని సీఐ ఫిర్యాదు చేయటంతో ఎంఎల్ఏ మీద కేసు నమోదైంది. కేసు నమోదయ్యింది కాబట్టి అరెస్టుచేయటానికి పోలీసులు ఎంఎల్ఏ ఇంటికి శనివారం ఉదయం చేరుకున్నారు. తనింట్లోకి ప్రవేశించి అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని మళ్ళీ గోలచేశాడు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని పోలీసులు గంటలసేపు ఎంఎల్ఏ ఇంటిముందే కాపు కాశారు. చివరకు ఇంట్లోనుండి బయటకు వచ్చిన తర్వాత కౌశిక్ ను అరెస్టు చేసి బెయిల్ మీద వదిలిపెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్లు మాట్లాడటం కౌశిక్ రెడ్డికి అలవాటైపోయింది. ఎక్కడైనా గొడవ జరిగి కేసునమోదై అరెస్టుచేయటానికి పోలీసులురాగానే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేయటమూ బాగా అలవాటైపోయింది. దాంతో చావును నెత్తిన పెట్టుకుని ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తిరుగుతున్నాడనే సెటైర్లు సోషల్ మీడియాలో పెరిగిపోతున్నాయి.