ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వ్యూహమిదేనా ?

సిట్ తర్వాత విచారణ కేసీఆర్(kcr) లేదా కేటీఆర్(KTR) పైనే ఉంటుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది;

Update: 2025-07-23 06:53 GMT
Telephone Tapping

ట్యాపింగ్ కేసులో తగులుకుంటామన్న టెన్షన్ బీఆర్ఎస్ లో పెరుగుతున్నట్లుంది. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ట్యాపింగులో కీలక పాత్రదారి టీ ప్రభాకరరావు విచారణను సిట్ చివరిదశకు తీసుకువచ్చినట్లు సమాచారం. సిట్ తర్వాత విచారణ కేసీఆర్(kcr) లేదా కేటీఆర్(KTR) పైనే ఉంటుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈనేపధ్యంలోనే సిట్ దర్యాప్తుకు బదులు సీబీఐ దర్యాప్తును బీఆర్ఎస్(BRS) డిమాండ్ మొదలుపెట్టింది. తాముచేస్తే డిమాండుకు విలువ ఉండదనే పార్టీ అగ్రనేతలు ప్రవీణ్ ను ముందుపెట్టినట్లుగా అనుమానాలుపెరిగిపోతున్నాయి. టీ ప్రభాకరరావు విచారణలో ఏమివిషయాలు చెప్పారో తెలీటంలేదు. అందుకనే కారుపార్టీ అగ్రనేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది.

అరెస్టయిన పోలీసు అధికారులు సిట్ విచారణలో చెప్పిన సమాచారం ప్రకారమే బీఆర్ఎస్ హయాంలో సుమారు 4200 ఫోన్లు ట్యాపయ్యాయి. ఇన్నివేల ఫోన్లను ట్యాప్ చేయించి బీఆర్ఎస్ పెద్దలు ఏమిచేశారో అర్ధంకావటంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు అరాచకంగా వ్యవహరించిందన్న విషయం ఇపుడు అందరికీ అర్ధమవుతోంది. కేసీఆర్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని ఆమధ్య కేటీఆర్, ఈమధ్య కవిత(Kavitha) కూడా అంగీకరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమకు ఇబ్బందులు కలుగుతాయని అనుమానించిన వారి ఫోన్లను అప్పటి పెద్దలు ట్యాపింగ్ చేయించారు. చివరకు సొంతపార్టీ నేతలు, బంధువుల ఫోన్లను కూడా వదల్లేదు.

టీ ప్రభాకరరావును పావుగా వాడుకున్న బీఆర్ఎస్ పెద్దలు అరాచకపాలన సాగించారనేందుకు సిట్ కు చాలా ఆధారాలు దొరికాయి. ఈరోజు లేకపోతే రెండు రోజుల తర్వాతైనా తానుచేసిన ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభాకరరావు అంగీకరించకతప్పేట్లులేదు. ఒకసారి మాజీ ఇంటెలిజెన్స్ బాస్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంగీకరిస్తే ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ జరిపారన్న విషయాన్ని కూడా బయటపెట్టేస్తారు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఇరుక్కోకతప్పదు. ఎందుకంటే పాలకుల ఆదేశాలు లేకుండా ఏ అధికారి కూడా తనంతట తానుగా వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించే అవకాశాలు లేవు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాలకులు ఎప్పుడూ తమచేతికి మట్టి అంటకుండా పనులు చేయించుకుంటారు. పాలకుల ఆదేశాలను గుడ్డిగానో లేకపోతే అత్యుత్సాహంతోనే అనుసరించి లేదా ఓవర్ యాక్షన్ చేస్తే చివరకు మూల్యం చెల్లించుకోవాల్సింది అధికారులు మాత్రమే. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ మౌఖిక ఆదేశాలను పాటించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ పరిస్ధితి ఏమవుతోందో అందరు చూస్తున్నదే.

సేమ్ టు సేమ్ ఫార్ములా కార్ రేసులో జరిగినట్లే టెలిఫోన్ ట్యాపింగ్ లో కూడా అధికారులను అడ్డంపెట్టుకుని పాలకులు తమఇష్టారాజ్యంగా వ్యవహారాలు నడిపారు. దానికి ఇపుడు మూల్యం చెల్లించుకుంటున్నది పోలీసు అధికారులే. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు జైలుశిక్ష ఖాయమని ఇప్పటికే రేవంత్, మంత్రులు, బీజేపీ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చాలాసార్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు డిమాండ్ చేసినట్లుగా సిట్ అధికారులు కేసీఆర్, కేటీఆర్ పై కేసులు నమోదుచేసి, విచారించి అరెస్టులు చేయలేరు. అందుకు ప్రొసీజర్ కావాలి, బలమైన ఆధారాలుండాలి.

ఏదేమైనా ట్యాపింగ్ కేసు విచారణ తమదాకా వచ్చేరోజు ఎంతో దూరంలో లేదన్న విషయం ఈపాటికే తండ్రి, కొడుకులకు అర్ధమైపోయుంటుంది. అందుకనే సిట్ విచారణ నుండి తప్పించుకునేందుకు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తాము నేరుగా డిమాండ్ చేయకుండా సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో చేయించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రవీణ్ కూడా అప్పట్లో ట్యాపింగ్ బాధితుడే. తన ఫోన్ ను కేసీఆర్ ట్యాపింగ్ చేయించినట్లు 2023 ఎన్నికల్లో ప్రవీణ్ బహిరంగంగా ఆరోపణలు చేయటమే కాకుండా అప్పటి డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. అలాంటి ట్యాపింగ్ బాధితుడు ఇపుడు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగటంలేదని ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ట్యాపింగ్ లో పాత్రదారులైన పోలీసు అధికారులను అరెస్టుచేసి విచారించి కోర్టులో ప్రవేశపెట్టారు. కీలకపాత్ర పోషించిన ప్రభాకరరావు, శ్రవణ్ రావును విచారిస్తున్నారు. బాధితులకు నోటీసులు ఇచ్చి వాగ్మూలాలు తీసుకుంటున్నారు. ఇందులో సిట్ అధికారులను తప్పుపట్టాల్సింది ఏముందో అర్ధంకావటంలేదు. విషయం ఏమిటంటే సిట్ విచారణ తమమీద కూడా మొదలైతే తాము బాగా ఇరుక్కోవటం ఖాయమనే టెన్షన్ తండ్రి, కొడుకుల్లో పెరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. అందుకనే లోపలపెరిగిపోతున్న భయం బయటపడకుండా సిట్ కు బదులు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. ఇది సరిపోనట్లుగా మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాపింగ్ చేయిస్తున్నారంటు నిరాధార ఆరోపణలతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News