‘సబ్ కోటా’ రాగమందుకున్న కవిత

కేవియెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతాం..;

Update: 2025-07-16 11:23 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త డిమాండ్ స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరిన ఆమె ఇప్పుడు సబ్ కోటా కూడా అడుగుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. ఇప్పటి వరకు రాజకీయ అవకాశం దక్కని కులాలకు సబ్ కోటా అందించాలని డిమాండ్ చేశారామే. ఆమె చేసిన ఈ డిమాండ్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం పోరాటాలు చేస్తాం అన్న కవిత.. ఇప్పుడు ఒక్కసారిగా ‘బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే?’ అంటూ మాట్లాడటం కీలకంగా మారింది. కవితకు తమ పోరాటాలపై నమ్మకం లేదా? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

కవిత డిమాండ్ అందుకే మారిందా..!

మొన్నటి వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. అందుకోసం జులై 17న రైల్ రోకో కార్యక్రమానికి కూడా పిలుపిచ్చారు. ఇంతలో ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం తెలపడంతో రైల్ రోకోను వాయిదా వేశారు. తాజాగా బీసీలకు రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసి దానిని గవర్నర్ ముందుకు పంపింది. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే కవిత డిమాండ్ మారింది. మొన్నటి వరకు బీసీలకు 42 రిజర్వేషన్లు అన్న కవిత.. ఇప్పుడు సబ్ కోటా అంటున్నారు.

అప్పటి వరకు పోరాటం ఆగదు..!

‘‘25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. ఆ 25 వేల పదవుల్లో సగం మంది మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలి. సర్పంచులు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు బీసీలలో ఉన్నాయి.. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో.. రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడమూ అంతే ముఖ్యం’’ అని అన్నారు.

‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి.. అది కేంద్రం పరిధిలో ఉంటుంది.. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నది.. గవర్నర్ కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదమున్నది.. ఆ అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని కోరారు.

‘‘రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజకీయ అవకాశాలు దక్కని కులాల నుంచి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ లు కావాలంటే సబ్ కేటగరైజేషన్ ఒక్కటే మార్గం. రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతాం.. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News