కెసీఆర్ తెలంగాణ కాదు, ఇదే అసలు తెలంగాణ, ప్రజల తెలంగాణ’

తెలంగాణలో రాజకీయాలు ఉన్నట్లుండి వేడేక్కాయి. మేమే తెలంగాణ అస్థిత్వాన్ని బయటకు తెస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే, వ్యక్తిగత కక్ష్యతోనే చేస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది.

Update: 2024-02-05 11:49 GMT

తెలంగాణలో ఇక నుంచి టీఎస్ పేరు మీద కాకుండా టీజీ పేరు మీదనే వాహనాల రిజిస్ట్రేషన్. .తెలంగాణ తల్లి విగ్రహం లో మార్పు. తెలంగాణ రాష్ట్ర గేయంగా జయజయహే తెలంగాణ .. నిన్న మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. అసలు ఎందుకీ మార్పు.. ఏమిటీ దీని వెనక ఉన్న కథ..

ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఏర్పడటానికి కంటే ముందే ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది, ప్రత్యేక అస్థిత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ అస్థిత్వం దెబ్బతిందనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం.. మరి తెలంగాణ, తిరిగి సొంత పాలనలో సొంత అస్థిత్వాన్ని పొందిందా.. లేదా పాలకులు తమ అస్థిత్వాన్నే తెలంగాణ ఆత్మగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారా?.

రాష్ట్ర ఆవిర్భావం తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, తెలంగాణ మార్క్ మాత్రమే రాష్ట్రంలో కనిపించాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ పేరుతో ఉన్న వాటికి తెలంగాణ నాయకులు, మేధావుల పేర్లను పెట్టడం ప్రారంభించారు. మొదట జయశంకర్ సార్, మాజీ ప్రధాని పీవీ పేరును యూనివర్శీటీలకు పెట్టారు. తరువాత కొత్త ప్రాజెక్ట్ లను నిర్మించి, వాటికి తెలంగాణ అస్థిత్వం కనిపించేలా చర్యలు తీసుకున్నారు.

కానీ ఇదే అదనుగా తెలంగాణ అంటే తన పేరు మాత్రమే కనిపించేలా, రాజకీయంగా తనకు, తన ముందు తరాలకు భవిష్యత్ లాభించేలా ఏర్పాట్లు సైతం చేసుకున్నారని కొంతమంది తెలంగాణ మేధావుల ఆరోపణ. అందుకే ప్రత్యేకంగా కొన్ని నిర్మాణాలు చేపట్టి ఆంధ్ర ప్రదేశ్ అస్థిత్వాన్ని తొలగించే నెపంతో తన పేరు వచ్చేలా చేశాడని వారి వాదన.

ఆంధ్రప్రదేశ్ పాత సెక్రటేరియట్ భవనాన్ని కూల్చి దాని స్థానంలో కొత్త సెక్రటేరియట్ కట్టారని.. నిజంగా తెలంగాణ ప్రాంతానికి పాత సెక్రటేరియట్ చాలా చక్కగా సరిపోతుందనేది వారి వాదన. కానీ దానిని కూలగొట్టి కొత్తది కట్టారు. ఎవరైన సెక్రటేరియట్ అనగానే ఇక నుంచి కేసీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారని గులాబీ పార్టీ పెద్దల ఆలోచన. ప్రగతి భవన్ నిర్మాణం కూడా ఈ కోవలోకే వస్తుందని, అలాగే తెలంగాణ అమరవీరులకు ప్రత్యేక నిర్మాణాలు, అంబేడ్కర్ విగ్రహం, తన పార్టీ పేరు వచ్చేలా టీఎస్ అని వాహనాల రిజిస్ట్రేషన్ వంటి అంశాలను వీటికి ఉదాహారణగా వారు చెబుతున్నారు.



 


ఉద్యమం అంటే ఆయనే ఉండేలా చేసుకున్నారు

" తెలంగాణ ఉద్యమకాలంలో అన్ని వాహానాల నంబర్ ప్లేట్లపై ఏపీ బదులు టీజీ గా మేము మార్పు చేశాం. అలాగే జయజయహే తెలంగాణ గీతాన్ని అన్ని ఉద్యమ సందర్భాల్లో పాడాము. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మాకు వీలైన చోట ఆవిష్కరించాం. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత టీజీ బదులు టీఎస్ గా మార్పు చేశారు. తెలంగాణ గీతానికి ప్రాధాన్యం దక్కలేదు. కేసీఆర్ తన కంటే ఎవరికి కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తనే ఉద్యమ ఛాంపియన్ అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ తెలంగాణ ఉద్యమకారుడు తన అభిప్రాయాలను ఫెడరల్ తో పంచుకున్నారు.

మంత్రి వర్గం కూర్చుకునేదీ ఇందుకా?

తెలంగాణ ఉద్యమకాలంలోకి ఒక్కసారి వెనక్కి వెళ్తే.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తీసుకుంటే.. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ కు ఉన్న అస్థిత్వాలు, ఆనవాళ్లలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మాకు తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఉందని.. ఇందులో ఓ చేతిలో బతుకమ్మ.. మరో చేతిలో మొక్కజొన్న కంకి.. ఇలా తెలంగాణ పంటలు, మెట్ట ప్రాంతమని తెలంగాణను సూచించే విధంగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. ఆ విగ్రహాలను ఊరురా ఆవిష్కరించడం ప్రారంభించారు.

" కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం అనేక మంది మేధావులతో చర్చించి, తెలంగాణ సాంస్కృతిక అంశాలను మేళవించి, ఉద్యమ భావజాలాన్ని ప్రజలకు చేరువ చేయడానికి, చూడగానే తెలంగాణ గుర్తుకు వచ్చేలా రూపొందించాం " అని హనుమకొండ జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్ ఫెడరల్ తో అన్నారు. కానీ ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం మార్చాలనుకుంటోంది.. ఒక్క వ్యాలిడ్ కారణం చూపండి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మంత్రి వర్గం కూర్చుంది వీటిని మార్చడానికా? ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయండి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "మీరు మార్చాలనుకుంటే మారేది కాదు, తెలంగాణ ఛాంపియన్ కేసీఆరే" అని సుధీర్ కుమార్ అన్నారు. ఎన్ని ఎత్తులు వేసిన కేసీఆర్ చిత్రాన్ని తెలంగాణ ప్రజల మది నుంచి తొలగించలేరని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం

తెలంగాణ గ్రామ ప్రజల ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం కేసీఆర్ ఎప్పుడు చేయలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తమ ప్రభుత్వమే ఇప్పుడు ఆ పని మొదలు పెట్టిందని అసలు సిసలు తెలంగాణను ఆవిష్కరించే మొదటి అడుగు వేశామని పీసీసీ ఉత్తర తెలంగాణ కో ఆర్డినేటర్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఫెడరల్ తో చెప్పారు.

" తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, టీజీ పేరు మార్పు అనే విషయాలు సెకండరీ.. మొదట ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, రైతులకు సాగునీరు అందివ్వడం, ఇచ్చిన హమీలను అమలు చేయాలని సమగ్ర కార్యచరణ రూపొందించాం. అయినా తెలంగాణ తల్లి విగ్రహం.. దొరల గడీల నుంచి వచ్చిన దొరసానమ్మలా ఉంది. సామాన్య ప్రజలకు ఆ విగ్రహంతో ఏం సంబంధం ఉంది" అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా తెలంగాణను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం తప్పా.. ఎవరిపైనో వ్యక్తిగత కోపంతో చేస్తున్న పనులు కావని చెప్పారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను పరిపాలించడంలో బీఆర్ఎస్ విఫలమయింది, ప్రజలు అందుకే తిరిగి మాకు అధికారం ఇచ్చారని చెప్పారు.

అందరి ఆమోదంతో నిర్ణయం తీసుకోవాలి: ప్రొఫెసర్ కోదండరామ్

ఈ అంశంపై ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ " ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా  ఉద్యమకాలంలో ప్రజల మద్ధతు పొందినవే. వాటిని కావాలని ప్రజలు కోరారు. ఉద్యమసమయంలో ఏపీ స్థానంలో టీజీ పేరు వాడారు" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అందరి ఆమోదంతో ఈ మార్పులు, చేర్పులు చేయాలి. ముఖ్యంగా తెలంగాణ చిహ్నం విషయంలో చరిత్ర, కవులు, కళాకారులు ఇలా అందరి నిర్ణయాలు తీసుకోవాలి. అలా అయితే భవిష్యత్ లో వాటిని తిరిగి మార్చే అవకాశం ఉండదు" అని పేర్కొన్నారు.  

ప్రస్తుతం తెలంగాణలో అస్థిత్వ మార్పు రాజకీయాలు మొదలయ్యాయి. వీటిని ఏ పార్టీ సమర్థవంతంగా వాడుకుని ప్రజలను తమ వైపు తిప్పుకుంటుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇవే ప్రధాన అంశంగా మారుతాయా? కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News