బీజేపీని కేసీయారే గెలిపిస్తున్నారా ?
ఉద్యమపార్టీగా అవతరించి, రాజకీయపార్టీ టీఆర్ఎస్ గా మారి పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ గా మారిన కారుపార్టీకి ప్రస్తుత పరిస్ధితి ఎందుకు వచ్చింది ?
పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సరళిని చూస్తే ఈ విషయమే స్పష్టమవుతోంది. ఉదయం మొదలైన కౌంటింగ్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 17 పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్, బీజేపీ దాదాపు పంచుకున్నట్లయ్యింది. మొత్తం సీట్లలో కాంగ్రెస్-బీజేపీ చెరి 8 సీట్లలో ఆధిక్యంలో ఉండగా మిగిలిన ఒక్క సీటులో ఎంఐఎం లీడ్ లో ఉంది. మెదక్ పార్లమెంటు సీటులో కొంతసేపు మాత్రమే బీఆర్ఎస్ మెజారిటిలో ఉంది. రెండు రౌండ్లు అయ్యేసరికి కారుపార్టీ అభ్యర్ధి మళ్ళీ వెనకబడిపోయారు. దాంతో 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ సత్తాచాటలేకపోయిందని అర్ధమవుతోంది.
ఉద్యమపార్టీగా అవతరించి, రాజకీయపార్టీ టీఆర్ఎస్ గా మారి పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ గా మారిన కారుపార్టీకి ప్రస్తుత పరిస్ధితి ఎందుకు వచ్చింది ? ఎందుకు వచ్చిందంటే పార్టీ అధినేత కేసీయార్ వైఖరే కారణమని చెప్పాలి. ప్రత్యేక తెలంగాణా సాధనలో చాలామందిని కలుపుకుని వెళ్ళిన కేసీయార్ అధికారంలోకి రాగానే పూర్తిగా మారిపోయారు. ముఖ్యంగా తెలంగాణాలో తనకు ఎదురన్నదే ఉండకూడదన్న ఆలోచనతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారు. ముందుగా టీడీపీని నాశనంచేసేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని చీలికలు పీలికలుచేశారు. వామపక్షాల్లోని నేతల్లో చాలామందిని తన పార్టీలో చేర్చేసుకున్నారు. టీడీపీ నాశనమైపోయింది, కాంగ్రెస్ చీలికలైపోయిందని సంతోషించారు. అయితే జనాలు మాత్రం ఇంకోవిధంగా ఆలోచించారు.
తెలంగాణాలో తనకు ఎదురన్నదే లేకుండా చేసుకున్నానని కేసీయార్ అనుకుంటే జనాలు మాత్రం ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ తప్ప మరో పార్టీయే ఉండకూడదని కేసీయార్ అనుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయటానికి జనాలకు బీఆర్ఎస్ తప్ప మరో పార్టీ కనబడకూడదని కేసీయార్ భావించారు. ఆ విధంగా పార్టీని తిరుగులేని శక్తిగా మలచాలని కేసీయార్ కలలుకన్నారు. అయితే జనాలు మాత్రం అనివార్య పరిస్థితిలోనే బీజేపీ వైపు మొగ్గుచూపారు. టీడీపీ, కాంగ్రెస్ ను బాగా ఇబ్బందిపెట్టిన కేసీయార్ బీజేపీ జోలికి మాత్రం వెళ్ళలేదు. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమో నరేంద్రమోడి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉండటం. రెండో కారణం అప్పటికి బీజేపీ బలం తెలంగాణాలో పెద్దగా లేకపోవటమే.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావంచూపని బీజేపీ 2019 ఎన్నికల్లో ఏకంగా నాలుగు పార్లమెంటు సీట్లు గెలుచుకుంది. జెండా, బ్యానర్లు కట్టడానికి నేతలు లేని ఆదిలాబాద్ పార్లమెంటు సీటును కూడా బీజేపీ గెలుచుకోవటం అప్పట్లో సంచలనమైంది. పొరుగునే ఉన్న మహారాష్ట్ర ప్రభావం కారణంగా ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంటు సీట్లను బీజేపీ గెలుచుకున్నది. తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 45 డివిజన్లలో గెలిచింది. ఆ తర్వాత అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచింది. ఇప్పటి పార్లమెంటు ఎన్నికల్లో కడపటివార్తలు అందేసమయానికి 8 నియోజకవర్గాల్లో మెజారిటీలో ఉంది. గ్రేటర్ ఎన్నికలు మొదలుకుని అసెంబ్లీ, పార్లమెంటు ఏ ఎన్నికలు తీసుకున్నా కేసీయార్ పుణ్యమానే జనాలు బీజేపీకి ఓట్లేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయానికి కేసీయార్ వైఖరిని జనాలు భరించలేకపోయారు. అందుకనే బొటాబొటిగా అయినా కాంగ్రెస్ కు జనాలు అధికారం అప్పగించారు. ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా కేసీయార్, కేటీయార్, హరీష్ రావు వైఖరి ఎలాగుందంటే తామే ఇంకా అధికారంలో ఉన్నామనేట్లుగా వ్యవహరించారు. అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి కేసీయార్, కేటీయార్, హరీష్ పదేపదే ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. నిజానికి తెలంగాణాలో కరువు, విద్యుత్ కొరత లాంటి సమస్యలకు రేవంత్ ప్రభుత్వం బాధ్యత తక్కువే. అయినా సరే అన్నీ సమస్యలకు రేవంత్ ప్రభుత్వమే కారణమన్నట్లుగా బీఆర్ఎస్ ముఖ్యులు పదేపదే బురదచల్లేస్తున్నారు. ఇవన్నీ గమనించిన జనాలు ఎలాగూ కేసీయార్ కు ఓట్లేసి ఉపయోగంలేదని డిసైడయి, (హైదరాబాద్) ఎంఐఎం సీటు పోగా మిగిలిన సీట్లలో కాంగ్రెస్, బీజేపీలు ముందంజలో ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పుతానని, ప్రధానమంత్రి రేసులో ఉన్నానంటు ప్రకటనలు చేసిన కేసీయార్ ఇపుడేమి మాట్లాడుతారో చూడాలి.