కేసీఆర్ దెబ్బ రుచిచూడాల్సిందే
తాను కొడితే మామూలుగా ఉండదట. మామూలుగా కాదు గట్టిగా కొట్టడమే తనకు అలవాటని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వాన్ని కేసీఆర్(KCR) హెచ్చరించారు.;
ఇంతకాలానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోరిప్పారు. జహీరాబాద్ నియోజకవర్గం నేతలతో ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు సినిమా స్టైల్లో డైలాగులు కొట్టారు. అదేమిటంటే తాను కొడితే మామూలుగా ఉండదట. మామూలుగా కాదు గట్టిగా కొట్టడమే తనకు అలవాటని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వాన్ని కేసీఆర్(KCR) హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనను మౌనంగా, గంభీరంగా చూస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఫిబ్రవరి చివరలో భారీబహిరంగసభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ బహిరంగసభ ఎక్కడ, ఎందుకోసం నిర్వహిస్తున్నారని మాత్రం చెప్పలేదు. ప్రాజెక్టులన్నీ ఎక్కడవి అక్కడే పడుకున్నట్లు ఆరోపించారు. సంగమేశ్వరం, కాళేశ్వరం, బసవేశ్వరం ప్రాజెక్టులను ప్రభుత్వం ఎండబెడుతోందని మండిపోయారు.
ప్రాజెక్టులపై దండయాత్ర చేయాలని హరీష్ రావును ఆదేశించారు. దండయాత్ర కారణంగా అన్నీ ప్రాజెక్టుల్లోను నీళ్ళు రావాలన్నారు. ఎవడో ఏదో చెబితే జనాలు నమ్మి ఆలోచనలేకుండా కాంగ్రెస్ ను గెలిపించినట్లు ఎద్దేవాచేశారు. జనాలు గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి గుణపాఠమే చెబుతోందన్నారు. కరోనా కాలంలో కూడా రైతులకు తాను రైతుబంధు ఇచ్చిన విషయాన్నికేసీఆర్ గుర్తుచేశారు. గురుకుల హాస్టళ్ళల్లో తిండిలేక పిల్లలు అస్వస్ధతకు గురవ్వటం తనకు బాధకలిగిస్తున్నట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ నేతలు, క్యాడర్ తో కేసీఆర్ చాలాకాలం తర్వాత సమావేశమయ్యారు. మూడు ఎంఎల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇచ్చినా దాని ఊసేఎత్తలేదు. ఎన్నికల్లో పార్టీ పోటీచేస్తుందా లేదా అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇపుడు టాక్ ఆఫ్ ది స్టేట్ ఏమిటంటే మూడు ఎంఎల్సీ ఎన్నికలే అని అందరికీ తెలుసు. బీజేపీ అభ్యర్ధులను ప్రకటించగా కాంగ్రెస్ జాబితాను రెడీచేసి ఏఐసీసీ ఆమోదంకోసం పంపింది. బీఆర్ఎస్ లో మాత్రం ఆశావహులు, అభ్యర్ధులు, ప్రచారం లాంటి హడావుడి ఏమాత్రం కనబడటంలేదు. ఈరోజు జహీరాబాద్ సమావేశంలో కేసీఆర్ ఎంఎల్సీ ఎన్నికలపై పార్టీస్టాండ్ ఏమిటో ప్రకటిస్తారని నేతలు అనుకుంటే అసలాఊసే ఎత్తలేదు.
అప్పుడెప్పుడో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్ మీడియాతో మాట్లాడుతు ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతా ? ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా ? ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వనని చాలా భీకరమైన వార్నింగులిచ్చారు. తర్వాత చప్పుడు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుగురించి మాట్లాడుతు 50 వేలమంది రైతులతో దండయాత్ర చేస్తానని ప్రకటించేసి పోయి ఎర్రవల్లి ఫామ్ హస్(Erravalli Farmhouse) లో కూర్చున్నారు. ప్రభుత్వాన్ని చీల్చిచెండాడటం, గుండెల్లో నిద్రపోవటం, రైతులతో దండయాత్ర ఏమైందో ఎవరికీ తెలీదు. ఇంతకాలానికి మళ్ళీ ‘తాను కొడితే మామూలుగా ఉండద’ని సినిమా డైలాగులు వినిపించారు. చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తనదెబ్బ ఎప్పుడు రుచిచూపిస్తారో ఏమో చూడాల్సిందే.