జాతీయ నేతల సమక్షంలో సొంత గూటికి కేకే

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే.కేశవరావు తిరిగి సొంతగూటికి చేరారు.

Update: 2024-07-03 12:01 GMT

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే.కేశవరావు తిరిగి సొంతగూటికి చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆయనకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖర్గే తో పాటు ఎఐసిసి జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ఆయన అధికారికంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ.. కేకేకి అభినందనలు తెలిపారు.

కేకే తన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో కలిసి మార్చ్ నెలలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో లాంఛనంగా చేరారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే జాతీయ నాయకుల సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరే ప్రక్రియలో భాగంగా నేడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

కేకే కాంగ్రెస్ వాడే...

కేకే స్వతహాగా కాంగ్రెస్ నేత. ఆయన పలుమార్లు పీసీసీ చీఫ్ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వరిస్తూనే వచ్చాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు బీఆర్ఎస్ లో కూడా సముచిత స్థానం దక్కింది అనడంలో అతిశయోక్తి లేదు.

కేసీఆర్ ఆయనకి పార్టీలో పదవులతోపాటు, ప్రాధాన్యత కూడా కల్పించారు. గులాబీ బాస్ కి సన్నిహితంగా ఉండే కొద్దిమందిలో ఒక్కరిగా కేకే మెలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గులాబీ శ్రేణుల్ని షాక్ కి గురికి చేసింది. ఆయన పార్టీ మారడంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ఏం తక్కువ చేశామని పార్టీ మారారంటూ నిలదీశారు కూడా. కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. కేకే కుమారుడు విప్లవ్ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. 

రాజ్యసభకు రాజీనామా...

కేకే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారితే ఆయనపై అనర్హత వేటు పడుతుంది. అందుకే రాజీనామా చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. 2020లో బీఆర్ఎస్ నుంచి కేకే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకు పైగా ఆయన పదవీ కాలం ఉంది. అయితే రాజీనామా చేయడం వల్ల వచ్చే ఉపఎన్నిక ద్వారా ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కండిషన్ మీదనే కేకే కాంగ్రెస్ లో చేరారని టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News