అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ‘అమ్మలు’, ‘అమ్మమ్మలు’

అమ్రాబాద్ అడవిలో ‘సూపర్ మామ్’ కథేంటో తెలుసా?;

Update: 2025-08-12 05:33 GMT
పరహాబాద్ అడవిలో పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ‘ఫరా ఎఫ్ 6’ ఆడపులి

‘ఫరా ఎఫ్ 6’,‘తారా ఎఫ్ 7’, ‘బౌరమ్మఎఫ్ 18’...ఈ పేర్లు ఏమిటో తెలుసా? ఇవీ తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని ఆడపులుల పేర్లు...అమ్రాబాద్ అభయారణ్యంలో (Amrabad Tiger Reserve)పులుల సంతతి పెంచేందుకు తోడ్పడిన ఈ మాతృమూర్తులైన పులుల విషయం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పులుల సంతతి పెంచడం ద్వారా జీవవైవిధ్యానికి పాటుపడుతున్న ఈ సూపర్ మామ్స్ గా పేరొందిన ఆడపులుల కథ కమామీషు గురించి తెలుసుకుందాం.


పులుల సంఖ్య మూడు నుంచి 38 కి పెంపు
ఒకప్పుడు కేవలం మూడు పులులకు నిలయంగా ఉన్న తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఇప్పుడు 38కి పులుల(Tigers) సంఖ్య పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2017వ సంవత్సరం వరకు పులుల సంఖ్య అరకొరగానే ఉండేది. అమ్రాబాద్ అభయారణ్యంలో కేవలం 10 పులులే ఉండేవి. అమ్రాబాద్ ను పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించి పులుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది.నాటి నుంచి నేటి వరకు గత 8 ఏళ్లలో అమ్రాబాద్ లో పులుల సంఖ్య 38కి పెరిగింది.

‘ఎఫ్ 6 ఫరా’ ఆడపులి సంతతి
అమ్రాబాద్ అభయారణ్యంలోని ఫరాహాబాద్‌ అటవీ ప్రాంతానికి ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ ‘ఎఫ్ 6 ఫరా’ ఆడపులి వచ్చింది. ఫరాహాబాద్‌లో ఈ ఆడపులి కెమెరా ట్రాప్ చిత్రాలకు చిక్కడంతో దీనికి ఫరా ఫిమేల్ 6 అని అటవీశాఖ అధికారులు పేరు పెట్టారు. ఈ పులి వచ్చిన నాటి నుంచి ప్రతీ ఏటా మేటింగ్ సీజనులో మగ పులితో కలుస్తూ పులి కూనలకు జన్మనిస్తుంది. 2019వ సంవత్సరంలో ఫరా ఎఫ్ 6 పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. నాటి నుంచి నేటి వరకు అమ్రాబాద్ అడవిలో ఫరా తిరుగులేని మాతృమూర్తిగా మారింది. ఫరా పులి రక్తసంబంధం ఉన్న పులుల సంతతి ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నివసించే పులుల్లో సగ సగం ఉన్నాయని దీంతో ఫరాకు సూపర్ మమ్మా (Super Momma of Amrabad Farah)అని ఆప్యాయంగా పిలుస్తున్నామని అమ్రాబాద్ అటవీశాఖ రేంజి అధికారి కే ఈశ్వర్ ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పులుల పునరుజ్జీవనానికి ఫరా నాంది
ఫరా పులి నాలుగు సార్లు కూనలకు జన్మనిచ్చింది. పులి కూనలకు జన్మనివ్వడమే కాదు వాటిని కాపాడటంలోనూ ఫరా ముందుంది.ఈ ఏడాది ఫరా మరో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. నిజాం నవాబు పాలనలో అమ్రాబాద్ అరణ్యం వేటస్థలంగా ఉండేది. నాడు నిజాం పులులను వేటాడేందుకు తుపాకులను తీసుకొని గుర్రాలపై ఈ అడవికి వస్తుండేదని చరిత్ర చెబుతోంది.ఫరా అమ్రాబాద్ కు వచ్చిన తర్వాత సంతానోత్పత్తి వల్ల పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అందుకనే పులుల పునరుజ్జీవానికి ఫరానే ప్రధాన కారణంగా నిలిచింది. అమ్రాబాద్ లో పులుల సంతతిని వృద్ధి చేసి ఫరా జీవవైవిధ్యాన్ని తీసుకురావడం ద్వారా జనాభాకు చేసిన సహకారం అసాధారణం అని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘ఫరా ఎఫ్ 6 అమ్రాబాద్ లో పులుల జనాభా పెంచడంలో మూలస్తంభంగా మారింది, ఫరా వంశానికి చెందిన పులులు ఏటేటా పెరుగుతున్నాయి’’ అని రోహిత్ వివరించారు.

విజయానికి ఒక నమూనా
తల్లి పులి ఫరా మాతృమూర్తిగా వారసత్వాన్ని అభివృద్ధి చేసిన తీరు పులుల పునరుజ్జీవం, జీవవైవిధ్య విజయానికి నమూనాగా మారింది. అడవిలో పులి పిల్లల సంఖ్యను ఫరా పెంచింది.ఫరా సంతానం అద్భుతమైన మనుగడ సాధించిందని వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డి.మహేందర్ రెడ్డి చెప్పారు. ఫరా పులి వంశం బలమైన మనుగడ సాధించడానికి దీని జన్యువులే వాటి విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.2019, 2021, 2023,2025లో ఫరా పిల్లలు 80 శాతం మనుగడ రేటును సాధించాయని వన్యప్రాణి జీవశాస్త్రవేత్త వివరించారు.



 తల్లి ఫరా బాటలో బౌరమ్మ ఎఫ్ 18...

సూపర్ మామ్ ‘ఫరా ఎఫ్ 6’ పులి పిల్ల అయిన ‘బౌరమ్మ ఎఫ్18’ ఆడపులి పెరిగి పెద్దదై తల్లి లాగానే ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, స్వయంగా పులి కూనలకు జన్మనిస్తూ మాతృమూర్తిగా మారింది. స్థానిక గిరిజన చెంచులు బౌరమ్మ ఆలయం సమీపంలో దానిని చూడటంతో దానికి బౌరమ్మ అని అటవీశాఖ అధికారులు పేరు పెట్టారు. బౌరమ్మ 2022వ సంవత్సరంలో పుట్టిన నాలుగు పిల్లలన్నీ ప్రాణాలతో మనుగడ సాధించాయని బీట్ ఆఫీసర్ షేక్ ముహ్మద్ ఖాదర్ పాషా చెప్పారు. మరో సారి బౌరమ్మ రెండు పులి కూనలకు జన్మనిచ్చింది. అటవీ సిబ్బంది, చెంచుల పర్యవేక్షణలో పులి పిల్లలు సురక్షితంగా పెరిగాయి. ఫరా పులి పిల్ల అయిన బౌరమ్మ సంతానోత్పత్తిలో సాధించిన విజయంతో ఫరా పులి వారసత్వం పెరిగింది. అమ్రాబాద్‌అడవిలోని పులుల జనాభాలో 50శాతం కంటే ఎక్కువ పులులు ఫరా కుటుంబానికి చెందినవని అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె ఈశ్వర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 తారా పులి నాలుగు కూనలకు జన్మనిచ్చింది...

తారా అని అటవీశాఖ అధికారులు పిలిచే ‘ఎఫ్ 7’ ఆడపులి కూడా అమ్రాబాద్ అడవిలో పులుల సంతతి పెరుగుదలకు ముఖ్యమైన పాత్ర పోషించింది.తారా పులికి ఫరాతో సంబంధం లేనప్పటికీ,ఇది మూడు సార్లు పిల్లల్ని పెట్టింది. తారా పులి కూనల్లో రెండు పెరిగి పెద్దవి అయ్యాయి. తారా పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అమ్రాబాద్ రిజర్వ్ జన్యు వైవిధ్యం, జీవశక్తిని సుసంపన్నం చేయడంలో తారా కూడా ఉంది.తారా కూడా ఫరా లాగా సమృద్ధిగా పులుల సంతానోత్పత్తి చేస్తుంది.



 సంతానోత్పత్తిలో మగ పులుల పాత్ర కీలకం

అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంతతిని పెంచడంలో ఫరా,తారా, బౌరమ్మ ఆడపులులే కాకుండా కొన్ని మగపులులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. తన విలక్షణమైన ముఖ గుర్తింపుతో సీజర్ అని అటవీశాఖ అధికారులు పిలుచుకునే ఎం 22 మగ పులి ఆడపులులతో కలుస్తూ సంతానోత్పత్తికి దోహదపడింది.ఆల్ఫా మగపులి కూడా అమ్రాబాద్ అభయారణ్యంలోని కొల్హాపూర్, లింగాల, అత్కాంపేట్, మన్ననూర్, మద్దిమడుగు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆడపులులతో సంపర్కం చేస్తుంది. మేల్ 23 పులిక కూడా అడవిలో సంచరిస్తూ మేటింగ్ సీజనులో ఆడ పులులతో సంభోగిస్తూ పులుల సంతతి పెంచేందుకు తోడ్పడింది. జులై నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు మూడునెలల పాటు జరిగే మేటింగ్ సీజనులో ఆడపులులు గర్భం దాలుస్తున్నాయి. గర్భం దాల్చిన మూడు నెలల్లోనే పులులు కూనలకు జన్మనిస్తుంటాయని అటవీశాఖ బీట్ ఆఫీసర్ ముహమ్మద్ ఖాదర్ పాషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

నల్లమల అడవులు...పులుల సంతానోత్పత్తికి కేంద్రాలు
చుట్టూ కొండలు, గుట్టలు...జాలువారుతున్న జలపాతాలు...లోతైన లోయలు...పచ్చని ఎతైన చెట్లు...చెరువులు, వాగులు, వంకలు...గలగల పారుతున్న కృష్ణానదీ ఇదీ అమ్రాబాద్ పులుల అభయారణ్యం...జీవ వైవిధ్యంతో పులుల సంతానోత్పత్తికి కేంద్రంగా మారింది.అమ్రాబాద్ అభయారణ్యంలో సూపర్ మామ్ లు గా పేరొందిన ఫరా,తారా, బౌరమ్మలు మేటింగ్ సీజనులో మగ పులితో కలిసి గర్భం దాలుస్తూ పులి కూనలకు జన్మనిస్తున్నాయి.ప్రస్థుతం పులుల మేటింగ్ సీజన్ నడుస్తోంది. సెప్టెంబరు 30తో మేటింగ్ సీజన్ పూర్తిఅయితే పలు ఆడపులులు గర్భం దాల్చి మూడు నెలల్లోనే పులి కూనలకు జన్మనివ్వనున్నాయి. దీంతో అమ్రాబాద్ లో పులి పిల్లల సంఖ్య పెరగనుందని డీఎఫ్ఓ గోపిడి రోహిత్ చెప్పారు.

రెట్టింపు కానున్న పులుల సంఖ్య
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో 2017వ సంవత్సరంలో 6 ఉన్న పులుల సంఖ్య ఈ ఏడాది 36 కు పెరిగాయి. అభయారణ్యంలో సురక్షితమైన పులుల ఆవాసాలు, వీటికి కావాల్సిన ఆహారం, నీరు పుష్కలంగా ఉండటంతో ఆడపులులు పిల్లల్ని పెడుతున్నాయి.అమ్రాబాద్ అడవిలో ఫరా 6 అనే పేరుగల పులి 5 సార్లు పులి కూనలకు జన్మనిచ్చి సూపర్ మామ్ గా నిలిచింది.ఫరా 6 పిల్ల అయిన ఎఫ్ 18 బౌరమ్మ ఆడపులి ఎం 19 మగపులితో కలిసి మూడు సార్లు ఆరు పులి కూనలకు జన్మనిచ్చింది.అమ్రాబాద్ అడవిలో ఆడపులుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు సంతానోత్పత్తి వల్ల ఏ యేటి కాఏడు అమ్రాబాద్ లో పులుల సంఖ్య పెరుగుతుంది. అడవిలో పులులు వేటాడేందుకు కావాల్సిన జింకలు, దుప్పులు,మనుబోతుల సంఖ్య 4వేలకు పైగా ఉన్నాయి. ఒక్క పులి వారానికి ఒక జింకను వేటాడుతోంది. అంటే ఏడాది కాలంలో 52 జింకలను వేటాడి తింటోంది. పులి సంచారానికి కావాల్సిన అటవీ ప్రాంతం ఉండటంతో ప్రస్థుతం 38 ఉన్న పులుల సంఖ్య మరో మూడేళ్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేశారు.
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పెరుగుతున్న పులుల పట్టిక
సంవత్సరం పులుల సంఖ్య
2017      -            10
2018       -           07
2019       -           12
2020       -           12
2021        -          14
2022       -           21
2024         -         33
2025        -          38


Tags:    

Similar News