‘హోంమంత్రి పదవి అంటే ఇష్టం’ అని చెప్పిన కోమటిరెడ్డి
లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేస్తు తనకు ఢిల్లీ నుండి ఇంకా ఫోన్ రాలేదన్నారు;
తెలుగులో ఒక సామెతుంది. ‘ఆలులేదు చూలులేదు అల్లుడి పేరు సోమలింగం’ అని. సామెతలో చెప్పినట్లుగా ఉంది మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(komatireddy) వ్యవహారం. మంత్రివర్గ విస్తరణ తేదీ ఇంకా ఖరారే కాలేదు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందన్న విషయం సస్పెన్సుగానే ఉంది. క్యాబినెట్లో చోటుదక్కుతుందనే పేర్లను మీడియానే ప్రచారంచేస్తోంది. ఈనేపధ్యంలోనే తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కోమటిరెడ్డి ప్రకటించేశారు. అసెంబ్లీ(Telangana Assembly) లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేస్తు తనకు ఢిల్లీ నుండి ఇంకా ఫోన్ రాలేదన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అనుకుంటున్నట్లు ధీమాగా చెప్పారు.
ఆధీమాకు కారణం ఏమిటంటే తాను సమర్ధుడు కాబట్టే అని సమాధానం చెబుతున్నారు. గతంలో భువనగిరి ఎంపీ పదవిని సమర్ధవంతంగా నిర్వహించినట్లు కోమటిరెడ్డి తనకు తానే సెల్ప్ సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. తాను సమర్ధుడు కాబట్టే హోంమంత్రిపదవి అంటే చాలాఇష్టమన్నారు. అయితే ఏశాఖ ఇచ్చినా సమర్ధవంతంగానే నిర్వహిస్తాను అనటంలో సందేహంలేదని కూడా అన్నారు. అప్పటికి మంత్రివర్గ విస్తరణలో తనకు స్ధానం ఖాయమైపోయిందన్నట్లుగా కోమటిరెడ్డి మాట్లాడేశారు. పదవులున్నా లేకపోయినా తాను ఎప్పుడూ ప్రజలపక్షానే నిలబడతానని చెప్పారు.
అయితే తనకు ఉన్న మైనస్ గురించి మాత్రం కోమటిరెడ్డి చెప్పలేదు. ఇంతకీ ఆమైనస్ ఏమిటంటే ఇప్పటికే మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి ఎవరంటే రాజగోపాలరెడ్డికి స్వయానా అన్న. అన్నా, దమ్ములకు ఏకకాలంలో క్యాబినెట్ బెర్తులు ఇవ్వటం సాధ్యమేనా ? అన్నదే అసలైన పాయింట్. అన్న, దమ్ములిద్దరికీ క్యాబినెట్లో చోటు కల్పిస్తే మరి మిగిలిన రెడ్డి ఎంఎల్ఏలు చూస్తూ ఊరుకుంటారా ? ఏమో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అదృష్టం ఎలాగుందో చూడాల్సిందే.