‘నేను మాట్లాడింది కాంగ్రెస్ మంత్రుల గురించి కాదు’

కమిషన్లు తీసుకున్నవారే ఈ దుష్ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు.;

Update: 2025-05-16 08:19 GMT

‘మూట ముట్టకుండా మంత్రులు ఏ పని చేయరు’ అని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. పైగా ఈ వ్యాఖ్యలను ఆమె బహిరంగా చేయడం తీవ్ర చర్చలకు దారితీసింది. సహచర మంత్రులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడమేంటి? అని అనేక మంది షాకయ్యారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు మంత్రి కొండా సురేఖ. అవి తాను గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి చేసినవి కాదని చెప్పారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని విమర్శించారు. కమిషన్లు తీసుకున్నవారే ఈ దుష్ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. వరంగల్‌లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించనున్న నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటికి శుక్రవారం వివరణ ఇచ్చారు.

‘‘నేను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల కమిషన్ల గురించి చెప్పాను. కానీ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడినట్లు వక్రీకరిస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్ కవితల అవినీతి ఏంటో ప్రజలకు తెలుసు. గత పదేళ్లలో గులాబీ మంత్రులు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేసి ఎంత సంపాదించారో తెలీదా. పార్టీలు పెట్టే అంత డబ్బు కవిత దగ్గర ఎలా వచ్చింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో ఎంత దోచుకున్నారు తెలియదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు నా వ్యాఖ్యలకు బీ ఆర్ ఎస్ నేతలు రెస్పాండ్ అవుతున్నారు. సోషల్ మీడియా ట్రోలర్స్ కు ఇదే చివరి అవకాశం. కేటీఆర్ ఇచ్చే డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేయొద్దు. కాంగ్రెస్ మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ కి ఫిర్యాదు చేస్తాను. నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక నా క్యారెక్టర్ ను అసాసిన్ చేస్తున్నారు. బిఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఎలా ఉందో... కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎలా ఉందో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.

ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడమే కాకుండా అవి పార్టీలో కూడా తీవ్ర వివాదానికి దారితీశాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండాసురేఖను పార్టీ పెద్దలు ఈ అంశంపై ప్రశ్నించారని, వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చిన తన మాటలకు వివరణ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ అంతా కూడా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయని, వివరణ ఇవ్వకుండా పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని కొండా సురేఖను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత, కేటీఆర్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పార్టీ హైకమాండ్ కూడా ఈ అంశంపై దృష్టించింది. మళ్ళీ ఇప్పుడు సొంత పార్టీ నేతలనే విమర్శించినట్లు ఫిర్యాదు వెళ్తే తన పదవి పోయే అవకాశం ఉండటంతో కొండా సురేఖ ఆగమేఘాలపై వివరణ ఇచ్చినట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Tags:    

Similar News