కేటీయార్ చెంపలేసుకున్నారా ?

రెండువరుస ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కు జ్ఞానోదయం అయినట్లుంది.

Update: 2024-07-10 06:00 GMT
KTR

రెండువరుస ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కు జ్ఞానోదయం అయినట్లుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు పార్లమెంటు ఎన్నికల్లో ఘోరఓటమికి తమ వైఖరే ప్రధాన కారణమని కేటీయార్ ఇపుడు గ్రహించినట్లున్నారు. అందుకనే మీడియాతో మాట్లాడుతు పార్టీ ఓటమికి తాము చేసిన తప్పులే కారణమని అంగీకరించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితమై బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అలాగే ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను సరిచేసుకుని పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుంటామని కేసీయార్, కేటీయార్, హరీష్ రావు తదితరులు చెప్పారు. జనాలు కూడా నిజమే అనుకున్నారు. అయితే వీళ్ళ వైఖరిలో ఏమాత్రం మార్పుకనబడలేదు. అనేక కారణాల వల్ల పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 17 సీట్లలో పార్టీ ఒక్కటంటే కనీసం ఒక్క సీటులో కూడా గెలవలేదు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కేసీయార్, కేటీయార్,హరీష్ రావులు జనాలను కాంగ్రెస్ పార్టీ మోసంచేసి ఓట్లేయించుకుని గెలిచిందని చాలాసార్లు చెప్పారు. సిక్స్ గ్యారెంటీస్ హామీల పేరుతో జనాలను కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పిన వీళ్ళు తాము రెండుసార్లు ఎలాగ గెలిచామన్న విషయాన్ని మరచిపోయారు.

తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో చాలా రోజులు వీళ్ళు ఎక్కడా నోరిప్పలేదు. చివరకు ఏమనుకున్నారో ఏమో ఢిల్లీలో మీడియా సమావేశంలో హరీష్ తో కలిసి కేటీయార్ మాట్లాడుతు పార్టీ ఓటమికి ప్రజలను తప్పుపట్టడం సరికాదని అంగీకరించారు. తాము తప్పులు చేశాం కాబట్టే జనాలను బీఆర్ఎస్ ను ఓడించారని ఒప్పుకున్నారు. తమ వైఖరిని మార్చుకోవాలని అంగీకరించారు. ప్రజలకు తమకు బాగా గ్యాప్ వచ్చేసిందన్న విషయాన్ని కేటీయార్ చివరకు ఒప్పుకున్నారు. పదేళ్ళల్లో చేసిన మంచిని కూడా తాము చెప్పుకోలేకపోవటం తమ తప్పే అని సమర్ధించుకున్నారు. అయితే ఈ విషయంలో కేటీయార్ అబద్ధం చెప్పారు.

ఎలాగంటే పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు మీడియాలో తమకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాలో మెజారిటి కేసీయార్, బీఆర్ఎస్ గురించి చాలావరకు పాజిటివ్ గానే ప్రొజెక్టుచేసింది. నెగిటివ్ కథనాలు, వార్తలను కేసీయార్ ఏమాత్రం సహించలేదు. అందుకనే కేసీయార్ కు భయపడే చాలామీడియా యాజమాన్యాలు వాస్తవాలను చెప్పకుండా దాచిపెట్టాయి. దాని ఫలితమే జనాలు తమ ప్రభుత్వం గురించి, పార్టీగురించి ఏమనుంటున్నారనే విషయం కేసీయార్, కేటీయార్ కు తెలీలేదు. అదే మీడియా జోలికిరాకుండా ఉండుంటే తప్పు ఒప్పో రాసేదేవే రాసేది క్షేత్రస్ధాయిలోని వాస్తవాలేవో ఎంతోకొంత కేసీయార్, కేటీయార్ కు అర్ధమయ్యేది.

ఇదే సమయంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లను ప్రస్తావించారు. తాము అభివృద్ధి చేసిన గ్రేటర్ పరిధిలోనే తమకు ఎక్కువ సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీలో సంక్షేమపథకాలను పెద్దఎత్తున అమలుచేసినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఆశ్చర్యమనిపించిందన్నారు. ఇదేసమయంలో హరీష్ మాట్లాడుతు ఫిరాయింపులకు పాల్పడటం వల్ల బీఆర్ఎస్ లాభపడింది ఏమీలేదన్న నిజాన్ని బయటపెట్టారు. ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలోకి తీసుకున్న 11 మంది ఎంఎల్ఏలకు టికెట్లిస్తే అందులో పదిమంది ఓడిపోయారని చెప్పారు. అయితే హరీష్ ఫిరాయింపుల సంఖ్యను తప్పుచెప్పారు. తన పదేళ్ళ కాలంలో ఇతర పార్టీలకు చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను కేసీయార్ పార్టీలోకి లాక్కున్నారు. జనాలకు దూరంగా ఉన్నారు కాబట్టే తమపార్టీ అభ్యర్ధులను ఓడించారనే ప్రచారాన్ని కేటీయార్ కొట్టిపారేశారు. ఏపీలోని ధర్మవరం ఎంఎల్ఏ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఐదేళ్ళూ జనాలతోనే ఉన్నా మరి ఎందుకు ఓడిపోయారని కేటీయార్ ఎదురు ప్రశ్నించారు. జనాలు ఎవరికి ఎందుకు ఓట్లేస్తారో ? ఎవరిని ఎందుకు ఓడిస్తారో ఎవరికీ తెలీదనే నిజాన్ని అంగీకరించారు. మొత్తానికి రెండువరుస ఓటములు ఎదురైన ఇంతకాలానికి బీఆర్ఎస్ ఓటమికి తాము చేసిన తప్పులే కారణమని కేటీయార్ చెంపలేసుకున్నారు.

Tags:    

Similar News