జగదీష్ రెడ్డి కోసం ఏకమైన బీఆర్ఎస్ శ్రేణులు

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సత్తా లేక గొంతునొక్కాలని చూస్తున్న సీఎం రేవంత్‌ చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని కేటీఆర్ అన్నారు.;

Update: 2025-03-14 13:25 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోసం పార్టీ శ్రేణులన్నీ కదిలాయి. ఆయన సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన బాటపట్టాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గులాబీ దండు ధర్నాలు చేపట్టింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకునే అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధికి అన్యాయం జరిగిందని నినదిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గులాబీ ఏకమైన నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ తన అరాచకాలకు అసెంబ్లీనే అడ్డాగా మార్చుకుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన పార్టీ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. శ్రేణులు చూపిన సమరోత్సాహం అద్భుతమని, ఇదే ఐకమత్యంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రతరంగా నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని, ప్రజాసమస్యలపై నిలదీస్తున్నారన్న భయంతోనే కాంగ్రెస్.. జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌కు కుట్రలు పన్నిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపమైన అసెంబ్లీని తన నియంతృత్వ పోకడలతో రేవంత్ రెడ్డి భ్రష్టుపట్టించారని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా చెయ్యని రేవంత్ రెడ్డి, తన చేతకానితనం బయటపడొద్దనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే ప్రజా కోర్టులో తేల్చుకుంటామని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను, హామీల అమలు మోసాన్ని ఇదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎండగడదామన్నారు.

‘‘బీఆర్ఎస్ ఇవాళ పూరించిన జంగ్ సైరన్ ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ మోసకారి ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమపంథాను కొనసాగిద్దాం. జగదీశ్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సస్పెండ్ చేసి సభ నుంచి పారిపోయిన కాంగ్రెస్ సర్కారు, ప్రజాక్షేత్రంలో నాలుగు కోట్ల ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేదు. ఆరు గ్యారెంటీలతో ఆగంచేసి, 420 హామీలతో మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కారు పాపం పండింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సత్తా లేక గొంతునొక్కాలని చూస్తున్న సీఎం రేవంత్‌ చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు ఇలాగే సంఘటితశక్తిగా ముందుకు సాగుదాం.. ’’ అని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News