రాష్ట్రవ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ రెడీ..

Update: 2025-09-01 07:53 GMT

కళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. తీర్మానం చేయకుండానే సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ ఒంటెద్దుపోకడకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు చేయాలని బీఆర్ఎస్ నిశ్చయించుకుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్తాయిలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని కోరారు. అన్ని విధాలుగా బీఆర్ఎస్ వాయిస్‌ను వినిపించాలని, కాంగ్రెస్ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు చాటిచెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు.

‘‘కాళేశ్వరంపై కాంగ్రెస్ భారీ కుట్ర చేస్తోంది. తెలంగాణ వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్ట్‌ను శాశ్వతంగా మూసివేయాలని, తెలంగాణ నదీ జలాలను ఆంధ్రకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం తన అధికారాన్ని వినియోగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే ఈ కుట్రలు పన్నారు. వారిని మనమంతా ఎదుర్కోవాలి. కాళేశ్వరాన్ని ఎండగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీబీఐకి కాళేశ్వరం కమిషన్ నివేదికను అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్ట్‌ను మూసేయడమే. నిన్నటిదాకా సీబీఐపై వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్.. ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు. దీని వెనక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశాలు ఏంటో ప్రజలకు చెప్పాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశాన్ని సీబీఐకి అప్పగించడం ముమ్మాటికి కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకమని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశాన్ని సీబీఐకే కాదు మరే ఇతర ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. బెదిరింపులు, కేసులు బీఆర్ఎస్‌కు కొత్త కాదని, ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News