‘ప్రజలు మిమ్మల్ని కొట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్.;
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలంటూ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీలంటూ డప్పు కొట్టుకున్న కాంగ్రెస్ సర్కార్.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అసలు వారికి ఆ హీమీలైనా గుర్తున్నాయా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని కబుర్లు చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు కావొస్తున్నా హామీల అమలుపై కసరత్తే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బెదిరించడం, అక్రమ అరెస్ట్‌లు చేయించడం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
‘‘ఎన్నికల సమయంలో ఆరు హామీలు ఇచ్చారు కదా.. తెలంగాణలోని ఏ గ్రామానికైనా వెళ్లి అన్ని హామీలు అమలు చేశామని చెప్పగలరా? ఇప్పటికే అబద్ధాలు చెప్పిన మీ నాయకులను ప్రజలు వెంటాడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు క్యాబినెట్ మంత్రులంతా కలిసి ఏదైనా గ్రామానిక వెళ్లి ఆరు హామీలు అమలు చేశామని చెప్పండి. మీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలపై ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టకపోతే.. నేను రాజకీయాలను విడిచి పెడతాను’’ అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. అయితే కేటీఆర్ సవాల్‌పై భట్టి ఇప్పటి వరకు స్పందించలేదు. మరి దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.