లోక్ సభ ఎన్నికల ముగింపుతో ఫోకస్ మార్చిన కేటీఆర్

అధికార పార్టీ పాలనపై ద్రుష్టి పెట్టింది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫోకస్ మార్చారు .

Update: 2024-05-15 08:56 GMT

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పార్టీలన్నీ రొటీన్ కార్యకలాపాల్లో పడ్డాయి. అధికార పార్టీ పాలనపై ద్రుష్టి పెట్టింది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫోకస్ మార్చి ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై దృష్టి సారించారు. అందులో భాగంగా బుధవారం ఈ నియోజకవర్గ నేతలతో ఎమ్మెల్సీ ఉపఎన్నిక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... "ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నల్లగొండ జిల్లాలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను నేనే ఇచ్చిన అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు."

"కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మకండి. మెగా DSC కాస్తా, ధగా DSC అయింది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలంటే ప్రశ్నంచే గొంతుకలు ఉండాలి. అందుకే ఇప్పుడు జరిగే ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ ని గెలిపించి శాసన మండలికి పంపించండి. తీన్మార్ మల్లన్న మీడియాను అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్స్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గెలిస్తే మరో నయీం అవుతాడు. గతంలో నయీంను చూశాం, ఇప్పుడు తీన్మార్ మల్లన్నను చూస్తున్నాం. అలాంటివాళ్ళకి ఓటేయకండి. ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్ధికి ఓటేయండని" కేటీఆర్ గ్రాడ్యుయేట్స్ కి పిలుపునిచ్చారు.

రాజకీయాలు పక్కన పెట్టండి వడ్లు కొనుగోలు చెయ్యండి.. కేటీఆర్

రాష్ట్రంలో రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. "ఎన్నికలు ఉన్నాయని నెల రోజుల నుండి రైతులను పట్టించుకోలేదు. కొలమంచ గ్రామంలో ధాన్యం కొనుగోలు చెయ్యకుండా రైతులను ఇబ్బందులు పెట్టారు. వడ్ల కొనుగోలు స్పీడప్ చెయ్యాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కామారెడ్డి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు కొనుగోలు చెయ్యాలని రైతులు రోడ్ల మీదా ధర్నాలు చేస్తున్నారు. రాజకీయాలు పక్కన పెట్టండి వడ్లు కొనుగోలు చెయ్యండి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుందని హెచ్చరిస్తున్నాం. తడిచిన ధాన్యం కొనుగోలు చేసేదాక రైతుల పక్షాన కేసీఆర్ ఉంటారని" కేటీఆర్ వెల్లడించారు.

Tags:    

Similar News