ఓఆర్ఆర్ టోల్ లీజ్‌లో నిజాలు తేలాలంటే విచారణ అలా జరగాల్సిందేనా..?
ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు విప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు విప్పారు. ఈ వ్యవహారంలో నిజంగా నిజాలు తెలియాలి అంటే సిట్ వేస్తే సరిపోదన్నారు. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలని, అంప్పులే ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారం నిగ్గుతేల్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ దగ్గర చేపట్టిన చిట్ చాట్‌లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. జాతీయ రహదారుల నుంచి డబ్బులు సేకరిస్తునస్న టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(టీఓటీ) విధానంలోనే తాము కూడా డబ్బులు సేకరించామని, ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చినట్లు ఆరోపిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ లీజును ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. మన దేశంలో టీఓటీ విధానం ఉంది. ఆ విధంగా వచ్చిన డబ్బును రైతు రుణమాఫీ కోసం వినియోగించామని కేటీఆర్ వివరించారు. ‘‘ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చింది. అమెరికా కూడా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించింది’’ అని తెలిపారు.
సిట్‌తో నిజాలు ఎలా వెల్లడవుతాయి..
‘‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టివోటి విధానంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించాం. ప్రయివేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్ అ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదు. గతంలో ఔవుటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన రూ.లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలుపైన హెచ్ఎండిఏ పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన హెచ్ఎండిఏ వేసిన కేసు అలాగే ఉంది. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డు పైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు. మరి ఎందుకు కుంభకోణం అంటున్న ఔవుటర్ రింగ్ రోడ్డు లీజ్‌ను రద్దు చేయడం లేదు. రేవంత్ రెడ్డి.. మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి’’ అని కోరారు.
వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి
‘‘అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌ను వెంటనే రద్దుచేసి. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరిపించాలి. ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారు. జడ్జ్ ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తాం. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి. పదివేల కోట్ల రూపాయల కోకాపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలి. ప్రభుత్వం సభ్యులకు స్పీకర్, ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఎలా అని శిక్షణ ఇచ్చానారు. స్పీకర్‌ని కూడా పదేపదే దళితుడు, దళితుడు అనడం అయన గౌరవాన్ని తగ్గించేలా చేయడమే’’ అని అన్నారు కేటీఆర్.
టీఓటీ విధానం అంటే ఏంటి..
ప్రజా నిధులతో నిర్మించిన హైవే ప్రాజెక్ట్‌లను పర్యవేక్షించడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(టీఓటీ). ఈ విధానం కింద ప్రాజెక్ట్ డెవలపర్ లేదా పెట్టుబడి దారుకు నిర్ణీత కాలపరిమితికి ఆ హైవేపై ప్రయాణించే వాహనాల నుంచి రుసుము అందుకే హక్కును అందిస్తుంది. ఆ ఒప్పందం ముగిసే వరకు కూడా ఆ ప్రజెక్ట్ పనితీరు, నిర్వహణకు ఆ రాయితీదారే బాధ్యత వహిస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి లాభం లేకపోలేదు. ఈ లీజ్ ఒప్పందం కోసం పెట్టుబడిదారులు, డెవలపర్స్ ముందుగా ప్రభుత్వానికి ఒకేసారి చెల్లించే డబ్బు.. మరికొన్ని అభివృద్ధి, నిర్వాహణ ప్రాజెక్ట్‌లను చేపట్టడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఇలా వచ్చే నిధుల ద్వారా కొత్త హైవేలను నిర్మించడం, ఇప్పటికే ఉన్నవాటిని సరిగా నిర్వహించడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రాంతాలకు సహాపడటం వంటి వాటిని ఉపయోగపడతాయి. అయితే జాతీయ హైవే రంగంలో ప్రైవేటు వారిని ప్రోత్సహించడం కోసం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ 2016లో ఈ టీఓటీ పద్దతిని తీసుకొచ్చింది.