కేటీఆర్ నమ్మకం కోల్పోయారా ?

ఫిరాయింపులపై అనర్హత వేటు పడటం ఖాయమైతే మరి తమ హయాంలో జరిగిన ఫిరాయింపుల్లో ఎంతమందిపై అనర్హత వేటు పడిందో కేటీఆర్ ముందు చెప్పాలి.

Update: 2024-08-06 09:40 GMT
KTR at Delhi

కేటీఆర్ తాజా మాటలు విన్నతర్వాత అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు రోజులుగా ఢిల్లీలోనే క్యాంపు వేసిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు ఫిరాయింపులపై హైకోర్టు తొందరగా నిర్ణయం తీసుకోకపోతే తాము సుప్రింకోర్టులో కేసు వేయటానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. తొందరలోనే పది నియోజకవర్గాల్లోను ఉపఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ బాగా నమ్మకంతో చెప్పారు. ఫిరాయింపులపై మణిపూర్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పదేపదే కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఫిరాయింపులపై అనర్హత వేటు పడటం ఖాయమని న్యాయనిపుణులు కూడా చెప్పారని కేటీఆర్ చెప్పటం విచిత్రంగానే ఉంది.

నిజంగానే ఫిరాయింపులపై అనర్హత వేటు పడటం ఖాయమైతే మరి తమ హయాంలో జరిగిన ఫిరాయింపుల్లో ఎంతమందిపై అనర్హత వేటు పడిందో కేటీఆర్ ముందు చెప్పాలి. పదేళ్ళ తమ హయాంలో ఇతరపార్టీల నుండి నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. ఇతర పార్టీల్లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 47 మందిలో ఏ ఒక్కరిపైన కూడా అనర్హత వేటు పడలేదు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ కూడా స్పీకర్, మండలి ఛైర్మన్లకు పిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదు. అందుకనే కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. పిటీషన్లు కోర్టులో అడ్మిట్ అయ్యాయే కాని ఎలాంటి తీర్పూ రాలేదు. అనర్హత వేటు వేయించేందుకు కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు.

ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదు ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా పెద్దఎత్తున ఫిరాయింపులు జరిగాయి. అయితే ఎవరిమీదా అనర్హత వేటుపడింది లేదు. నిజానికి కోర్టులే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవు. మహాయితే ఫిరాయింపులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై తొందరగా నిర్ణయం తీసుకోమని స్పీకర్, ఛైర్మన్లకు సూచనలు ఇస్తాయంతే. ఇపుడు పార్టీ ఫిరాయించటం అనైతికమని గొంతుచించుకుంటున్న కేటీఆర్ తమ హయాంలో ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించారో సమాధానం చెప్పాల్సుంటుంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ దెబ్బకు బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అందుకనే పార్టీలో ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగి తాము కూడా కాంగ్రెస్ లోకి ఫిరాయించకుండా నిరోధించటానికే ఫిరాయింపులపై అనర్హత వేటు పడటం ఖాయమని, తొందరలోనే ఉపఎన్నికలు వస్తాయని చెబుతున్నట్లున్నారు.

హైకోర్టు గనుక తొందరలో ఏదో నిర్ణయం తీసుకోకపోతే తాము సుప్రింకోర్టులో కేసు వేస్తామని కేటీఆర్ ఎందుకు చెప్పారు ? ఎందుకంటే ఫిరాయింపులకు వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వస్తుందనే నమ్మకం కేటీఆర్లో ఉన్నట్లు లేదు. లేదా తీర్పు ఇవ్వకుండా తొందరగా నిర్ణయం తీసుకోమని హైకోర్టు స్పీకర్ కు సూచన మాత్రమే చేస్తుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే సడెన్ గా సుప్రింకోర్టులో కేసంటు మొదలుపెట్టారు. హైకోర్టు లేదా సుప్రింకోర్టులో ఫిరాయింపులపై అనర్హత వేటు విషయం నెలరోజుల్లోనే తేలిపోతుందని కేటీఆర్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తమ హయాంలో జరిగిన ఫిరాయింపులపై సంవత్సరాలైనా కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న విషయం మరచిపోయినట్లున్నారు.

ఒకవేళ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చినా దాన్ని స్పీకర్ అమలుచేయకపోతే అప్పుడు కేటీఆర్ ఏమిచేస్తారు ? కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఎలాగూ ఉంటుంది. కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తు ఫిరాయింపులు కోర్టులో మళ్ళీ కేసు వేస్తే అది ఎప్పటికి తెములుతుంది. ఏ రకంగా చూసుకున్నా ఫిరాయింపులపై అనర్హత వేటు అన్నది ఇప్పట్లో తేలేట్లుగా లేదు. కాకపోతే పార్టీలో నుండి మరింతమంది ఎంఎల్ఏలు జారిపోకుండా కేటీఆర్ ఊరడింపు మాటలు, ప్రకటనలు చేస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది.

Tags:    

Similar News