మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేటీఆర్ నివాళులు

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు.

Update: 2024-12-28 06:43 GMT

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావుడి మరణం ఈ దేశానికి తీరని లోటని, ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేవని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్‌కు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేదని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ మహానుభావుడికి పార్టీ తరపున నివాళులు అర్పించడానికి వచ్చామని చెప్పారు. దేశ క్షేమాన్ని కాంక్షించే వారిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో దాదాపు రెండు సంవత్సరాలు కేసీఆర్ పనిచేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, తెలంగాణ కోసం మన్మోహన్ సింగ్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయని, ఆ సమయంలో ఎట్టిపరిస్థితుల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని మన్మోహన్ సింగ్ భరోసా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు న్యాయమైన డిమాండ్ అని మన్మోహన్ సింగ్ కాంక్షించారని తెలిపారు.

భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో తన నైపుణ్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన నేత మన్మోహన్ సింగ్ అని, ఆయన హయాంలో మన దేశ జీడీపీ అత్యధికంగా 10శాతం వృద్ధిని చూసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా అత్యంత సౌమ్యుడిగా వివాద రహితునిగా ఉన్న గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. ప్రపంచంలో భారత్‌కు వన్నె తెచ్చని నాయకుడు ఆయన అని, దేశ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన నేత మన్మోహన్ సింగ్ అని చెప్పారు. అటువంటి వ్యక్తి మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని, ఒక మహోన్నతుడిని ఈ దేశం కోల్పోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News