‘పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఏడ్పులా?’

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి దుర్భరంగా తయారయిందా? అంటే కేటీఆర్ సమాధానం ఏంటో తెలుసా..;

Update: 2024-12-31 06:29 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి దుర్భరంగా తయారయిందా? పట్టెడన్నం కోసం ఆర్తనాదాలు పెట్టాల్సి వస్తుందా? ఆహారం తినకుండా ఆకలికి కేకలు.. తింటే చావు కేకలు వేసే పరిస్థితులు నెలకొన్నాయా? గురుకుల విద్యార్థుల బాధలు రేవంత్ సర్కార్ చెవికెక్కడం లేదా? అంటే అవుననే అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గురుకుల విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయని, తినడానికి సరైన ఆహారం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కదిలిస్తే కన్నీరొస్తోందని, పట్టెడన్నం కోసం చిన్నారులు ఇంతలా అవస్థలు పడాలా? ఆర్తనాదాలు చేయాలా? అంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు సోపాలనై చిన్నారులకే సరైన ఆహారం పెట్టలేని ఈ నేత.. ఇక రాష్ట్రాన్ని ఏం ముందుకు తీసుకెళ్తారంటూ విమర్శలు చేశారు. 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణలో పట్టెడన్నం కోసం చిన్నారులు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం తనను కలచివేస్తోందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ ఒకటి పెట్టారు. ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా! కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా ! దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా! పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా ! సిగ్గు సిగ్గు ! ఇది పాలకుల పాపం.. విద్యార్థులకు శాపం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News