కేటీఆర్ ఊచలు లెక్కబెట్టాల్సిందే..వేములవాడ సభలో సీఎం వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కేటీఆర్ ఢిల్లీ కాదు చంద్రమండలం పోయినా సరే,కుట్రకు ఊచలు లెక్కబెట్టాల్సిందేనన్నారు.
By : The Federal
Update: 2024-11-20 12:55 GMT
కేటీఆర్ ఢిల్లీ కాదు చంద్రమండలం పోయి ఫిర్యాదు చేసుకున్నా సరే... ఆయన చేసిన కుట్రకు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని సీఎం ఎ రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ సభలో వ్యాఖ్యానించారు.
‘‘ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేద్దామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు,పరిశ్రమలు తెస్తే మా ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు’’అని సీఎం ఆరోపించారు.
అధికారులపై రౌడీ మూకల దాడి
‘‘కొంత మంది రౌడీ మూకలను తయారు చేసి అధికారులపై దాడి చేయించారని,పైగా కేసులు పెట్టారని అంటున్నారు...నీ కొడుకు.. నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్..తెలంగాణలో పరిశ్రమలు పెట్టోద్దా.. మా పిల్లలకు ఉద్యోగాలు రావొద్దా?’’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.పదేళ్లు పాలించిన మీరు భూసేకరణ చేయలేదా? కొండపోచమ్మ సాగర్ లో భూములు గుంజుకున్న చరిత్ర మీది..కొడంగల్ లో భూసేకరణ చేస్తే కడుపుమంట దేనికి? కొడంగల్ అంటే మీకు ఎందుకు ఇంత కక్ష అని సీఎం అడిగారు.అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే..చివరగా కేసీఆర్ కు ఒక్క మాట చెబుతున్నా.. అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా అని సీఎం కేసీఆర్ ను కోరారు.
ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడ అభివృద్ధి
భూములు కోల్పోయి బాధలో ఉన్న వారిని మా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుంది,పరిహారం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆనాడు పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని మాట ఇచ్చానని, ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడే మాట ఇచ్చాం..కలికోట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పాదయాత్రలో చెప్పాం..కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పూర్తవుతాయని ఆనాడే చెప్పా..ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’అని సీఎం పేర్కొన్నారు.
కరీంనగర్ ప్రాజెక్టులపై సమీక్ష
నవంబర్ 30వతేదీలోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేస్తారని సీఎం చెప్పారు. దేశానికి దశ-దిశ సూచించిన నేత పీవీ పుట్టిన గడ్డ కరీంనగర్ అని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఈ కరీంనగర్ గడ్డపై నుంచే సోనియమ్మ మాట ఇచ్చారు...ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంత త్యాగానికైనా సిద్దమవుతుందని సోనియమ్మ నిరూపించారని సీఎం చెప్పారు.
బీజేపీని గెలిపిస్తే ఏం జరిగింది?
కరీంనగర్ నగర్ లో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు ఏం ఒరిగింది?కరీంనగర్ అభివృద్ధి కోసం పార్లమెంట్ లో ప్రశ్నించారా? జిల్లా అభివృద్ధికి చిల్లి గవ్వ తెచ్చారా..?అలా చేసి ఉంటే జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలేవా? అని సీఎం ప్రశ్నించారు. పదేళ్లలో రూ.20లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. 100 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదు?ప్యాకేజీ 9 ఎందుకు పూర్తి చేయలేదు? అని సీఎం అడిగారు.
గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డ్
గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని,ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ కార్మికులకు రూ.5లక్షల ప్రమాదబీమా అందిస్తున్నామని సీఎం చెప్పారు.కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులను మేం పది నెలల్లో చేసి చూపించాం.ఏలేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్లు.. వాళ్లను ఓడించినా వాళ్ల తీరు మారలేదన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా వచ్చింది.. ఇప్పుడు వాళ్ల వేషాలు చూస్తోంటే వాళ్ల మెదడు కూడా పోయినట్టుంది,పదేళ్లు ఏం వెలగబెట్టారని.. పదినెలల్లో మనల్ని దిగి పొమ్మంటున్నారు..? అని సీఎం వివరించారు.
అసెంబ్లీకి రండి
‘‘మీ నొప్పికి మా కార్యకర్తలకు మందు ఎక్కడ పెట్టాలో తెలుసు..రుమాఫీపై దుష్ప్రచారం చేసున్న మీకు .. ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే అసెంబ్లీకి రా...మా వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెబుతారు.పది నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇచ్చాం.. లెక్క కట్టి చూపిస్తా..ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా..మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో... మా పదినెలల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చర్చకు పెడదాం రా’’ అని సీఎం రేవంత్ సవాలు విసిరారు.
కాళేశ్వరం కుంగినా వరి పండింది...
ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్ దని రేవంత్ విమర్శించారు.కానీ ఇప్పుడు 66 లక్షల 1కోటి 53లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది.ఆయన కట్టిన కాళేశ్వరం కుంగిపోయినా... ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్లు లేకుండా 1కోటి 53లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది..పదేళ్లలో కేసీఆర్ ప్రాజెక్టుల కోసం 1లక్ష 23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు..ఏ ప్రాజెక్టునైనా పూర్తిచేశారా? ప్రజలకు నీళ్లు ఇచ్చామని చెప్పగలరా? రంగనాయక్ సాగర్ కోసం సేకరించిన భూముల్లో హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నారు.అన్ని లెక్కలు తీస్తాం.. అన్నీ బయటకు తీస్తాం,కొండపోచమ్మ సాగర్ కట్టింది కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్లేందుకే..బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బామ్మర్ది డ్రగ్స్ తీసుకున్నా పట్టుకోవద్దట...పేదలకు ఒక చట్టం నీకో చట్టమా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.