‘సవాళ్లు చేసుడు.. పరారీ కావుడు.. రేవంత్‌కు కొత్తేం కాదు’
మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే.. అసెంబ్లీలో కూడా సిద్ధం.;
సవాల్ చేయడం అంటే నోటికొచ్చింది మాట్లాడుడు కూడా రేవంత్.. ధైర్యంగా ఉండి ఎదుర్కొనే దమ్ము ఉండాలే అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీకు అదెప్పుడూ లేదని తమకు తెలుసని, ఈరోజు ఈ విషయం రాష్ట్రప్రజలకు కూడా అవగతమైపోయిందంటూ విమర్శలు గుప్పించారు. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సంక్షేమాన్ని చేరవేస్తుందని, దమ్ముంటే చర్చకు రావాలంటూ ఇటీవల రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కాగా దానిని కేటీఆర్ స్వీకరించారు. రేవంత్‌తో చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తాము చాలని అన్నారు. అంతేకాకుండా చర్చకు ఎక్కడి రావాలో నిర్ణయించడానికి మూడు రోజుల సమయం ఇస్తున్నానని, లేని పక్షంలో జులై 8న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని అన్నారు. ఒక్కరే వచ్చినా మందితో వచ్చినా తాము చర్చకు రెడీ అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ చేశారు. అదే విధంగా మంగళవారం.. కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. ఛాలెంజ్ చేసిన చీప్ సీఎం ఏరీ అంటూ కేటీఆర్ చురకలంటించారు.
అసెంబ్లీలో అయినా చర్చకు రెడీ: కేటీఆర్
అంతకన్నా ముందు కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎన్నో సార్లు ఆహ్వానించాం. అసెంబ్లీలో కాదంటే.. ప్రెస్‌క్లబ్‌లోనైనా చర్చకు రావాలని చెప్పా. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించా. సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీలో ఉన్నారని తెలిసింది... సీఎం రాకుంటే మంత్రులైనా రావాలి. సీఎం ఇవాళ హాజరుకాకుంటే.. మరో రోజు చర్చకైనా మేం సిద్ధం. సీఎం రేవంత్‌రెడ్డికి వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నాం. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే.. అసెంబ్లీలో కూడా సిద్ధం. ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రేవంత్‌రెడ్డి తప్పుకొంటే.. అభివృద్ధి అంటే ఏంటో కేసీఆర్ చేసి చూపిస్తారు’’ అని కేటీఆర్ అన్నారు.
భయపడే ఢిల్లీ టూర్
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నాలుగు రోజుల ముందే ఛాలెంజ్ చేశారని, దానిని ఎదుర్కొనే దమ్ములేకనే రేవంత్.. ఆగమేఘాలపై ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై చర్చించే దమ్ము, ధైర్యం, అవగాహన ఏదీ కూడా రేవంత్‌కు లేవన్నారు. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా.. చర్చకు వచ్చి ఉండేవారని ఎద్దేవా చేశారు. సభలు పెట్టి నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పించడం తప్ప తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, సీఎం రేవంత్‌కు ఏం చేతకాదంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
సమవుజ్జీతో జరిగితేనే చర్చ: కాంగ్రెస్
అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ శ్రేణులు ధీటుగా బదులిస్తున్నాయి. చర్చ అనేది ఇద్దరు సమవుజ్జీల మధ్య జరుగుతుందని అన్నారు. రేవంత్‌తో చర్చలకు వచ్చే స్థాయి కేటీఆర్‌కు లేదని కాంగ్రెస్ శ్రేణులు బదులిస్తున్నాయి. అయినా ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడీ అన్నట్లు కేసీఆర్‌కు ఛాలెంజ్ విసిరితే కేటీఆర్ ఎందుకు ఇంత హడావుడీ చేస్తున్నారు. ఆయనకు విసిరిన సవాళ్లను స్వీకరించే దమ్ములేదు కానీ.. పక్కనోళ్లకు విసిరిన సవాళ్లకు మాత్రం అతిగా స్పందిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.