జన్వాడ ఫాంహౌస్ ఖాళీ..హైడ్రాకు లైన్ క్లియర్ ?

ఎలాగూ ఫాంహౌస్ ను కేటీఆర్ ఖాళీ చేసేశారు కాబట్టి హైడ్రా మొత్తం ఫాంహౌస్ ను కూల్చేయటానికి మార్గం సుగమమైంది.

Update: 2024-08-28 06:30 GMT
Janwada farm house

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్వాడ ఫాంహౌస్ ను ఖాళీచేశారు. శంకర్ పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలోని ఫాంహౌస్ బుల్కాపూర్ నాలాను ఆక్రమించి నిర్మించినట్లు పెద్దఎత్తున ఆరోపణలున్న విషయం తెలిసిందే. అందుకనే జన్వాడ ఫాంహౌస్ ను ఏ రోజైనా హైడ్రా కూల్చేయచ్చనే ప్రచారం అందరికీ తెలిసిందే. దానికితోడు హైడ్రా కూడా ఫాంహౌస్ యాజమాని ప్రదీప్ రెడ్డికి నోటీసులిచ్చింది. దాంతో ఫాంహౌస్ కూల్చివేత తప్పదని అర్ధమైన ప్రదీప్ కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టు నుండి ప్రదీప్ కు ఎలాంటి ఉపశమనం లభించలేదు. దాంతో ఏరోజైనా ఫాంహౌస్ ను హైడ్రా కూల్చేస్తుంది ప్రదీప్ తో పాటు కేటీఆర్ కు కూడా అర్ధమైపోయింది. అందుకనే కేటీఆర్ ఫాంహౌస్ ను ఖాళీచేసినట్లు సమాచారం.



 ఫాంహౌస్ ప్రదీప్ ది అయితే కేటీఆర్ కు ఏమి సంబంధం ? ఏమి సంబంధం అంటే ఫాం హౌస్ ప్రదీప్ దే అయినా ఉంటున్నది మాత్రం కేటీఆరే. పదేళ్ళుగా ఈ ఫాం హౌస్ కేటీఆర్ ఆధీనంలోనే ఉంది. మంత్రులు, కాంగ్రెస్ నేతలేమో జన్వాడ ఫాంహౌస్ కేటీఆర్ దే అని పదేపదే చెబుతున్నారు. అయితే కేటీఆర్ మాత్రం ప్రదీప్ ఫాంహౌస్ ను తాను లీజుకు తీసుకుని ఉంటున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ ప్రకటనను ఎవరూ నమ్మటంలేదు. సరే ఫాంహౌస్ అసలు ఓనర్ ఎవరైనా ఇపుడు హైడ్రా కూల్చేస్తుందన్న విషయం అర్ధమైపోయింది.

మంగళవారం సాయత్రం ఇరిగేషన్, రెవిన్యు శాఖల ఇంజనీర్లు, వర్క్ ఇన్సెప్టెక్టర్లు ఫాంహౌస్ లోకి వెళ్ళి మొత్తం కొలిచారు. ఇక్కడ విషయం ఏమిటంటే బుల్కాపూర్ నాలాను ఆక్రమించి ఫాంహౌస్ ను నిర్మించినట్లు స్పష్టంగా బయటపడింది.




ఫాంహౌస్ కాంపౌడ్ వాల్ తో పాటు ప్రధాన గేటును బుల్కాపూర్ నాలాను ఆక్రమించి కట్టేసినట్లు 2020లో ఇరిగేషన్ అధికారుల తనిఖీలోనే బయటపడింది. అయితే అందులో ఉంటున్నది కేటీఆర్ కావటంతో దానిపైన యాక్షన్ తీసుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది. సర్వే నెంబర్లు, 301, 302,309, 311,313లో దాదాపు 27 ఎకరాల్లో ఫాంహౌస్ ను నిర్మించుకున్నారు. ఫాంహౌస్ మొత్తం నిర్మాణాల్లో నాలాలో 2.24 ఎకరాలు, 11 గుంటలను ఫాంహౌస్ ఆక్రమించినట్లు బయటపడినట్లు సమాచారం. ఫాంహౌస్ తూర్పుభాగంలోని నాలాలో, బఫర్ జోన్లో కొంతభాగం ఆక్రమణలకు గురైనట్లు తాజా సర్వేలో కూడా బయటపడింది. ఫాంహౌస్ లోని ఆక్రమణలను బుధవారం కూడా వివిధ శాఖల ఉన్నతాధికారులు మరోసారి పరిశీలించే అవకాశం ఉంది.



 తాజా పరిణామాలతో ఫాంహౌస్ కూల్చివేస్తారన్న విషయం కేటీఆర్ కు అర్ధమైనట్లుంది. అందుకనే ఎప్పుడైతే ఫాంహౌస్ వివాదం మొదలైందో వెంటనే ఖాళీ చేసేసినట్లు తెలుస్తోంది. కూల్చివేతను అడ్డుకోవాలని కోర్టులో కేసు వేస్తే దానికి కూడా సానుకూలత కనబడలేదు. దాంతో ఇక లాభంలేదని అర్ధమైపోయినట్లుంది. అందుకనే పదేళ్ళుగా ఉంటున్న ఫాంహౌస్ ను వేరేదారిలేక ఖాళీ చేసేశారు. ఫాంహౌస్ లోని ఖరీదైన ఫర్నీచర్ తదితరాలను తండ్రి కేసీఆర్ ఫాంహౌస్ కు తరలించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఎంతో మక్కువతో కేటీఆర్ తన టేస్టుకు తగ్గట్లుగా ఫాంహౌస్ ను తీర్చిదిద్దుకున్నారు. అలాంటిది తప్పనిస్ధితిలో ఫాంహౌస్ ను వదిలేయాల్సి రావటం బాధాకరమనే చెప్పాలి. మంత్రుల వాదన ఏమిటంటే ఫాంహౌస్ ప్రదీప్ రెడ్డిదే అయినా బుల్కాపూర్ నాలాను ఆక్రమించి నిర్మించిన ఫాంహౌస్ లో కేటీఆర్ ఎలాగున్నారు ? అని. కేటీఆర్ కూడా ఫాంహౌస్ తనది కాదని అంటున్నారే కాని అక్రమనిర్మాణం కాదని ఎక్కడా చెప్పటంలేదు.




 ఎలాగూ ఫాంహౌస్ ను కేటీఆర్ ఖాళీ చేసేశారు కాబట్టి హైడ్రా మొత్తం ఫాంహౌస్ ను కూల్చేయటానికి మార్గం సుగమమైంది. ఏ నిముషంలో అయినా పొక్లైన్లు, క్రేన్లు ఫాంహౌస్ లోకి ఎంటరయ్యే అవకాశముందని మంగళవారం రాత్రినుండే బాగా ప్రచారం జరుగుతోంది. మరి హైడ్రా ఎప్పుడు యాక్షన్లోకి దిగుతుందో చూడాలి.

Tags:    

Similar News