బండికి కేటీఆర్ లీగల్ నోటీసు

తన పరువుకు భంగం కలిగే విధంగా బండి వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారని కేటీఆర్ ఫీలవుతు హైకోర్టు(High Court)లో పరువునష్టం దావా వేశారు.

Update: 2024-10-23 07:35 GMT
KTR and Bandi

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు. తన పరువుకు భంగం కలిగే విధంగా బండి వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారని కేటీఆర్ ఫీలవుతు హైకోర్టు(High Court)లో పరువునష్టం దావా వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేసినందుకు బండి(Bandi Sanjay) వారంరోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. లేకపోతే లీగల్ యాక్షన్(Legal Action) తప్పదని నోటీసులో స్పష్టంగా హెచ్చరించారు.

తాను డ్రగ్స్(Drugs) తీసుకుంటానని బండి ఆరోపణలు చేయటంతో తన పరువుకు భంగం కలిగినట్లు కేటీఆర్ చెప్పారు. అక్టోబర్ 19వ తేదీన బండి మీడియాతో మాట్లాడుతు ‘కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు, బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నపుడు ఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కు పాల్పడ్డాడు’ అని ఆరోపించినట్లు కేటీఆర్ తన నోటీసుల్లో చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనతో పాటు తన తండ్రి కేసీఆర్(KCR) పేరును కూడా బండి ప్రస్తావించారని కేటీఆర్ గుర్తుచేశారు. బండి చేసిన ఆరోపణలు తన వ్యక్తిత్వాన్ని అవమానించినట్లుగా, ప్రతిష్టను దిగజార్చేట్లుగా ఉందని కేటీఆర్ మండిపోయారు.

కేవలం తనను అప్రదిష్టపాలు చేయటం కోసమే బండి నిరాధార ఆరోపణలు చేసినట్లుగా కేటీఆర్ అనుమానించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, టెలిఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు, రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నట్లు చేసిన ఆరోపణలను బండి నిరూపించాలని కేటీఆర్ సవాలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. బండి చేసిన ఆరోపణలు మీడియా, సోషల్ మీడియా(Social Media)లో విస్తృతంగా ప్రచారం జరిగిన కారణంగా అవి చదివిన వాళ్ళు నిజమని నమ్మే ప్రమాదముందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా బండి నిరాధార ఆరోపణలు చేయటం ఏమిటని మండిపోయారు. తనపైన బురదచల్లటమే టార్గెట్ గా బండి ఆరోపణలు చేసినట్లు అర్ధమవుతోందన్నారు.

ఐదుసార్లు ఎంఎల్ఏగా తొమ్మిదేళ్ళు మంత్రిగా తెలంగాణా(Telangana)కు సేవచేసిన తనను బండి టార్గెట్ చేయటం బాధాకరమన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి నారాధారమైన ఆరోపణలకు బండి దిగినట్లు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తన ప్రతిష్టను దిగజార్చాలన్న కుట్ర తప్ప బండి ఆరోపణల్లో ఇంకేమీ కనబడటంలేదన్నారు. అసత్య ప్రచారం చేసినందుకు క్షమాపణలైనా చెప్పాలి లేకపోతే లీగల్ పరిణామాలను అయినా ఎదుర్కోవాలని బండిని కేటీఆర్ హెచ్చరించారు.

తాటాకు చప్పుళ్ళకు భయపడేదిలేదు

కేటీఆర్ లీగల్ నోటీసుల విషయమై కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతు తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్నారు. ఆరోపణలకు లీగల్ నోటీసులే సమాధానమా అని ఎద్దేవా చేశారు. లీగల్ నోటీసును లీగల్ నోటీసుతోనే సమాధానం చెబుతానని బండి స్పష్టంచేశారు. కేటీఆర్ తనను అవమానిస్తు మాట్లాడిన తర్వాతే తాను కేటీఆర్ గురించి మాట్లాడానని చెప్పారు. మరి వీళ్ళ లీగల్ ఫైట్ ఎక్కడకు దారితీస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News