’గ్రీన్ ఇండియా‘ సంతోష్ ఇంత పని చేశాడా?
మొక్కలు నాటుతూ, నాటిస్తూ సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించుకున్న ఎంపీ సంతోష్.. తెర వెనుక భుకాబ్జాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొక్కలు నాటుతూ, నాటిస్తూ సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించుకున్నారు ఆయన.. తెర వెనుక భుకాబ్జాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు వ్యక్తం అవుతున్నాయి. నిషేధిత భూములకు అక్రమంగా పట్టాలు పుట్టించుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆయన పై వస్తోన్న భూ ఆరోపణ ఏంటంటే..
"ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. కేసీఆర్ బంధువు, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ధరణిని ఆసరాగా చేసుకుని 22 ఎకరాల నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గ్రామంలోని అందరి భూములు నిషేధిత జాబితాలో ఉంటే.. సంతోష్ భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. ధరణి ద్వారా తొలుత పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి.. వాటిని పెద్దలు చేజిక్కించుకున్న తర్వాత దాని నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేసుకునే వ్యవహారం గత ప్రభుత్వంలో కొనసాగింది. సంతోష్, వారి కుటుంబానికి చెందినవారి పేరుమీద కూడా భూములున్నాయి. అప్పటివరకు 22(A) కింద నిషేధిత జాబితాలో ఉన్న భూమి వారి పేరిట పట్టా అయింది. ఆ గ్రామంలో అందరి భూములూ నిషేధిత జాబితాలో ఉంటాయి. కానీ, ఆయనకు మాత్రం ఆ 22 ఎకరాలు పట్టా అయిపోయింది. ఎంపీ సంతోష్ భార్య, ఓ ఎమ్మెల్సీ, ఇద్దరు ఆ పార్టీ నేతలు కలిసి ఒకే గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 22 ఎకరాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నలుగురికి చెందిన ఒక కంపెనీ పేరుతో ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా పట్టాలుగా మార్చుకున్నారనేందుకు ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే." సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత, ధరణీ కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంతోష్ గురించి ఇలా అన్నారు.
ఎవరీ సంతోష్..
ఎంపీ జోగినపల్లి సంతోష్ కేసీఆర్ తోడల్లుడి కొడుకు. మొదట్లో ఆయన కేసీఆర్ సహాయకుడిగా ఉండేవారు. సీఎంని కలవడానికి వచ్చే ముఖ్య అతిథుల్ని రిసీవ్ చేసుకోవడం వంటి పనులు చూసుకునేవారు. అలా కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా మారిపోయారు. రాజ్యసభ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఎంపీలపై నిఘా కోసం తన మనిషి ఒకరు ఉండాలనే ఆలోచనతో కేసీఆర్ సంతోష్ కుమార్ ని రాజ్యసభ ఎంపీ చేశారని టాక్. పేరు కు ఎంపి అయినా ఆయన రాజకీయాలు మాట్టాడలేదు. ఎవరికి అభ్యంతరంలేని, ఈజీ గా మాంచి పేరు వచ్చేమొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తాను మొక్కలు నాటి పొలిటీషియన్స్ కి, మూవీ సెలబ్రిటీలకు మొక్కలు నాటాలని చాలెంజ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసేవారు. సెలబ్రిటీలు తాము మొక్కలు నాటి మరికొందరికి చాలెంజ్ విసిరేవారు. రాజమౌళి, ప్రభాస్, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇలా ప్రముఖులందరితో ఫోటోల దిగడమే ఆయన వ్యాపకం. దీనికి ప్రభుత్వం నుంచి ఫుల్ సహకారం లభించేంది. లక్షలు కోట్లలో మొక్కలు నాటించినట్లు రోజూ ప్రచారం.
టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ బిగ్ షాట్స్ అమితాబ్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ తో పాటు పలు భాషల్లోని టాప్ హీరో హీరోయిన్స్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. హైదరాబాద్ కి వచ్చిన బాలీవుడ్, హాలీవుడ్ సెలెబ్రిటీలని కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటించేవారు. దీంతో ఎంపీ సంతోష్ కుమార్ కూడా సెలబ్రిటీ అయిపోయారు. ప్రారంభోత్సవాలకి ఈయనకి ప్రత్యేక ఆహ్వానాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఒక్క గంటలో 3,54,900 మొక్కలు నాటి సామాజిక సేవ భాగంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు ఎంపీ సంతోష్. మొక్కలు నాటి తెలంగాణకి గ్రీన్ కవర్ వేద్దాం అని చెప్పే సంతోష్ ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న భూములకి పట్టాలు పుట్టించుకున్నారని ఆరోపణలు రావడం గమనార్హం.
ఈ గ్రీన్ కార్యక్రమం అంతా ఇలాంటి కబ్జాలు కనిపించుకుండా ఉండేందుకేనేమో అనే అనుమానం వస్తుంది.